ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అత్యవసర భేటీ, బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది ?
x
KCR and leaders meeting at Erravalli farm house(File Photo)

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అత్యవసర భేటీ, బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది ?

హరీష్, కేటీఆర్ ను విచారించిన సిట్ అధికారులు తొందరలోనే కేసీఆర్ ను కూడా విచారించేందుకు రెడీ అవుతున్నారు అన్నదే అసలు విషయం


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రంగా గులాబీదళంలో ఏదో జరుగుతోంది. శనివారం మధ్యాహ్నం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్(KTR) కేటీఆర్, ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావుతో పాటు సీనియర్ నేతలంతా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకుని కేసీఆర్ తో భేటీ అయ్యారు. (Telephone Tapping)టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో శుక్రవారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాదాపు 7 గంటలు కేటీఆర్ ను విచారించింది కదా. ఆ విచారణలో ఏమి జరిగింది అన్న విషయాన్ని(KCR) కేసీఆర్ కు వివరించేందుకే అందరు ఫామ్ హౌస్ కు చేరుకున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. అయితే అసలు విషయం అదికాదన్న ప్రచారం కూడా మొదలైంది.

హరీష్, కేటీఆర్ ను విచారించిన సిట్ అధికారులు తొందరలోనే కేసీఆర్ ను కూడా విచారించేందుకు రెడీ అవుతున్నారు అన్నదే అసలు విషయం. కేసీఆర్ బిడ్డ కవిత, ఆమె భర్త అనీల్ కుమార్ విచారణ కూడా తొందరలోనే ఉంటుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. రాజకీయ ప్రత్యర్దులతో పాటు అనేకమందిపైన అనుమానంతో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వేలాది ఫోన్ల ట్యాపింగ్ అరాచకం జరిగిందన్నది వాస్తవం. ట్యాపింగ్ అరాచకానికి బయటవాళ్ళే కాదు స్వయాన కూతురు కల్వకుంట్ల కవిత, ఆమె భర్త ద్యావనపల్లి అనీల్ కుమార్ కూడా బాధితులే. వేలాది ఫోన్లను ట్యాప్ చేయించటంలో భాగంగా కన్న కూతురు, అల్లుడి ఫోన్లను కూడా విడిచిపెట్టలేదంటేనే కేసీఆర్ లో ఎంతటి అనుమానం, భయం పేరుకుపోయిందో అర్ధమవుతోంది.

విచారణ తర్వాత కేటీఆర్, సీనియర్ నేతల వాదనల్లో డొల్లతనమంతా బయటపడింది. విచారణకు హాజరయ్యే ముందు కూడా కేటీఆర్ మీడియాతో, పార్టీ సమావేశంలో మాట్లాడుతు ట్యాపింగ్ అసలు జరగనే లేదని చాలాసార్లు బుకాయించారు. జరగని ట్యాపింగ్ జరిగినట్లుగా సిట్ అధికారులు డ్రామాలు ఆడుతున్నట్లు మండిపడ్డారు. తన ఫోన్ తో పాటు భర్త అనీల్ ఫోన్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్యాపింగ్ జరిగిందన్న కవిత ఆరోపణలను ప్రస్తావిస్తే మాత్రం కేటీఆర్, హరీష్ నోరిప్పటంలేదు. సరే ఈవిషయాన్ని వదిలేస్తే విచారణ జరుగుతున్నపుడు, తర్వాత కేటీఆర్ విచిత్రమైన లాజిక్ మొదలుపెట్టారు. అదేమిటంటే ప్రభుత్వంలో ట్యాపింగ్ అన్నది రాజులకాలం నుండి జరుగుగుతున్నదే అని.

అలా మొదలైన కేటీఆర్, నేతల వాదన చివరకు ఎక్కడకు చేరుకున్నదంటే ట్యాపింగ్ తప్పేకాదని, ట్యాపింగ్ చట్టబద్దమే అని ఉల్టాగా వాదించేస్ధాయికి దిగజారింది. అసలు ట్యాపింగే జరగలేదని వాదించిన గులాబీదళం చివరకు ట్యాపింగ్ తప్పేకాదని సమర్ధించుకునేదాకా దిగజారిపోయింది. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పేనట్లు ట్యాపింగ్ చట్టబద్దమే అయితే తమ హయాంలో చట్టబద్దంగా ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయించారో కేటీఆర్ చెప్పగలరా ? చట్టబద్దంగానే ట్యాపింగ్ జరిగినపుడు ట్యాప్ చేయించిన ఫోన్ నెంబర్లను బయటపెట్టడానికి కేటీఆర్ భయపడాల్సివన అవసరం ఏముంది ?

ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే చట్టవిరుద్ధంగా జరిగిన ట్యాపింగ్ వ్యవహారంలో తాము పూర్తిగా ఇరుక్కోబోతున్నట్లు కేటీఆర్ అండ్ కో కు బాగా అర్ధమవుతున్నట్లుంది. అంతిమంగా ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకునేది కేసీఆర్ కే అనే అనుమానాలు పెరిగిపోతున్నట్లున్నాయి. ట్యాపింగ్ చట్టబద్దమా ? కాదా అన్న విషయాన్ని సిట్ అధికారులు చూసుకుంటారు. సిట్ విచారణకు కేసీఆర్ ను పిలిస్తే పరిస్ధితి ఏమిటన్నదే ఇపుడు అసలైన పాయింట్. చూద్దాం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ?

Read More
Next Story