ఫామ్ హౌస్ చల్లగాలిలో జీవనరెడ్డికి జ్ఞానోదయం
x
KCR and Jeevan Reddy

ఫామ్ హౌస్ చల్లగాలిలో జీవనరెడ్డికి జ్ఞానోదయం

కేసీఆర్ ను వాటేసుకున్నారు, తర్వాత భోజనం కూడా చేశారు... అంతే జీవన్ రెడ్డికి గతం గుర్తులేకుండా పోయింది.


శుక్రవారం నాడు జీవన్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళి భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్ ) అధినేత కేసీఆర్ ను వాటేసుకున్నారు, తర్వాత భోజనం కూడా చేశారు. పచ్చని చెట్ల మధ్య ఫామ్ హౌస్ చల్లగాలి సోకవడం, అక్కడి చల్ల నీళ్లు తాగడం, కెసిఆర్ చక్కటి ఆతిథ్యం స్వీకరించడంతో... జీవన్ రెడ్డిలో అనూహ్యమయిన మార్పు వచ్చింది. తనని కెసిఆర్ ఎంతగా అభిమానిస్తున్నాడో చూపి కళ్లు చెదరిపోయాయి. అంతే... ఒక్కసారిగా జీవన్ రెడ్డి భాష మారింది. బీఆర్ఎస్ భాష మాట్లాడేస్తున్నారు. కాంగ్రెస్ కుబుసం వూడిపోయింది. అంతేకాదు, తాను గతంలో కెసిఆర్ ను, కెటిఆర్ ను తిట్టిన భాష పూర్తిగా మర్చిపోయారు.

‘‘కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై పూర్తిగా పట్టుకోల్పోయింది’’ అన్నారు. ‘‘ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తోంది’’ అని మండిపోయారు. ‘‘తెలంగాణలో నడుస్తున్నది ఏఐసీసీ ప్రభుత్వం కాదు...రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే’’ గర్జించారు. ‘‘ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పోవాలి..కేసీఆర్ రావాలి’’నినాదం ఇచ్చారు.

ఇవి ఒక నాటి జీవన్ రెడ్డి భాషకు పూర్తి గా భిన్నమయిన మాటలు. మొన్నమొన్నటి వరకు జీవన్ రెడ్డి స్లోగన్ ‘కెసిఆర్ పోవాలి, కాంగ్రెస్ రావాలి,’ అనేదే.

కెసిఆర్, మోదీ మిలాఖత్ అయి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆయన పబ్లీకునుతిట్టారు. 2021 మార్చిలో ఎమ్మెల్సీ గా పోటీచేస్తున్నపుడు ఎన్నికల ప్రచార సభలో తీవ్రమయిన విమర్శలు చేశారు. ఇదిగో ఒక మచ్చుతునక.

"నిరుద్యోగులకు ఉపాధి ఇవ్వాలని యుపిఎ ప్రభుత్వం ITIR (Information Technology Investment Region) ఇచ్చింది. దాని వల్ల 50 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. కేంద్రంలోల బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం కలసి ITIR ని రద్దు చేయించాయి. ITIRను రద్దులో లో కేసీఆర్.. మోడీ ఇద్దరూ దోషులే. కేంద్రానికి అన్నిటికి మద్దతు పలికిన కేసీఆర్… ITIR ఎందుకు సాధించలేకపోయారు? టిఆర్ ఎస్ పార్టీ బీజేపీ కి ‘బీ టీం’ లెక్క మారింది . సొంత ప్రయోజనాల కోసం మోడీకి కేసీఆర్ వంతపాడారు. కెసిఆర్ పోవాలి. కాంగ్రెస్ రావాలి," అన్నారు. ఆపుడాయన పక్కనే భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.

ఇపుడాయన ఫామ్ హౌస్ చల్లగాలిలో సిఎం రేవంత్ రెడ్డి మీద ఉన్న పగని కెసిఆర్ మీద ప్రేమగా మార్చుకుంటున్నారు. తన ఫామ్ హౌస్ కి దేవుడే పంపించాడని అన్నారు.

‘‘ఒకపుడు పీసీసీ చెప్పినట్లుగా సీఎం నడుచుకునేవారు, ప్రస్తుతం సీఎం చెప్పినట్లుగా పీసీసీ నడుచుకుంటోంది’’ అని ధ్వజమెత్తారు. ‘‘పీసీసీ తప్పుచేసి ఆ నిందను ఏఐసీసీపైన వేస్తోంది’’ అని ఆరోపించారు. ఇలాంటి అనేక వ్యాఖ్యలను జీవన్ రెడ్డి మొదలుపెట్టేశారు. ఈ మాటలన్నీ ఆయనకు రేవంత్ మీద కోపాన్ని చూపిస్తాయి, తప్ప కేసిఆర్ మీద, బిఆర్ ఎస్ మీద ప్రేమను చూపించవు. రేవంత్ మీద ఇక పొద్దుటినుంచి సాయంకాలం దాకా తిట్టిన తిట్టకుండా కెసిఆర్ అండ్ కో పురమాయిస్తాయి. జీవన్ రెడ్డి కి బిఆర్ ఎస్ నుంచి సెక్రెటరీ జనరలో, జనరల్ సెక్రెటరీయో దక్కవచ్చు. కాని బిఆర్ ఎస్ దక్కించుకుంటున్నది చాలా ఎక్కువే.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇపుడు జీవన్ చేసిన వ్యాఖ్యలనే ఎప్పటినుండో కేటీఆర్, హరీష్ చేస్తున్నారు. అంటే ఎప్పటినుండో రేవంత్‌కు వ్యతిరేకంగా కేటీఆర్, హరీష్ చేస్తున్న ఆరోపణలను జీవన్ కోరస్ ఇవ్వడమే. ఆ మాటకొస్తే కేటీఆర్, హరీష్ చేస్తున్న ఆరోపణలే ఎక్కువ. ఆ విమర్శలకే జనాలు పెద్దగా స్పందించటంలేదన్న విషయం అందరికీ తెలిసిందే. మరి అవే ఆరోపణలు, విమర్శలను జీవన్ కూడా చేయటం వల్ల ఏమిటి ఉపయోగం. ‘చూడండి కాంగ్రెస్ లో ఉన్న గాంధియన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ ని తిడుతున్నారు," అని బిఆర్ ఎస్ చెప్పుకోవచ్చు.

తనవిషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యంచేసుకోలేదన్న మంట జీవన్లో బాగా కనబడుతోంది. అంతేకాదు, ఇంత జరుగుతున్నా, తనని రేవంత్ రెడ్డి పిలిచి, భుజం మీద చేయ్యేసి బుజ్జగించలేదనే అవేదన కూడా ఇందులో దాక్కుని ఉంది. ఇపుడున్న వాతావరణంలో రేవంత్ రెడ్డి ఎవ్వరినీ బుజ్జగించే స్థితిలోలేరు. తప్పఒప్పా అనేది విషయం విస్మరిస్తే అది ఆయన స్థాయి ఇపుడు. అది పార్టీకి నష్టమో లాభమో గాని, ఇపుడు రేవంత్ డిక్టేటరే. రేవంత్ చేస్తున్నవాటిలో ప్రజలకు ఇబ్బంది కల్లించేవి, రాష్ట్రానికి హాని చేసేవి చాలా ఉన్నాయని మేధావులు, పర్యావరణ నిపుణులు, ఆర్థిక నిపుణులూ ఉంటూనే ఉన్నారు.

ఇక, "ప్రభుత్వం తిరుగమనంలో పయనిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పోవాలి. రాష్ట్రం నాశనం, కాంగ్రెస్ నాశనం. ప్రభుత్వమంతా కరప్షన్, భూదాహం, భూబాగోతం, భూ దందా " వంటి శాపనార్థాలు రాజకీయాల్లో అన్ని రాష్ట్రాల్లో వినిపిస్తున్న పాత, పస లేని విమర్శలే. ఇంతకు మించి జీవన్ రెడ్డి బిఆర్ ఎస్ కు ఇచ్చేది ఏమీ ఉండదు. వాటి వల్ల రేవంత్ రెడ్డికి వచ్చే తంటా కూడా ఏమీ ఉండదు. జీవన్ రెడ్డి, ‘కేసీఆర్ రావాలి’ అనే ఒక మహత్తర నినాదం కంటే, ఏదైనా ప్రజా సమస్య తీసుకుని రేవంత్ వ్యతిరేకంగా ఉద్యమించి ఉంటే బాగుండేది. రేవంత్ రెడ్డి విధానాల వల్ల నష్టపోయిన ప్రజలు చాలా చోట్ల ఉద్యమిస్తున్నారు, ఎక్కడా జీవన్ రెడ్డి పాల్గొన లేదు. వాళ్లకి మద్దుత తెలపలేదు. ఆయన తెలంగాణ ప్రజల పక్షాల మాట్లాడుతున్నట్లు లేదు. తన అక్కసు వెలిగక్కుతున్నా డు, కేసిఆర్ పక్షాన మాట్లాడుతున్నాడు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటినుండి మొన్ననే జరిగిన మున్సిపల్ ఎన్నికలవరకు ఏ ఎన్నికలోను బీఆర్ఎస్ సంతృప్తికరమైన ఫలితాలు సాధించలేదు. ప్రతి ఎన్నికలోను కాంగ్రెస్ పార్టీకే జనాలు పట్టం కడుతున్నారు. జీవన్ రెడ్డి కోరుకుంటే కేసీఆర్ వచ్చేస్తారా ?

ఒకపుడు పీసీసీ చెప్పినట్లు సీఎం నడుచునేవారట..ఇపుడు సీఎం చెప్పినట్లు పీసీసీ నడుచుకుంటోందనే విమర్శ వినటానికే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు చెప్పినట్లుగా ఏ ముఖ్యమంత్రీ నడుచుకోలేదు. ఇపుడు సీఎం చెప్పినట్లుగా పీసీసీ నడుచుకోవటంలో తప్పేముందో అర్ధంకావటంలేదు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఒకతాటిపైన నడవటం మంచిదేకదా. ఇంతోటిదానికి జీవన్ కు ఎందుకింత బాధో అర్ధంకావటంలేదు. 20వ తేదీన జగిత్యాలలో జరగబోతున్న బహిరంగసభలో ఇంతకంటే ఇంకేమి ఎక్కువ మాట్లాడుతారో చూడాలి.

Read More
Next Story