మొదటినుండి పాడి వివాదాస్పద ఎంఎల్ఏనేనా ?
x
BRS MLAs Padi Kaushik Reddy Vs Arekapudi Gandhi

మొదటినుండి పాడి వివాదాస్పద ఎంఎల్ఏనేనా ?

పాడి నేపధ్యం పరిశీలిస్తే వివాదాలంటే ఎంఎల్ఏకి ఇష్టమా లేకపోతే వివాదాలకే ఎంఎల్ఏ అంటే మక్కువో తెలిసిపోతుంది


మొదటినుండి పాడి కౌశిక్ రెడ్డి విదాదాస్పదుడే. బీఆర్ఎస్ తరపున హుజూరాబాద్ ఎంఎల్ఏగా 2023 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరిస్తుండటంతో పాడి వివాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.(Padi KaushikReddy) పాడి తరచూ వివాదాల్లో ఇరుక్కోవటం వెనుక బీఆర్ఎస్(BRS) అగ్రనేతల ప్రోత్సాహం కూడా ఉందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎదుటివారిని ఎంతపడితే అంత మాట్లాడటం, నోటికొచ్చింది తిట్టడం, గొడవలకు సిద్ధంగా ఉండటం లాంటి లక్షణాలున్న ఎంఎల్ఏని నాయకత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ప్రోత్సహిస్తున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. (Samakka-Saralamma)సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా వీణవంక సారలమ్మ గద్దెపైన శుక్రవారం మధ్యాహ్నం పోలీసు అధికారులతో జరిగిన గొడవ ఇందులో భాగమనే అనుకోవాలి.

ఒకసారి పాడి నేపధ్యం పరిశీలిస్తే వివాదాలంటే ఎంఎల్ఏకి ఇష్టమా లేకపోతే వివాదాలకే ఎంఎల్ఏ అంటే మక్కువో తెలిసిపోతుంది. మేడారంలో గొడవతో మొదలుపెడితే గతంలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ ఏ సంజయ్ తో గొడవ, మరో ఫిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధీతో వివాదం, యాదగిరి గుట్ట దేవాలయంలో గొడవ, జూబ్లీహిల్స్ సీఐతో గొడవ, గవర్నర్ పైనా అనుచిత వ్యాఖ్యలు లాంటివి చాలానే ఉన్నాయి.

వీణవంకలో శుక్రవారం మధ్యాహ్నం సారలమ్మ గద్దెపైకి కుటుంబంతో పాటు ఎక్కిన పాడి మొక్కులు చెల్లించి దిగేయకుండా జాతర ఏర్పాట్లను తామే చేసినట్లుగా ప్రకటించటంతో గొడవ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ మాట్లాడుతు జాతర ఏర్పాట్లను తామే చేసినట్లు చెబితే అక్కడే ఉన్న అధికారపార్టీ నేతలు ఎందుకు ఊరుకుంటారు ? అందుకనే పోలీసులు వచ్చి పాడిని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. దాంతో తోపులాటలు జరిగి కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలంను నోటికొచ్చినట్లు పాడి దూషించటంతో గొడవ బాగా పెద్దదైపోయింది. ఐపీఎస్ అధికారుల సంఘం పాడి వ్యాఖ్యలతో మండిపోయి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. వెంటనే తీవ్రతను గుర్తించిన పాడి తాను దూషించిన పోలీసు అధికారికి క్షమాపణ చెప్పి వివాదాన్ని ముగించే ప్రయత్నంచేశారు. అయితే ఆ ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేయటంతో కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగటంతో వివాదం మళ్ళీ రాజుకుంది.

ఫిరాయింపు ఎంఎల్ఏలు గాంధీ, సంజయ్ తో కూడా అనవసరంగానే పాడి గొడవలు పడ్డారు. వికారాబాద్ జిల్లా పరిషత్ మీటింగులో సంజయ్ తోను, బీఆర్ఎస్ ఎంఎల్ఏనే అని అన్నందుకు గాంధీని పాడి నోటికొచ్చినట్లు మాట్లాడారు. సంజయ్ ను కొట్టడానికి కూడా పాడి ఎగబడితే అక్కడే ఉన్న మిగిలిన వాళ్ళు అడ్డుకున్నారు. పాడి మీద మరో ఫిరాయింపు ఎంఎల్ఏ సంజయ్ పీఏ కరీంనగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశాడు. కరీంనగర్ ఆర్డీవో మహేశ్వరం పోలీసులకు, కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్ధ ఛైర్మన్ సత్తు మల్లేశం కూడా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. 2024, డిసెంబర్లో విధి నిర్వహణలో ఉన్న సర్కిల్ ఇన్స్ పెక్టర్ ను పోలీసుస్టేషన్లోనే అడ్డుకున్నాడనే ఆరోపణలపై పాడితో పాటు మరో 20మంది బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదుచేశారు. 2025, జూన్లో వరంగల్ లోని ఒక గని యజమానిని డబ్బుల కోసం బెదిరించాడనే ఫిర్యాదుపై సుబేదారి పోలీసులు కేసు నమోదుచేశారు.

2023 ఎన్నికల్లో పాడి గెలుపే పెద్ద వివాదాస్పదమైంది. ఎలాగంటే ఎన్నికల ప్రచారంలో ఓపెన్ టాప్ జీపులో ర్యాలీలో మాట్లాడుతు ‘‘తనకు ఓట్లు వేసి గెలిపించకపోతే తనతో పాటు తన భార్య, కూతురు ముగ్గురం ఆత్మహత్యలు చేసుకుని చనిపోతాము’’ అని ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినట్లుగా మాట్లాడాడు. అప్పట్లో పాడి బ్లాక్ మెయిల్ మాటలు బాగా వివాదాస్పదమైన విషయం గుర్తుండే ఉంటుంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాడి బాగా దూకుడుగా మాట్లాడటం అందరికీ తెలిసిందే. ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా, ఆరోపణలు చేయాలన్నా విధానపరంగా మాట్లాడాలే కాని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం వల్ల ఒకటిరెండు రోజులు వార్తల్లో వ్యక్తిగా ఉంటారేమో కాని దీర్ఘకాలంలో జనాలు హర్షించరని పాడి కౌశిక్ రెడ్డి గుర్తిస్తే మంచిది.

Read More
Next Story