
కల్వకుంట్ల కవితకు నాలుగు ప్రశ్నలు
జాగృతి అధికారంలోకి రాగానే పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెడుతుందని ప్రకటించటం జోక్ గా మారింది
అసెంబ్లీలోను మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాల్సిందే అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పూలే విగ్రహం ఏర్పాటు జరుగుతున్న నెక్లెస్ రోడ్డు రోటరీ చౌరస్తాలోని లేక్ వ్యూపార్క్ లో పనులను పరిశీలించారు. ఇంతవరకు బాగానే ఉంది కాని ఆ తర్వాత మాట్లాడిందే కాస్త ఓవర్ గా ఉంది. అందుకనే కవితను ఈ సందర్భంగా నాలుగు ప్రశ్నలు అడుగుతున్నది.
ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటంటే నెక్లెస్ రోడ్డుతో పాటు అసెంబ్లీలో కూడా పూలే విగ్రహం పెట్టాల్సిందే అని రెండేళ్ళుగా తాను పోరాటం చేస్తున్నట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ హయాంలో పూలే విగ్రహం ఏర్పాటుకు పోరాటం సరే తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉన్నపుడు తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎందుకు అడగలేదు ? బీఆర్ఎస్ హయాంలోనే పూలే విగ్రహం ఏర్పాటు చేయించుంటే ఇపుడు పోరాటం అవసరమే ఉండేది కాదుకదా. బీఆర్ఎస్ హయాంలో పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయించాలన్న ఆలోచన కవితకు ఎందుకు రాలేదు ? ప్రతిపక్షంలోకి రాగానే పూలే విగ్రహం ఏర్పాటు విషయం ఎందుకు గుర్తుకొచ్చింది ?
అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం బీసీలు ఎందుకు గుర్తుకురాలేదు ? స్ధానికసంస్ధల్లో బీసీల రిజర్వేషన్లను తగ్గించిందే కేసీఆర్ అయినపుడు ఆరోజు ఎందుకు తండ్రిని నిలదీయలేదు ? బీఆర్ఎస్ నుండి బయటకు గెంటేయగానే కవితకు బీసీలు, పూలే విగ్రహం ఎందుకు గుర్తుకొచ్చినట్లు ?
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలుచేసి తీరాలని అప్పుడెప్పుడో పెద్దఎత్తున ఆందోళన చేయటం బాగానే ఉంది. అయితే 2014-19 మధ్యలో కేసీఆర్ క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రిని కూడా ఎందుకు తీసుకోలేదని తండ్రిని ఎన్నడైనా కవిత అడిగారా ? చట్టాన్ని పక్కనపెట్టి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ లో 33శాతం టికెట్లు మహిళలకు కేటాయించాల్సిందే అని ఎన్నడైనా కేసీఆర్ ను కవిత అడిగారా ?
కాంగ్రెస్ ప్రభుత్వం పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టకపోతే జాగృతి అధికారంలోకి రాగానే పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెడుతుందని ప్రకటించటం జోక్ గా మారింది. ఇపుడు పూలే విగ్రహం ఏర్పాటు కూడా జాగృతి పోరాటం వల్లే జరుగుతోందని చెప్పటం కూడా ఆశ్చర్యంగానే ఉంది. కవిత పోరాటాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూలే విగ్రహం పెడుతోందంటే ఎవరూ నమ్మరు. బీసీల ఓట్లకోసం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూలే విగ్రహాలు పెడుతోందంటే ఎక్కువమంది నమ్ముతారేమో. కాబట్టి బీఆర్ఎస్ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని, పూలే విగ్రహం ఎందుకు పెట్టించలేదన్న ప్రశ్నలకు కవిత సమాధానాలు చెబితే బాగుంటుంది.

