తెలంగాణలో కొత్తతరహా రాజకీయ ఫైటింగ్  మొదలైందా ?
x
KTR and Central Minister Bandi Sanjay

తెలంగాణలో కొత్తతరహా రాజకీయ ఫైటింగ్ మొదలైందా ?

పరువుకు భంగం కలిగించినందుకు కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు


తెలంగాణలో కొత్త తరహా రాజకీయం మొదలైంది. అదేమిటంటే ప్రత్యర్ధులపై లీగల్ ఫైటింగ్. ప్రత్యర్ధులకు లీగల్ నోటీసులు ఇవ్వటం. రాజకీయాల్లో పెరిగిపోతోంది. (BRS)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీలోని ఇద్దరికి లీగల్ నోటీసులు పంపారు. తనపైన నిరాధారమైన ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించినందుకు కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు లీగల్ నోటీసులు పంపారు. ఐదురోజుల్లో తనకు క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కేటీఆర్(KTR) నోటీసులో హెచ్చరించారు. అలాగే హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్(VC Sajjanar) బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కూడా ఇలాంటి లీగల్ నోటీసే పంపారు.

ఇంతకుముందు తనపైన అనుచిత వ్యాఖ్యలు చేసి పరువుకు భంగం కలిగించారని మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసుపంపారు. అలాగే తమ కుటుంబం పరువుకు భంగం కలిగించారనే కారణంగా మంత్రి కొండా సురేఖకు సినీనటుడు అక్కినేని నాగార్జున కూడా మరో లీగల్ నోటీసు పంపారు. కొంతకాలం క్రితం తనపైన నిరాధారమైన ఆరోపణలు చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు. అయితే తనకు లీగల్ నోటీసు అందితే లీగల్ గానే సమాధానమిస్తా అని బండి ప్రకటించారు. అయితే ఆ లీగల్ నోటీసు వ్యవహారం ఏమైందో తెలీదు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిరాధార ఆరోపణలు చేశారంటు బీఆర్ఎస్ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ మెతుకు ఆనంద్ కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా లీగల్ నోటీసులు పంపారు.

ప్రత్యర్ధులు తమపైన ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఉండేందుకే కొందరు లీగల్ నోటీసు రాజకీయం మొదలుపెట్టారు. రాజకీయాలన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా సహజం. ఇదే సమయంలో కొందరు మరీ దూకుడుగా వ్యవహరిస్తు వ్యక్తిత్వాన్ని ఎటాక్ చేస్తు బాగా ఇబ్బందికరమైన ఆరోపణలు చేస్తున్నారు. అందుకనే లీగల్ నోటీసులు పెరిగిపోతున్నాయి.

కేటీఆర్ పై ట్యాపింగ్ ఆరోపణలు

టెలిఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ కీలకపాత్ర పోషించారని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కేసుపెట్టి అరెస్టుచేసి లోపల వేయకుండా ఉపేక్షిస్తోందని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండ సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి ఆరోపణలనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా కేటీఆర్ పైన చేశారు. తనపైన నిరాధారమైన ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తు బండి, ధర్మపురికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఐదురోజుల్లో క్షమాపణలు అయినా చెప్పాలి లేదా చేసిన ఆరోపణలకు ఆధారాలను అయినా చూపించాలని నోటీసులో కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే ఇలాంటి లీగల్ నోటీసులు ఎన్ని ఇచ్చినా తాము భయపడేది లేదని బండి, ధర్మపురి తెగేసిచెప్పారు.

ఎక్కువగా నిరాధారమైనవేనా ?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పొద్దన లేస్తే కేటీఆర్, హరీష్ తదితర బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తు ఆరోపణలతో రెచ్చిపోతుంటారు. తాము చేస్తున్న ఆరోపణలన్నింటికీ వాళ్ళు ఎలాంటి ఆధారాలను చూపటంలేదు. ఉత్తినే గుడ్డకాల్చి రేవంత్ మొహంమీద పడేస్తున్నారు. కాలినగుడ్డ మొహం మీద పడిన తర్వాత తుడుచుకోక తప్పదు కదా. తుడిచుకునేటపుడు మొహానికి మసి అవుతుంది. అప్పుడు రేవంత్ మొహానికి మసిపూసుకున్నాడు చూశారా అంటు మళ్ళీ గోలచేస్తున్నారు. తాము మాత్రం ఎవరిపైనైనా ఎలాంటి ఆరోపణలను అయినా చేయచ్చు కాని తమ మీద మాత్రం ఎవరూ ఆరోపణలు చేయకూడదు, ఒకవేళ చేస్తే అందుకు ఆధారాలను చూపాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలకు ఆధారాలను చూపలేదని వెంటనే లీగల్ నోటీసులు జారీచేస్తున్నారు.

కేటీఆర్-నాగార్జున-సురేఖ గోల

అటవీ, ధర్మాదాయ శాఖల మంత్రి కొండాసురేఖ తన ఆరోపణలను కేటీఆర్ కు పరిమితం చేయకుండా ఎలాంటి సంబంధంలేని అక్కినేని నాగార్జున, సమంతలను వివాదంలోకి లాగారు. అక్కినేని కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రభుత్వం కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని నాగార్జునపై కేటీఆర్ ఒత్తిడి తెచ్చినట్లు మంత్రి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఫోన్లు ట్యాపింగ్ చేయించటం ద్వారా కేటీఆర్ సెలబ్రిటీల రహస్యాలను గుప్పిట్లో పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేశాడని సురేఖ ఆరోపించారు. తన ఆరోపణలకు కొండా సురేఖ దగ్గర ఏమి ఆధారాలున్నాయో ఎవరికీ తెలీదు. ఈ విషయమై ఇటు కేటీఆర్, అటు నాగార్జున నాంపల్లి కోర్టులో మంత్రి మీద పరువునష్టం దావాలు వేశారు.

తెరవెనుక ఏమిజరిగిందో తెలీదు కాని మంత్రికి వ్యతిరేకంగా దాఖలుచేసిన పరువునష్టం కేసును నాగార్జున విత్ డ్రా చేసుకున్నారు. అయితే విచారణలోనే ఉన్న కేటీఆర్ దాఖలుచేసిన కేసు చివరకు ఏమవుతుందో చూడాలి. అవినీతికి సంబంధించిన ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలావరకు నిరూపణకావు. కాబట్టి ఆరోపణలు, ప్రత్యారోపణలను నేతలతో పాటు జనాలు కూడా పట్టించుకోవటం మానేశారు. అయితే కొన్నిసార్లు ఆరోపణలు హద్దులను దాటేస్తోంది అనుకున్నపుడే లీగల్ నోటీసుల దాకా వెళుతోంది వ్యవహారం.

నిరాధార ఆరోపణలు చేయకుండా ప్రత్యర్ధుల నోళ్ళుమూయించటానికి కొందరు లీగల్ నోటీసుల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు అర్ధమవుతోంది. నిజానికి బట్టకాల్చి మీదేయటం అన్నది చాలా బ్యాడ్ అనేచెప్పాలి. ఎవరిపైన ఏవైనా ఆరోపణలు చేసేముందు అందుకు తగిన ఆధారాలను పెట్టుకుని ఆరోపణలు చేయటం చాలామంచిది. అయితే ఈ పద్దతిని ఎవరూ ఫాలో అవటంలేదు. ముఖ్యంగా ఏవైనా ఎన్నికలు వస్తున్నాయంటే ఇలాంటి ఆరోపణలకు ఆకాశమే హద్దుగా మారిపోతోంది. తొందరలోనే మున్సిపల్, పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా అందుకనే ఆరోపణలు, ప్రత్యారోపణల గోల బాగా ఎక్కువైపోతోంది. మరి లీగల్ నోటీసులతో అయినా ఆధారాలు లేని ఆరోపణలకు బ్రేకులు పడతాయేమో చూడాలి.

Read More
Next Story