
టిడిపి చిన్న ఆశ తెలంగాణలో చిగురిస్తుందా?
పార్టీ జిహెచ్ ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలంటున్న కార్యకర్తలు, అభిమానులు
ఆదివారం ఉదయం.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో సందడి.
తెలుగుదేశం ప్రముఖులు తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడు ఎన్టీరామారావు కు 30 వ వర్ధంతి నివాళులు అర్పించారు. అందులో ప్రముఖుల్లో ప్రముఖుడు ఆంధప్రదేశ్ ఐటి మంత్రి నాారాలోకేష్. ఏన్టీ రామారావుకు ఆయన మనవడు కూడా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు. భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవుతారని టిడిపి నేతలంతా భావిస్తున్నారు. ఆయన నివాళి ఇలా ఉంది.
"తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహా నాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కిన అరుదైన వరం. మీరు భౌతికంగా దూరమై ఇన్నేళ్లయినా, తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్న తాతయ్యా.. మీ జన్మ ధన్యమయ్యా!"అని లోకేష్ ట్వీట్ చేశారు.
తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహా నాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కిన అరుదైన వరం. మీరు భౌతికంగా… pic.twitter.com/ZdaeHMvZkF
— Lokesh Nara (@naralokesh) January 18, 2026
హైదరాబాద్ లోనే మరొక మూల పార్టీ కార్యకర్తలు ఇదే ఎన్టీ రామారావుకు మరొక రకమయిన, హృదయపూర్వకమైన, ఎంతో నిజాయితీతో నివాళుల ర్పించారు. ఎన్టీఆర్ కు నివాళులర్పించేందుకు వీళ్లకు ఎన్టీఆర్ ఘాట్ లోకి ప్రవేశం కూడా దొరకదు. అలాంటి సాదాసీదా కార్యకర్తలు. అమరావతి పార్టీ నేతల దర్శనం కూడా వీరికి కష్టమే. మనసంతా పచ్చ జండా నింపుకున్న గ్రాస్ రూట్ నాయకులు వీళ్లు. వీళ్ల నివాళి ఏమిటి? "నీ స్ఫూర్తితో తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం చిగురించాలి, పూలుపోయాలి, కాయులు కాయాలి. పవర్ లోకి రావాలి," అని ఎన్టీఆర్ దీవెనలు కోరుకున్నారు. ఈ చిన్న ‘ఎన్టీఆర్ కు నివాళి’ కార్యక్రమం సరూర్ నగర్ ప్రాంతంలోని ఆర్ కె పురం మెయిన్ రోడ్ జంక్షన్ లో ఒక మూలన జరిగింది.
అక్కడ ఎవరి దృష్టిని ఆకర్షించ లేకపోతున్న తెలుదేశం పార్టీ జండా స్థంభం దిమ్మె మీద ఎన్టీఆర్ బొమ్మ పెట్టి సరూర్, నగర్, ఆర్ కె పురం డివిజన్ల కు చెందిన తెలుగుదేశం నాయకులు, తెలుగు నాడు టీచర్స్ ఫెడరేషన్ నాయకులు, ఇతర అభిమానులు సుమారు ఇరవై మంది పొద్దునే సమావేశమై ఎన్టీ ఆర్ కు నివాళులర్పించారు.
‘తెలంగాణ తెలుగుదేశం జిందాబాద్, ఎన్టీఆర్ అమర్ రహే’ అని నినదాలిచ్చారు. ఎపుడూ రద్దీ గా ఉండే కొత్త పేట రైతు బజార్ కొసన ఉన్నట్లుండి ఇలా నినాదాలు వినిపించంతో అంతా అటువైపు తిరిగారు. తెలంగాణ నడిరోడ్డు మీద చిన్నగానైనా ‘తెలుగుదేశం పార్టీ జిందాబాద్’ అనే నినాదం వినిపించడం ఈ చిన్న చూపరులను ఆకర్షించింది.
తెలంగాణలో -తెలుగుదేశం’ అనే మాట మాయమయ్యి చాలా కాలమయింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మోసులెత్తించాలని చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడమే కాదు, కొన ఊపిరితో ఉన్న పార్టీని నామరూపాల్లేకుండా చేసింది.
చివరి సారిగా ఆయన కాంగ్రెస్ తో పొట్టు పొత్తుకుని టిడిపిని బతికించే ప్రయత్నం చేశారు. అంతే, కాంగ్రెస్- తెలుగుదేశం పొత్తు పనిచేయలేదు. కూటమి ఓడిపోయింది. దీనితో నమ్మకంగా ఉన్న టిడిపి నేతలు కూడా పార్టీ విడిచి పెట్టారు. 2014 -2024 మధ్య పేరుమోసిన టిడిపి నాయకులు, టిడిపి నిపట్టుకుని రాజకీయాల్లోకి పైపైకి ఎగబాకి నేతలంతా కొందరు భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్) నేత కె చంద్రశేఖర్ రావుతో చేతులు కలిపారు. రేవంత్ రెడ్డి నాయకులు కాంగ్రెస్ లో చేరి పైకి వచ్చారు. టిడిపి నాయకులు చాలా మంది ఏదో ఒక పార్టీలో ఇమిడిపోయి భవిష్యత్తు ను కాపాడుకున్నారు . చంద్రబాబు ఇక మళ్లీ తెలంగాణలో తెలుగుదేశం అనే మాట మాట్లాడలేదు.
అయితే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో టిడిపి-బిజెపి-జనసేన పార్టీల కూటమి అధికారంలోకి రావడం, తెలంగాణలో బిజెపి బాగా పుంజుకోవడంతో తెలంగాణలో ఉన్న కింది స్థాయి నాయకుల్లో, అభిమానుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్లీ చిగురిస్తుందనే నమ్మకం ప్రబలింది. ముఖ్యంగా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో గ్రాస్ రూట్ లెవెల్లో పని చేసి పార్టీని నిలబెట్టిన వారిలో ఎక్కువగా ఉంది. అలాంటి వారిలో బొడ్డు నర్సింగ్ యాదవ్ ఒకడు. ఆయన, తనలాంటి నూరు శాతం లాయలిస్టులతో ఈ రోజు తెలుగుదేశం జండా పక్కన నిలబడి ‘తెలుగుదేశం జిందాబాద్’ అనే నినాదమిచ్చాడు. ఈరోజు రాష్ట్రమంతా అనేక చోట్ల ఇలాంటి కార్యకర్తలే ఎన్టీఆర్ వర్థంతి జరుపుకుంటున్నారని నర్సింగ్ యాదవ్ అన్నాడు.
“ మేము జండా మోసి గెలిపించిన నాయకులంతా ఈరోజు పార్టీని విడిచిపోయారు. వాళ్లంతా నాయకులయ్యారు. సొంత లాభం చూసుకుని వెళ్లిపోయారు. జండా మోసిన వాళ్లమే మిగిలాం. కాబట్టి జండా ముందుకు సాగుతుంది. జండాని ముందుకు తీసుకువెళ్లడం మాబాధ్యత. అందుకే ఈ రోజు పచ్చ జండా ఎగరేసి పార్టీ సంస్థాపకుడికి నివాళులర్పించి, పార్టీని నిలబెడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము,” అని నర్శింగ్ యాదవ్ ‘ఫెడరల్ -తెలంగాణ’కు తెలిపారు.
నర్సింగ్ యాదవ్ లాగే ఫ్రొఫెసర్ ఎమ్ విపి రమేశ్ కూడా తెలుగుదేశాని మంచి భవిష్యత్తును కలకంటున్నారు. రమేశ్ ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో గణితం విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన ‘తెలుగునాడు’ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు. తెలంగాణ తెలుగుదేశం పార్టీని పునరుద్ధరించేందుకు ఇపుడు అవకాశాలు మెరుగుపడ్డాయని రమేశ్ భావిస్తున్నారు. “ఆంధ్రప్రదేశ్ లో టిడిపి-బిజెపి-జనసేన పార్టీల ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇపుడు దేశమంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది నమూనా చర్చనీయాంశమయింది. ఆంధ్రప్రదేశ్ వంటి కూటమి తెలంగాణ లో ఏర్పడాలనే అకాంక్ష ఇక్కడి ప్రజల్లో కలుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ ప్రభుత్వ ప్రభావం తెలంగాణలో పడుతున్నది,” అని రమేశ్ చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ‘ఆంధ్రపార్టీ’ అని, దానికి తెలంగాణ స్థానం లేదని బిఆర్ ఎస్ వంటి పార్టీలు చేస్తున్నవాదన గురించి ప్రస్తావించినపుడు రాజకీయ దురుద్దేశంతో కూడిన విమర్శ అది ఇపుడు చెల్లదని అది దురద్దేశంతో కూడిని విమర్శఅని ఈ నాయకులు వాదిస్తున్నారు.
“తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్ నగరం నడిబొడ్దున. ఆ లెక్కన తెలుగుదేశం పార్టీ పదహారాణాల తెలంగాణ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును సమర్థించిన పార్టీ మా తెలుగుదేశం పార్టీ. ఇపుడు అన్ని పార్టీలు గొప్పగా చెప్పుకుంటున్న హైటెక్ హైదరాబాద్ ను నిర్మించిందెవరు? తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాలే కదా. ఈ విషయం తెలుగుదేశం కార్యకర్తలకు , అభిమానులకే కాదు, తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన నాయకులు ఆపనిచేయకుండా టిడిపిని విమర్శించిన పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఇపుడు కార్యకర్తలే పార్టీలో మిగిలారు. వాళ్లొక పెద్ద సైన్యం. రాష్ట్రమంతా వాళ్లున్నారు. వాళ్లే ఇపుడు పార్టీని పునర్నిర్మిస్తారు,” అని నర్శింగ్ యాదవ్ చెప్పాడు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు తమకుటుంబానికి పేదల హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు వచ్చిన విషయం చెబుతూ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పథకాల లబ్దిదారులెవ్వరూ ఎన్టీఆర్ ని మర్చిపోలేరని, వాళేఇపుడు పార్టీకి పున:ప్రతిష్ఠ చేస్తారని ఆయన అన్నారు.
2014 తర్వాత వచ్చిన పరిణామాల వల్ల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణ పార్టీ పునర్నిర్మాణం మీద దృష్టిపెట్టలేకపోయారని, ఇపుడు అక్కడ పార్టీ, ప్రభుత్వం బలంగా ఉన్నాయని చెబుత ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పటిష్టపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతాయని ఆయన చెప్పారు.
సరూర్ నగర్ టిడిపి నాయకుడు విజయేందర్ మాట్లాడుతూ తొందరలో జరుగనున్న జిహెచ్ ఎంసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సరూర్ నగర్ , ఆర్ కెపురం డివిజన్లలో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ , బిజెపి లు తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలని ఈ నాయకులంతా ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు, జనసేన కూడా కలుస్తుంది. అపుడు తెలంగాణలో కూడా టడిపి-బిజెపి-జనసేన కూటమి ఏర్పడాలని అంతా ఆశిస్తున్నారు. “అయితే పొత్తు పెట్టుకోవడం అనేది పార్టీ స్థాయిలో జరిగే నిర్ణయం కాబట్టి దీనికి గురించి మేమేమీ చెప్పలేం. పొత్తుఉన్నా, లేకున్నా, టడిపి మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేయాలి,” విజయేందర్ అన్నారు.
సరూర్ నగర్ , ఆర్ కెపురం డివిజన్లలో గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచ్చింది. ఈ ప్రాంతాలు ఒకపుడు తెలుగుదేశం పార్టీకి బలమైన కేంద్రాలు. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇపుడు నాలుగు డివిజన్లు ఉన్నాయి. పొత్తుఉంటే తాము గతంలో గెలిచిన డివిజన్లు టిడిపి ఇవ్వాలని కోరతాం. లేదంటే నాలుగు డవిజన్లలో పోటీ చేయాలని పార్టీనాయకత్వాన్ని కోరతామని సీనియర్ నాయకులు బేతి జగదీశ్వర్ రెడ్డి, దామోదర్, లోకోశ్ గౌడ్ లు తెలిపారు. ఇపుడున్న తెలంగాణ లో ఉన్న రాజకీయ వాతావరణంలో సరూర్ నగర్, ఆర్ కె పురం టిడిపి నేతల చిన్న కోరిక నెరువేరుతుందా?
చంద్రబాబు కు ఆసక్తిలేదు, బిజెపి సుముఖంగా లేదు
సాధారణ కార్యకర్తల భావాలెలా ఉన్నా, తెలంగాణలో టిడిపిని పునరుద్ధరించాలన్న ఆలోచన నాయకత్వంలోనే ఉన్నట్లు కనిపించదు. ‘నేనిక హైదరాబాద్ లో కూర్చుంటాను, ఎన్టీఆర్ భవన్ కు వస్తాను, పార్టీని పటిష్టపరుస్తాను,' అని చంద్రబాబు నాయుడు కార్యకర్తల ఆనందం కోసం ప్రకటించినా ఆచరణలో అది జరగడంలేదు. ఏదో రాజకీయం చంద్రబాబుని అడ్డుకుంటూ ఉంది.అందుకే గత ఎన్నికలపుడు పోటీ చేసేందుకు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జ్జానేశ్వర్ ముదిరాజ్ మందిని, పైసలను సమకూర్చుకున్నా, ‘తెలంగాణ లో పోటీ చేసేది లేదు,’ అని చంద్రబాబు ప్రకటించడంతో ఆయన అవాక్కయ్యారు. ఈ ధోరణి భరించలేక జ్ఞానేశ్వర్ పార్టీని వదిలేసి ఏకంగా బిఆర్ ఎస్ లో చేరిపోయారు.
సాదారణ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నా, అది జరిగే అవకాశాలు తక్కువ అని, చంద్రబాబుతో కలిపేందుకు తెలంగాణ బిజెపి కూడా సముఖంగా లేదని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత సీనియర్ జర్నలిస్టు చలసాని నరేంద్ర అన్నారు.
" తెలంగాణలో టిడిపితో జనసేనతో చేతులు కలిపేది లేదని బిజెపి చాలా సార్లు స్పష్టం చేసింది. ఈ రెండు పార్టీలకు ఉన్న ఆంధ్రా పార్టీ ముద్ర తమకు హానిచేస్తుందని బిజెపి నాయకుల భయం. అదే విధంగా చంద్రబాబు నాయకుడు కూడా తెలంగాణలోని ప్రవేశించేందుకు అంత సుమఖంగా లేరు. ఆ మధ్య జరిగిన జూబ్లీ హిల్స్ బై ఎలెక్షన్స్ లో , ఆ ప్రాంతంలో టిడిపి అభిమానులున్నా, బిజెపి సపోర్టు కోరలేదు, చంద్రబాబు మద్దతు ప్రకటించలేదు. కాబట్టి తెలంగాణలో టిడిపి పునరుద్ఱరణమీద టిడిపి నాయకత్వం దృష్టిపెట్టే సూచనలు కనిపించడంలేదు," అని నరేంద్ర అన్నారు.

