
ఎంకే స్టాలిన్
తమిళ పార్టీలకు ‘వంటగది’ యుద్ధ కేంద్రంగా మారిందా?
మహిళలే లక్ష్యంగా ఉచిత పథకాలు ప్రకటిస్తున్న ద్రావిడ పార్టీలు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఇటీవల ప్రతిపక్ష అన్నాడీఎంకే తమ పార్టీ మ్యానిపెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికార పార్టీ కూడా తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదివారం (మార్చి 29) అరివాలయంలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను వివరించారు.
ఈ ప్రణాళికలోని అనేక వాగ్దానాలలో, సరికొత్త ఒరవడిని సృష్టించిన “ఇల్లతారసి కూపన్” పథకం ప్రత్యేకంగా నిలిచింది. ఈ పథకం కింద, ఆదాయపు పన్ను చెల్లించని దాదాపు 2 కోట్ల మంది గృహిణులకు గృహోపకరణాలు కొనడానికి లేదా కొత్తవి కొనుక్కోవడానికి రూ. 8,000 విలువైన కూపన్లు అందిస్తున్నారు.
ఈ పథకం ద్వారా లబ్ధిదారులు వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మిక్సర్-గ్రైండర్లు, ఓవెన్లు, మైక్రోవేవ్‌లు లేదా ఇండక్షన్ స్టవ్‌ల వంటి వస్తువులను కొనుగోలు చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. వంటగది, గృహావసరాలతో కూడిన ఈ విస్తృత పథకం, ప్రతి కుటుంబానికి ఒక ఉచిత రిఫ్రిజిరేటర్ ఇస్తామన్న ఏఐఏడీఎంకే హమీని మించిపోయినట్లు కనిపిస్తోంది. ఈ సాయాన్ని నేరుగా నగదు రూపంలో కాకుండా కూపన్ల రూపంలో ఎందుకు ఇస్తున్నారో తమిళనాడు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వివరించారు.
“మనం డబ్బు ఇస్తే, వారు దానిని ఇతర విషయాలపై ఖర్చు చేయవచ్చు. కూపన్లు ప్రయోజనం ఉద్దేశించిన వారికి చేరేలా చూస్తాయి, గృహిణులపై భారాన్ని తగ్గిస్తాయి” ఆయన మొత్తం మేనిఫెస్టోను డిఎంకె విజయానికి పునాది వేసే “సూపర్ స్టార్” పత్రంగా అభివర్ణించారు. ఏప్రిల్ 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 200 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు.
గృహిణుల మద్దతు కోసం పోరాటం
కేవలం ఐదు రోజుల ముందు, మార్చి 24న, ఏఐఏడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి తన పార్టీ 297-సూత్రాల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో “గృహిణుల ఇంటి పనిభారాన్ని తగ్గించడానికి” బియ్యం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలన్నింటికీ ఉచిత రిఫ్రిజిరేటర్లను అందిస్తానని వాగ్థానం చేశారు.
పెరుగుతున్న ధరలు, పన్నుల భారాన్ని తగ్గించడానికి ప్రతి కుటుంబానికి ఒకేసారి రూ. 10,000 ప్రత్యేక సాయం, అదనంగా 'కులం విళక్కు పథకం' కింద ప్రతి కుటుంబంలోని మహిళా గృహిణికి నేరుగా నెలకు రూ. 2,000 అందిస్తామని ఏఐఏడీఎంకే హామీ ఇచ్చింది. అదనపు ప్రోత్సాహకాలలో భాగంగా ఉద్యోగం చేసే మహిళలకు ద్విచక్ర వాహనాలపై రూ. 25,000 సబ్సిడీ, రేషన్ కార్డుదారులకు ఉచిత సబ్బులు వంటివి ఉన్నాయి.
తమిళనాడులో సర్వసాధారణంగా మారిన ఈ ఉచితాల యుద్ధంలో రెండు పార్టీలు స్పష్టంగా ఒకే వర్గాన్ని అంటే మహిళలు, గృహిణులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఏఐఏడీఎంకే ఫ్రిజ్ హామీకి ప్రతిస్పందనగా డీఎంకే కూపన్ పథకాన్ని చాలామంది ఒక వ్యూహాత్మక చర్యగా చూస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని మరిన్ని గృహోపకరణాలకు విస్తరిస్తూ, దీనిని మరింత ఆలోచనాత్మకమైన, ఎంపిక ఆధారిత చర్యగా అభివర్ణిస్తున్నారు.
డీఎంకె మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:
మహిళలు - గృహిణుల కోసం
2 కోట్ల మంది గృహిణులకు (ఆదాయపు పన్ను చెల్లించనివారు) రూ. 8,000 ఇల్లతరసి కూపన్.
కళైజ్ఞర్ మగళిర్ ఉరుమై తొగైని నెలకు రూ. 2,000కి పెంచారు (ప్రస్తుతం రూ. 1,000); ప్రతి సంవత్సరం కొత్తగా అర్హులైన మహిళలకు అవకాశం.
విడియల్ పయనం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుంది.
ఉద్యోగం చేసే మహిళల కోసం 1,000 కొత్త శిశు సంరక్షణ కేంద్రాలు.
కుటుంబాలు - ఆరోగ్యం కోసం
ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరించారు (అదనంగా 15 లక్షల మంది విద్యార్థులను చేర్చారు).
వైద్య బీమా పరిధిని రూ. 10 లక్షలకు పెంచారు. వార్షిక ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు.
రాబోయే ఐదేళ్లలో 10 లక్షల కొత్త కాంక్రీట్ ఇళ్లు.
రైతుల కోసం
ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులకు ఉచిత ఆధునిక ఎలక్ట్రిక్ పంపు సెట్లు (మీటర్లు లేనివి).
వరి సేకరణ ధరను క్వింటాల్‌కు రూ. 3,500కి పెంపు చెరకు ధరను టన్నుకు రూ. 4,500కి పెంపు.
పాల సేకరణ ధర లీటరుకు రూ. 5 చొప్పున పెంపు.
యువత - విద్య కోసం
ఐదేళ్లలో కళాశాల విద్యార్థులకు 35 లక్షల ఉచిత ల్యాప్‌టాప్‌లు.
ఐదు లక్షల మంది పట్టభద్రులకు నాన్ ముదల్వన్ నైపుణ్య శిక్షణ + నెలకు రూ. 1,500 స్టైపెండ్.
పుదుమై పెన్, తమిళ పుదల్వన్ పథకాలను నెలకు రూ. 1,500కు పెంపు.
1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఆలస్యం లేకుండా భర్తీ చేయనున్నారు.
ఇతర కీలక హామీలు
పెన్షన్ల పెంపు: సీనియర్ సిటిజన్లు/వితంతువులకు రూ. 2,000; దివ్యాంగులకు రూ. 2,000–2,500.
50 కొత్త సెమ్మొళి పూంగాలు (తమిళ భాషా పార్కులు); చెన్నైలో సెమ్మొళి సదస్సు.
కోయంబత్తూరు, సేలం, మదురై, ట్రిచీ చుట్టూ భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నాలుగు గ్లోబల్ నగరాలు. 10,000 కొత్త బస్సులు; 20,000 కోట్ల రూపాయల పారిశ్రామిక అభివృద్ధి ప్యాకేజీ.
50 లక్షల ఉద్యోగాల కల్పన కోసం 18 లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడుల లక్ష్యం.
ఐటీ ఎగుమతులను రెట్టింపు చేసి రూ. 5 లక్షల కోట్లకు చేర్చడం.
బలహీన కుటుంబాల కోసం “తాయుమానవర్” పథకం, స్వయం సహాయక బృందాల మహిళలకు రూ. 5 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు.
“ఈ ఎన్నికల ప్రణాళికే విజయానికి పునాది అవుతుంది” అని స్టాలిన్ ప్రకటించారు.
ఫ్రిజ్ వర్సెస్ కూపన్
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి. బాలచంద్రన్ డీఎంకే విధానాన్ని స్వాగతించారు. "ఒక పార్టీ ప్రత్యర్థి పార్టీ కంటే ఎక్కువ ఆకర్షణీయమైన వాగ్దానాలు ఇవ్వడం తప్ప వేరే దారి లేకుండా పోయింది. డీఎంకే మేనిఫెస్టో ఇదే తెలియజేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
ఏఐఏడీఎంకే ఉచిత ఫ్రిజ్ వాగ్దానం ఆచరణాత్మక ప్రయోజనాన్ని ఆయన ప్రశ్నించారు, "కేవలం రూ. 8,000తో, గృహిణులు ఎలాగూ ఒక చిన్న రిఫ్రిజిరేటర్‌ను మాత్రమే కొనుగోలు చేయగలరు" అని పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా, డీఎంకే రూ. 8,000 కూపన్ పథకాన్ని ఆయన "ఒక మంచి ఆలోచన" అని అభివర్ణించారు.
ఎందుకంటే ఇది గృహిణులకు తమకు నిజంగా అవసరమైన గృహోపకరణాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది. " ఈ మేనిఫెస్టో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ విజయవంతంగా మిళితం చేస్తుంది" అని బాలచంద్రన్ అన్నారు.
డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తయారీ కమిటీ చైర్‌పర్సన్ కనిమొళి మాట్లాడుతూ, పత్రాన్ని ఖరారు చేసే ముందు పార్టీ వివిధ రంగాల నిపుణులను సంప్రదించిందని చెప్పారు. "మేము ఆచరణ సాధ్యమైన, వాస్తవంగా అమలు చేయగల వాగ్దానాలను మాత్రమే ఇచ్చాము" అని ఆమె చెప్పారు.
పోటాపోటీ సంక్షేమం..
ద్రావిడ యుగం నుంచి తమిళనాడు రాజకీయాలు పోటీ సంక్షేమం ద్వారా నిర్వచించబడ్డాయి. గతంలో DMK స్వయంగా భారీ విజయాన్ని రుచి చూసింది. 2006 ఎన్నికలలో అప్పటి రాష్ట్రపతి ఎం. కరుణానిధి ఉచిత కలర్ టెలివిజన్ సెట్ల వాగ్దానం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సాయపడింది.
ఈ చర్య DMK - AIADMK రెండూ ప్రజాకర్షక పథకాలకు కేంద్రంగా మారింది. జె. జయలలిత నాయకత్వంలోని AIADMK, ఉచితంగా మిక్సర్లు-గ్రైండర్లు, ఫ్యాన్లు, వివాహాలకు బంగారాన్ని కూడా పంపిణీ చేసి రాష్ట్రంలో ఖ్యాతి పొందారు. 2021లో DMK తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, నెలకు రూ. 1,000 మహిళా సాయం (మగళిర్ ఉరుమై) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను విస్తరించింది.
అన్బుమణి విమర్శలు
PMK అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రామదాస్ DMK ఎన్నికల మేనిఫెస్టోపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో, డీఎంకే 505 హామీలు ప్రకటించిందని, కానీ వాటిలో 439 హమీలని పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని ఆయన అన్నారు.
“ఈసారి కొత్త ఎన్నికల మేనిఫెస్టో అవసరం లేదు. నెరవేరని హామీల జాబితానే వారు తమ కొత్త మేనిఫెస్టోగా విడుదల చేసి ఉండవచ్చు” అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో నెరవేర్చిన హామీల వాదనను 80 శాతం నుంచి 75 శాతానికి తగ్గించి, ఇప్పుడు 100 శాతం నెరవేర్పును ప్రదర్శిస్తున్న స్టాలిన్ వైఖరిని ఆయన విమర్శించారు. “గత నాటకాలన్నిటిలాగే, ఈ నాటకం కూడా ఫలించదు,” అని అన్బుమణి రామదాస్ అన్నారు.
నీట్, మద్యపాన నిషేధం రద్దు..
డీఎంకే తన 2021 మేనిఫెస్టోలో నీట్ వైద్య ప్రవేశ పరీక్షను రద్దు చేస్తామని హమీ ఇచ్చింది. ఈ హామీయే ఆ పార్టీకి భారీ విజయాన్ని అందించింది. అయితే, సంవత్సరాల తరబడి సాగిన న్యాయ పోరాటాల తర్వాత, ఆ పార్టీ 2026లో ఈ వాగ్థానం జోలికి పోదల్చుకోలేదు.
దానికి బదులుగా, తక్షణ, స్పష్టమైన ప్రయోజనాల విస్తృత శ్రేణిపై దృష్టి సారించింది. గత ఎన్నికలలో, ముఖ్యంగా డీఎంకేకు సంపూర్ణ మద్యపాన నిషేధం (మడువిళక్కు) వాగ్దానం తరచుగా ఒక ప్రధాన ప్రచార అంశంగా ఉండేది.
దానికి భిన్నంగా, ఏ పార్టీ 2026 మేనిఫెస్టోలోనూ మద్యంపై నిషేధం విధించడం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.తమిళనాడులో మద్యం విధానం చారిత్రాత్మకంగా ఒక సున్నితమైన, రాజకీయంగా వివాదాస్పదమైన అంశం.
ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కేవలం కొన్ని వారాల దూరంలో ఉన్నాయి. ఓటర్లలో నిర్ణయాత్మక వాటా కలిగిన మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి రెండు ప్రధాన ద్రావిడ పార్టీలు తీవ్రమైన పోరాటంలో నిమగ్నమై ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
డీఎంకే కూపన్ పథకం గృహిణులకు తమకు నిజంగా అవసరమైన వాటిని ఎంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుండగా, ఏఐఏడీఎంకే ఫ్రిజ్ వాగ్దానం కంటికి కనిపించేదిగా ఉంది. కూపన్లైనా, ఫ్రిజ్‌లైనా, ఒక విషయం స్పష్టం.. తమిళనాడు 2026 ఎన్నికల రంగస్థలానికి వంటగది కేంద్రంగా మారింది.
Next Story

