జగన్ అస్త్రం.. బాబు మంత్రం: విశాఖ రాజసం వెనుక అసలు కథ!
x
విశాఖపట్నం ఏఐ ఇమేజ్

జగన్ అస్త్రం.. బాబు మంత్రం: విశాఖ 'రాజసం' వెనుక అసలు కథ!

2025.. విశాఖ రూపురేఖలు మార్చిన సంవత్సరం.. జగన్ చెప్పినా, బాబు చెప్పకపోయినా రాజధాని రాజసం మాత్రం విశాఖదే.. 2026 నిరూపించబోతున్న చిత్రం ఇదే


ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై విశాఖ జెండా రెపరెపలాడుతోంది. ఒకప్పుడు అమరావతికి ప్రత్యామ్నాయంగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలల 'పాలనా రాజధాని'గా ప్రచారం పొందిన విశాఖ, కాలక్రమేణా రాజకీయ సమీకరణాలను తలకిందులు చేసింది. అందుకు 2024 అసెంబ్లీ ఎన్నికలు వేదికైతే 2025 ముగిసే నాటికి అది బలమైన ఆర్ధిక రాజధానిగా ఎదుగుతోంది. ఏపీకి పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఈ నగరం చేరింది.

వైఎస్ జగన్ ఏ విశాఖనైతే రాజధానిగా ప్రతిపాదించారో, అదే విశాఖ వైసీపీని గద్దె దించడానికి చంద్రబాబు నాయుడు చేతిలో రాజకీయ అస్త్రమైంది. ఇప్పుడు అంతర్జాతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలాజీ సంస్థల స్థాపనతో ఆర్ధిక రాజధానిగా బలపడుతోంది. దాని పేరు 'రాజధాని' కాకున్నా మొత్తం పారిశ్రామికవేత్తలందర్నీ తన వైపు తిప్పుకునేలా చేస్తోంది.
జగన్ తన రాజధాని విశాఖపట్నమేనని చెప్పి, రుషికొండ ప్యాలెస్ ను కట్టి రాజకీయంగా పరాజయం పాలైతే ఆ పేరు వాడకుండా చంద్రబాబు విశాఖను అదే స్థాయిలో అప్రకటిత రాజధానిగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించారు.
జగన్ ను చంద్రబాబు ఎలా దెబ్బతీశారంటే...
2024 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఓ బలమైన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లారు. జగన్ విశాఖపై చూపిస్తున్న ప్రేమ- పాలనా సౌలభ్యం కోసం కాదని, కేవలం అమరావతిని చంపడానికేనని ఆరోపించారు. విశాఖను రాజధానిగా మార్చడం వెనుక భూ ఆక్రమణలు, గనుల దోపిడీ ఉందంటూ టీడీపీ చేసిన విమర్శలు ఉత్తరాంధ్ర ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఈ ప్రాంతంలో భారీగా నష్టపోయింది.

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం రాజకీయ నీతి. 2019లో ఎక్కడైతే ఓడారో అక్కడే చంద్రబాబు- గెలుపు కోసం వెతుకులాడారు. 2019 నుంచి 2024 వరకు జగన్ ఏ సిటీనైతే (అమరావతి) విస్మరించారో అదేచోట చంద్రబాబు తన ఎదుగుదలను తిరిగి ప్రారంభించారు. తన మదిలోని అడ్మినిస్ట్రేటివ్, జస్టిస్, ఎడ్యుకేషన్, హెల్త్, ఫైనాన్స్, నాలెడ్జ్, టూరిజం అనే 7 ప్రధాన ఉప నగరాలకు మళ్లీ ఊపిరులు ఊదడం మొదలుపెట్టారు. ఐదేళ్ల విరామం తర్వాత అమరావతిలో పనులు మళ్ళీ ఊపందుకున్నాయనేలా చేశారు. ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, హడ్కో వంటి సంస్థల నుంచి నిధుల హామీ ఉన్నప్పటికీ ఈ 7 నగరాలు పూర్తిస్థాయిలో రూపు దాల్చడానికి 2028-29 వరకు సమయం పట్టేలా ఉంది. సరిగ్గా దీన్నే ఆయుధంగా మలుచుకుని విశాఖవైపు దృష్టిసారించారు.
అమరావతిలో ఈ 7 నగరాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉండగా, ప్రభుత్వం ఇప్పుడు తీర ప్రాంతం వెంబడి మరో 8 కొత్త పోర్టు సిటీల (Industrial Cities) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది నిధుల కేటాయింపులో ప్రాధాన్యతలపై కొత్త చర్చకు దారితీస్తోంది.
అనివార్య ఆర్థిక శక్తిగా విశాఖ...
అమరావతి నిర్మాణం ఒకవైపు జరుగుతున్నప్పటికీ, తక్షణమే రాష్ట్రానికి ఆదాయం, ఉద్యోగాలను ఇచ్చే 'ఎకనమిక్ ఇంజిన్'గా విశాఖపట్నం నిలుస్తోంది. ఇటీవలే విశాఖలో గూగుల్ తన ఏఐ (AI) హబ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. రిలయన్స్ రూ. 93,000 కోట్ల పెట్టుబడితో ఏఐ సెంటర్‌ను, కాగ్నిజెంట్ 8వేల సీట్ల సామర్థ్యంతో కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తున్నాయి.
2026 ప్రథమార్ధంలో ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చబోతోంది.
అప్రకటిత రాజధానిగా విశాఖ
ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం విశాఖను $120 బిలియన్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతిని చట్టబద్ధమైన ఏకైక రాజధానిగా ఉంచుతూనే, ఆచరణలో మాత్రం విశాఖను 'ఎకనామిక్ పవర్ హౌస్'గా, 'అప్రకటిత రాజధాని'గా ప్రోత్సహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు జగన్ విశాఖ పర్యటనలను తప్పుబట్టిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అదే విశాఖలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులు (CII Summit) నిర్వహించింది.

2025లో విశాఖకు పెట్టుబడుల హామీలు వెల్లువెత్తాయి. నవంబర్ లో జరిగిన జరిగిన CII పార్టనర్‌షిప్ సమ్మిట్ 2025 రాష్ట్ర ఆర్థిక దిశను మార్చివేసిందని చంద్రబాబు ప్రకటించారు. ఈ సదస్సులో సుమారు ₹13.25 లక్షల కోట్ల విలువైన 613 అవగాహన ఒప్పందాలు (MoUs) జరిగాయని, ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 16 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కధనం.
ఇంధన రంగం (Energy) ₹5.33 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగం ₹1.59 లక్షల కోట్లను ఆకర్షించింది.
దిగ్గజ సంస్థల ఎంట్రీ..
విశాఖను 'ఏఐ (AI) క్యాపిటల్'గా మార్చే దిశగా భారీ ఒప్పందాలు జరిగాయి. Google AI Hub: సుమారు ₹87,520 కోట్ల ($15 బిలియన్లు) పెట్టుబడితో గూగుల్ తన అతిపెద్ద డేటా సెంటర్, ఏఐ హబ్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తోంది. ఇది అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి అంటున్నారు.
రిలయన్స్ సంస్థ సుమారు ₹93,000 కోట్ల ($11 బిలియన్లు) తో 1-గిగావాట్ సామర్థ్యం గల ఏఐ డేటా సెంటర్ పార్కును నిర్మిస్తోంది.

భోగాపురం విమానాశ్రయం పనులు ఇప్పటికే 86% పూర్తి అయ్యాయి. 2026 జూన్ 30 నాటికి ఇది ప్రారంభం కానుంది. ఇది ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను చేరవేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.
సవాళ్లు సవాలక్ష, నిరుద్యోగుల ఆకాంక్ష...
అయితే, ఈ లక్షల కోట్ల ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యోగాలుగా మారడమే అసలైన సవాలు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఈ ఎంఓయూల అమలుపై ఒక 'ఛేజ్ సెల్' (Chase Cell) ఏర్పాటు చేయాలి. కేవలం ఐటీ కొలువులే కాకుండా, స్థానిక గ్రామీణ యువతకు పారిశ్రామిక నగరాల్లో ఉపాధి దొరికినప్పుడే ఈ అభివృద్ధికి సార్థకత లభిస్తుంది. ముఖ్యంగా 'నైపుణ్య గణన' (Skill Census) ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మన యువతను సిద్ధం చేయడం ఇప్పుడు తక్షణ అవసరం.
అమరావతి 7 ఉప నగరాలు ఎలా ఉన్నాయంటే..
అమరావతిలో ప్రతిపాదించిన అడ్మినిస్ట్రేటివ్, జస్టిస్, ఫైనాన్స్, నాలెడ్జ్, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం ఉప నగరాలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సంయుక్తంగా సుమారు ₹15,000 కోట్ల తక్షణ రుణాన్ని మంజూరు చేశాయి. అయితే ఇవేవీ ఈ నగరాల నిర్మాణానికి సరిపోవు. దీంతో రెండో విడత భూమిని సమీకరించి పెద్ద పెద్ద సంస్థలకు అప్పగించి వాటి ద్వారా అభివృద్ధి చేయించాలన్నది ప్రభుత్వ ప్లాన్ గా ఉంది. దీనికి స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మరో పక్క, జూన్ 2025 నాటికి అమరావతిలో సుమారు 74 ప్రతిష్టాత్మక సంస్థలకు భూములను కేటాయించారు. ఇందులో సిబిఐ (CBI), ఇన్‌కమ్ టాక్స్, ఐఐఐటీ (IIIT) వంటి కీలక కార్యాలయాలు ఉన్నాయి. ఈ 7 ఉప నగరాలు ఒక రూపానికి రావడానికి కనీసం 2028-29 వరకు సమయం పట్టవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
అమరావతిలోని 7 ఉప నగరాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంత అభివృద్ధి కోసం ₹10,522 కోట్లతో కొత్తగా 8 పోర్టు పారిశ్రామిక నగరాలను (Port Cities) ప్రతిపాదించింది. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం వంటి ప్రాంతాల్లో ఈ నగరాలు కొలువుదీరనున్నాయి.

ఈ అంశాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. అమరావతి అనేది 'పరిపాలనా రాజధాని' (Administrative Heart) గా ఎదుగుతుంటే, విశాఖపట్నం 'రాష్ట్ర ఆర్థిక ఇంజిన్' (Economic Engine) గా మారుతోంది. అమరావతిలో నిర్మాణాలు పూర్తి కావడానికి పట్టే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, చంద్రబాబు ప్రభుత్వం విశాఖను తక్షణ ఆదాయ వనరుగా వాడుకుంటోంది. అందుకే విశాఖ ఇప్పుడు కేవలం ఒక నగరం కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించే ఒక అనివార్య రాజకీయ, ఆర్థిక శక్తి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నట్లుగానే.. ప్రాంతాల ప్రాధాన్యత కూడా అధికార అవసరాలను బట్టి మారుతుంటుంది. జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసిన విశాఖే, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి పాలనాపరంగా అతిపెద్ద దిక్కుగా నిలుస్తోంది. అమరావతి ఒక 'కల' అయితే, విశాఖపట్నం ఇప్పుడు 'కనిపిస్తున్న వాస్తవం'.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రంలో విశాఖపట్నం, అమరావతిల మధ్య జరుగుతున్న ఈ "వ్యూహాత్మక సమతుల్యత"ను అర్థం చేసుకోవడానికి 2026 ఓ దిక్సూచిగా ఉంటుందేమో చూడాలి.
Read More
Next Story