
తెలంగాణలో పురుష నేతలకు ఇంత అన్యాయం జరిగిందా ?
ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ మేయర్ పోస్టును కూడా పురుషులకు కేటాయించలేదు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పురుషులకు తీరని అన్యాయం జరిగింది. ఉద్యోగ, విద్య లాంటి విషయాల్లో కాదు. రాజకీయంగా పురుష నేతలకు తీరని అన్యాయం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్లు, ఛైర్మన్లకు శనివారం రిజర్వేషన్లు ఖరారుచేసింది. ఇందులో మేయర్ పోస్టుల రిజర్వేషన్లలోనే మగనేతలకు పూర్తిగా అన్యాయం జరిగింది. రాష్ట్రంలో పది మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. వీటిల్లో ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ మేయర్ పోస్టును కూడా పురుషులకు కేటాయించలేదు. మొత్తం రిజర్వేషన్లలో ఎస్టీ జనరల్ కు ఒకటి, ఎస్సీ జనరల్ కు ఒక కార్పొరేషన్ కేటాయించారు.
అలాగే బీసీలకు మూడు కార్పొరేషన్లను కేటాయించిన కమిషన్ ఇందులో రెండు బీసీ జనరల్ కు ఒక సీటును బీసీ మహిళకు కేటాయించింది. ఇక మిగిలిన ఐదు కార్పొరేషన్లలో నాలుగు కార్పొరేషన్లను జనరల్ మహిళకు కేటాయించిన కమిషన్ ఒక కార్పొరేషన్ ను మాత్రమే జనరల్ కేటగిరీలో ఉంచింది. అంటే జనరల్ కు కేటాయించిన కార్పొరేషన్ను కచ్చితంగా పరుషులకు మాత్రమే కేటాయించాలన్న నిబంధన లేదు కాబట్టి మహిళకు కూడా కేటాయించే అవకాశం ఉన్నది.
కొత్తగూడెం కార్పొరేషన్ ను ఎస్టీ జనరల్ కు కేటాయించింది కమిషన్. రామగుండం కార్పొరేషన్ ను ఎస్సీ జనరల్ కు కేటాయించింది. అంటే ఈరెండు కార్పొరేషన్లలో పురుషులు లేదా మహిళల్లో ఎవరైనా మేయర్ అవ్వచ్చు. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను బీసీ మహిళకు కేటాయించగా మంచిర్యాల, కరీంనగర్ కార్పొరేషన్లను బీసీ జనరల్ కు కేటాయించారు. వీటిని కూడా పురుషులు లేదా మహిళలకు కేటాయించవచ్చు.
వీటి సంగతి ఇలాగుంచితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టును జనరల్ మహిళకు కేటాయించారు. జనరల్ మహిళ అంటే కులంతో సంబంధంలేకుండా ఏ మహిళకైనా పదవి దక్కవచ్చు. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లను కూడా జనరల్ మహిళలకు కేటాయించింది కమిషన్. అయితే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ను మాత్రం జనరల్ కేటగిరిలో ఉంచింది. జనరల్ కేటగిరి అన్నంత మాత్రాన పురుషులకే కేటాయించాలని ఏమీలేదు. ఈ మేయర్ పోస్టులో మహిళ కూడా కూర్చోవచ్చు. వరంగల్ లో పురుషులు లేదా మహిళల్లో ఎవరు బలమైన నేతయితే వాళ్ళకే ఈ మేయర్ పోస్టు దక్కుతుంది అనటంలో సందేహంలేదు.
తాజా రిజర్వేషన్లను గమనిస్తే రేవంత్ రెడ్డి ఏలుబడిలోని తెలంగాణలో పురుషులకు జరిగిన అన్యాయం అర్ధమైపోతుంది. ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ ను కూడా పురుషులకు కేటాయించలేదు. ప్రత్యేకంగా నాలుగు మేయర్ పోస్టులను మహిళలకే కేటాయించిన కమిషన్ పురుషులకు మాత్రం తీరని అన్యాయం చేసింది. దీన్ని రాజకీయపార్టీల్లోని నేతలు ప్రత్యేకించి కాంగ్రెస్ నేతలు ఏ విధంగా చూస్తారన్నది ఆసక్తిగా మారింది.

