
టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం మీద సిట్ దృష్టిపెట్టిందా ?
కుటుంబసభ్యులందరినీ విచారించిన తర్వాత చివరాఖరుగా సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది
తెలంగాణలో కలకలం రేపిన టెలిఫోన్ ట్యాపింగ్ లో సంచలనం చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారిస్తోంది. ఇప్పటికే ఈ ఫార్ములా కార్ రేసు అవినీతిలో విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్(KTR) శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో శుక్రవారం విచారణకు హాజరయ్యారు. సీఆర్పీసీ 160 ప్రకారం జారీ అయిన నోటీసులకు సమాధానంగా కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. మంగళవారం పార్టీలోని కీలకనే(Harish Rao)త హరీష్ రావును కూడా సిట్ విచారించిన విషయం తెలిసిందే. తొందరలోనే(KCR) కేసీఆర్ కూతురు (Kavitha)కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనీల్ కుమార్ ను కూడా సిట్ అధికారులు విచారణకు పిలవబోతున్నట్లు సమాచారం. హరీష్ ను ఏడున్నర గంటలు విచారించిన సిట్ అధికారులు కేటీఆర్ విచారణను ఎంతసేపు చేయబోతున్నారో చూడాలి. హరీష్ ను బాధితుడు, సాక్షిగా పిలిచిన సిట్ మరి కేటీఆర్ ను ఏ కోణంలో విచారిస్తోంది సిట్ ?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ అరాచకం జరిగిందన్నది వాస్తవం. అరాచకం జరిగిందనేందుకు కల్వకుంట్ల కవిత ఆరోపణలే సాక్ష్యం. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనతో పాటు తన భర్త ద్యావనపల్లి అనీల్ కుమార్ ఫోన్ ట్యాపయ్యింది’’ అని కవిత చేసిన ఆరోపణ అందరికీ తెలిసిందే. ‘‘ఇంటి ఆడబిడ్డతో పాటు ఆమె భర్త ఫోన్ ను ట్యాప్ చేయించటం కన్నా నీచం ఉంటుందా’’ అన్న కవిత ప్రశ్నకు బీఆర్ఎస్ క్యాంపు నుండి ఇప్పటివరకు సమాధానంలేదు.
అలాగే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పనిచేసిన టీ ప్రభాకరరావు ఆదేశాలతోనే తాము టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అరెస్టయిన తర్వాత విచారణలో నలుగురు పోలీసు అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతయ్య, భుజంగరావు, ప్రవీణ్ రావు అంగీకరించారు. ఇదే విషయాన్ని తర్వాత కోర్టులో కూడా అఫిడవిట్లు దాఖలుచేశారు. ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేయాలనే ఆదేశాలు ప్రభాకరరావు నుండే వచ్చేదని అయితే ఆయనకు ఎవరు ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చేవారో తమకు తెలీదు అని చెప్పారు. కాబట్టి కేటీఆర్, హరీష్, నేతలు ఎంత బుకాయించినా, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంత బెదిరించినా ఉపయోగం ఉండదు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
2023 ఎన్నికలకు ముందే పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన రేవంత్, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తదితరులు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే. అప్పట్లోన ట్యాపింగ్ విషయంలో పోలీసులకు వీళ్ళు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఆఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ట్యాపింగ్ పై సిట్ విచారణకు ఆదేశించటంతో మూలాలన్నీ కదులుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనమైన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ముందు కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీష్ రావును సిట్ ప్రశ్నించింది. ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ జరుగుతోంది. తర్వాత కవిత, ఆమె భర్త అనీల్ ను కూడా విచారించాలని సిట్ అధికారులు రెడీ అవుతున్నట్లు సమాచారం. కుటుంబసభ్యులందరినీ విచారించిన తర్వాత చివరాఖరుగా సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇప్పటికి విచారణలకు మాత్రమే పరిమితమైనా ఇంటెలిజెన్స్ మాజీ బాస్ టీ ప్రభాకరరావు నోరిప్పి ట్యాపింగులో అసలు సూత్రధారి పేరును వెల్లడించినపుడు అసలు యాక్షన్ ఉంటుందనే ప్రచారం పెరిగిపోతోంది. ఆ యాక్షన్ ఎప్పుడుంటుందో చూడాల్సిందే.

