
ఐదు మున్సిపాలిటీలు కేసీఆర్ బర్త్‌డే గిఫ్ట్: మహిపాల్
పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ క్లిన్ స్వీప్. ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా. అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున నిధుల హామీ.
పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల విజయాన్ని కేసీఆర్ పుట్టినరోజు కానుకగా అందించామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను సన్మానించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. గుమ్మడిదల, గడ్డపోతారం, జిన్నారం, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ ఆధిపత్యం సాధించింది. కాంగ్రెస్ ఏ ఒక్క చోటా మెజార్టీ వార్డులు గెలవలేకపోయింది. గుమ్మడిదలలో భారీ మెజార్టీతో, గడ్డపోతారంలో స్పష్టమైన ఆధిక్యంతో బీఆర్‌ఎస్ గెలిచింది. మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో కూడా అత్యధిక వార్డులు దక్కాయి.
ఇస్నాపూర్‌లో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. బీఆర్‌ఎస్ 12, కాంగ్రెస్ 10, స్వతంత్రులు 4 వార్డులు గెలిచారు. ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ వైపు వెళ్లగా, ఒకరు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇరు పార్టీల బలం 13కు చేరింది. చైర్మన్ ఎన్నికలో ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో ఓటు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వేయడంతో గులాబీ పీఠం దక్కింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ ఒకే వాహనంలో కార్యాలయానికి రావడం రాజకీయ చర్చకు దారితీసింది.
ఓటింగ్ అనంతరం కార్యకర్తలు ప్రశ్నించగా మహిపాల్ రెడ్డి పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ‘బుల్లెట్ దిగిందా లేదా’ అంటూ వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. పార్టీలో అధికారికంగా చేరకపోయినా మహిపాల్ రెడ్డి గులాబీ గూటిలో చురుకుగా వ్యవహరించారు. ఆయన మద్దతుతోనే ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని కొత్త పాలకవర్గాలకు సూచించారు. గెలుపు ఓటములు సహజమని, అభివృద్ధే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున నిధులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
త్వరలో శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేసీఆర్ నాయకత్వంపై ప్రజల విశ్వాసం నిలిచిందని అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయాలతో పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ జోరు కొనసాగుతోంది. రాజకీయ సమీకరణాలు కొత్త దశలోకి అడుగుపెట్టాయి.

