Harish Rao in Telangana Minicipal elections campaign
x
Source:X/Harish Rao Thanneeru, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో మాజీ మంత్రి హరీష్ రావు

హామీలను అమలు చేయమంటే బెదిరింపులా: హరీష్

అసెంబ్లీలో పెన్షన్ ప్రశ్నపై వినిపించిన మాటలపై హరీశ్ రావు అభ్యంతరం తెలిపారు. ఇస్నాపూర్ పర్యటనలో కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు.


అసెంబ్లీలో పెన్షన్ ఎప్పుడు ఇస్తారని అడిగితే బెదిరింపు భాష వినిపిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. మహిళలకు రూ.2500 అడిగితే అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పర్యటన సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు తాజాగా రాజకీయ చర్చకు దారితీశాయి.

ఇస్నాపూర్‌లో హరీశ్ రావు పర్యటన

సంగారెడ్డి నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో హరీశ్ రావు విస్తృతంగా పర్యటించారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుత పాలన పరిస్థితులపై స్పందించారు.

పదేళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు అనుభవించారని తెలిపారు. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనను కూడా ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఇటీవల పంచాయతీ సెక్రటరీలు ఉద్యోగులు తనను కలిసి తమ బాధలు చెప్పుకున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాలు, శాశ్వతీకరణ, జీతాల పెంపు అన్నీ కేసీఆర్ హయాంలో జరిగాయని వారు గుర్తుచేస్తున్నారని చెప్పారు.

సంక్షేమ పథకాలపై విమర్శలు

పెన్షన్ల అంశాన్ని ప్రస్తావించిన హరీశ్ రావు, రూ.200 పెన్షన్‌ను రూ.2000కు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమేనని చెప్పారు. రూ.4000 ఇస్తామని చెప్పి అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత 24 నెలల్లో ఒక్కో వృద్ధుడికి రూ.52 వేల బకాయి పడిందని తెలిపారు. కేసీఆర్ కిట్ నిలిపివేయడం, కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చే సాయం ఆలస్యం కావడం పైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.

లక్ష రూపాయల చెక్కులు కూడా నెలల తరబడి ఇవ్వడం లేదని అన్నారు. ఇస్నాపూర్‌లో ఒకప్పుడు విద్యుత్ కోతలు ఉండేవని గుర్తుచేశారు. కేసీఆర్ వచ్చాక 24 గంటల కరెంట్ వచ్చిందని తెలిపారు. పరిశ్రమల్లో ఉపాధి దొరికిందని చెప్పారు. ప్రస్తుతం మళ్లీ కరెంట్ కోతలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు.

ఉచిత బస్సుల పేరుతో ఆటో కార్మికుల జీవనాధారం దెబ్బతిన్నదని తెలిపారు. పురుషులపై డబల్ టికెట్ రేట్ల భారం పడుతోందని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలకైనా వెనుకాడని కేసీఆర్‌ను అవమానకరంగా మాట్లాడటం సరికాదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలపై అడిగే ప్రశ్నలకు అసభ్య భాషలో సమాధానాలు రావడం బాధాకరమని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హరీశ్ రావు కోరారు. అభివృద్ధి కొనసాగాలన్నా, సంక్షేమ పథకాలు తిరిగి రావాలన్నా సరైన ఎంపిక చేయాలని సూచించారు.

Read More
Next Story