
రేవంత్ ప్రభుత్వంపై ఆరోపణలతో విరుచుకుపడిన హరీష్
సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ స్కామ్ జరిగిందని కొత్త ఆరోపణలతో రెచ్చిపోయారు
బీఆర్ఎస్ ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నందుకే తమను విచారణల పేరుతో ప్రభుత్వం వేధిస్తున్నట్లు మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతు నైనీ కోల్ మైన్ కుంభకోణంలో మంత్రుల పాత్రను బయటపెట్టినందుకే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో తనతో పాటు కేటీఆర్ ను ఇరికించి విచారణల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని రెచ్చిపోయారు. నైనీ కోల్ కుంభకోణం కాకుండా తాజాగా సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ స్కామ్ జరిగిందని కొత్త ఆరోపణలతో రెచ్చిపోయారు. సింగరేణి సృజన్ గనిగా మారిపోయిందన్నారు. నాడు సింగరేణి సిరుల గని అయితే ఇపుడు సృజన్ గని అని ఎద్దేవాచేశారు.
అవినీతి సొమ్ముకోసం మంత్రుల మధ్య వాటాల పంచాయితి నడుస్తోందన్నారు. అప్పట్లో కోల్ స్కామ్ యూపీఏ ప్రభుత్వ పతనానికి కారణమైతే ఇపుడు అదే కోల్ మైన్ స్కామ్ తోన కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవుతుందని జోస్యంచెప్పారు. ముఖ్యమంత్రి బావమరిది బాగోతం బయటపెట్టినందుకే నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని మండిపోయారు. మంత్రుల మధ్య పంచాయితీలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉరితాడులాగ మారబోతోంది అన్నారు. సృజన్ వ్యవహారం తాము బయటపెట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేదని విమర్శించారు.
ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చేందుకే తమకు నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నాడని రేవంత్ పై విరుచుకుపడ్డారు. 107 మెగావాట్ల ఉత్పత్తి చెల్లింపులను 67 మెగావాట్ల ఉత్పత్తికే చేసినట్లు ఆరోపించారు. అందుకనే సోలార్ స్కామ్ జరిగిందని తాను చెబుతున్నట్లు హరీష్ తెలిపారు. ఇందులో రు.250 కోట్లకు బదులు రు.500 కోట్ల రూపాయలు చెల్లించినట్లు హరీష్ ఆరోపించారు. తాను అనుకున్న కంపెనీకి టెండర్లు దక్కేట్లుగా చేయటానికే ప్రభుత్వం ఎంఎస్ఎంఈలు పాల్గొనకూడదనే నిబంధన తెచ్చినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఒక మెగావాట్ పవర్ ఉత్పత్తికి రు. 3 కోట్లు ఖర్చవుతుంటే రాష్ట్రంలో మాత్రం రు. 5.04 కోట్ల చెల్లించినట్లు హరీష్ ఆరోపించారు.
సోలార్ ఉత్పత్తి కంపెనీకి అదనంగా సింగరేణి భూములను కూడా ఇచ్చినట్లు తెలిపారు. సింగరేణిలో మరో సోలార్ పవర్ ప్లాంటులోనూ ఇంకో చోట 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రు. 7 కోట్లు ముప్పచెప్పినట్లు హరీష్ ఆరోపించారు. అలాగే సింగరేణిలోనే ఎక్స్ ప్లోజివ్స్ స్కామ్ కూడా జరిగిందన్నారు. టెండర్లు వేసిన వారితో సీఎం బావమరిది హోటళ్ళల్లో భేటీ అవుతున్నట్లు మండిపడ్డారు. బిడ్ల ప్రక్రియ ఐదారుసార్లు ఎందుకు వాయిదాపడుతోందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీష్ రావు నిలదీశారు.

