హరీష్ రావు రిలీజ్.. రేవంత్‌‌ది గడీల పాలన అంటూ చురకలు..
x

హరీష్ రావు రిలీజ్.. రేవంత్‌‌ది గడీల పాలన అంటూ చురకలు..

పరిగి పర్యటనలో అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలు విడుదల. భూముల వివాదంపై రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.


శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత చివరకు చల్లారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్ రావును పోలీసులు విడుదల చేశారు. పరిగి పర్యటనకు వెళ్తుండగా హరీశ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులను కూడా శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో అక్కడికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

తరువాత పోలీసులు హరీశ్ రావుతో పాటు ఇతర నేతలను విడుదల చేశారు. దీంతో అక్కడి పరిస్థితి సాధారణమైంది. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం విజయవంతం కాదని ఆయన పేర్కొన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్తుండగా అడ్డుకోవడం తగదని అభిప్రాయపడ్డారు. పరిగి ప్రాంతంలోని భూముల విషయంలో కూడా ఆయన స్పందించారు. సాగు చేస్తున్న భూములను తీసుకోవడం సరైంది కాదని చెప్పారు. పరిశ్రమలు సాగుకు అనుకూలం కాని భూముల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళాపూర్, రాపోల్ గ్రామాల్లో పారిశ్రామిక పార్క్ కోసం 1,197 ఎకరాల భూమి సేకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా స్థానిక రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న సమయంలోనే హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నేతల విడుదలతో ఉద్రిక్తత తగ్గినప్పటికీ, భూముల అంశంపై పరిస్థితులు ఇంకా సున్నితంగానే కొనసాగుతున్నాయి.

Read More
Next Story