టీడీపీ, జనసేన తోకపార్టీలు అయిపోయాయా ?
x

టీడీపీ, జనసేన తోకపార్టీలు అయిపోయాయా ?

బీజేపీతో పొత్తులేనిదే తెలంగాణ రాజకీయాల్లో స్వతంత్రంగా రాజకీయాలు చేసేంత సీన్ చంద్రబాబు, పవన్‌కు లేదన్నది వాస్తవం


రాజకీయాలు బహుచిత్రంగా ఉంటాయి. ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి నాయకత్వం వహిస్తున్నది చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ. కూటమిలో టీడీపీ తర్వాత పెద్ద పార్టనర్ పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన. మరి మూడోపార్టీ బీజేపీ పరిస్ధితి ఏమిటి ? ఏమిటంటే పైరెండుపార్టీలకు తోకపార్టీనే అనటంలో సందేహంలేదు. కారణం ఏమిటంటే బీజేపీకి ఓటుబ్యాంకే లేదు. 2019 ఎన్నికల్లో బీజేపీకన్నా నన్ ఆఫ్ ది ఎబోవ్(నోటా)కు ఎక్కువ ఓట్లు పోలైన విషయం అందరికీ తెలిసిందే. బీజేపీ సుమారు 100 సీట్లకు పైగా అప్పటి ఎన్నికల్లో పోటీచేస్తే ఒక్కటంటే ఒక్కరికి కూడా కనీసం డిపాజిట్ కూడా రాలేదు. అది బీజేపీ బలం ఏపీలో. అందుకనే దానికి టీడీపీకి తోకపార్టీ అనే పేరు స్ధిరమైపోయింది.

ఇక ఏపీ రాజకీయాలను వదిలేసి తెలంగాణ రాజకీయాలను చూద్దాం. ఇక్కడ పూర్తిగా సీన్ రివర్సులో ఉంటుంది. నిజానికి తెలంగాణలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తులేదు. బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని చంద్రబాబు, పవన్ తహతహలాడుతున్నారు. బీజేపీతో పొత్తులేనిదే తెలంగాణ రాజకీయాల్లో స్వతంత్రంగా రాజకీయాలు చేసేంత సీన్ చంద్రబాబు, పవన్‌కు లేదన్నది వాస్తవం. అందుకనే తెలంగాణలో బీజేపీకి టీడీపీ, జనసేన తోకపార్టీలు అయిపోయాయి. అలాగని బీజేపీ అధికారంలో ఏమీలేదు. అయినా పై రెండు తోకపార్టీలే అని చెప్పవచ్చు. ఎలాగంటే బీజేపీ తెలంగాణలో టీడీపీ, జనసేనతో పోల్చుకుంటే చాలా బలంగా ఉన్నది.

ఓటుకునోటు దెబ్బ

బీజేపీకి తెలంగాణలో 8మంది ఎంపీలు, 8మంది ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంఎల్సీలున్నారు. మరి టీడీపీ, జనసేన బలమెంతుంది ? ఎంతంటే ఈ పార్టీలకు తెలంగాణలో కనీసం వార్డుమెంబర్లు కూడా లేరు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ‘ఓటుకునోటు’ కారణంగా కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు తెలంగాణను వదిలేసి విజయవాడకు పారిపోయారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అప్పటి ఎంఎల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామినేటెడ్ ఎంఎల్సీ స్టీఫెన్ సన్ ఓటు కొనేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఓటుకు ఎంత డబ్బివ్వాలనే విషయంలో బేరంకూడా కుదిరింది. డబ్బిచ్చే సమయంలో వ్యవహారం అడ్డంతిరిగి ఏసీబీ అధికారుల దాడిలో ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు మరో ఐదుగురు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అదే ఓటుకునోటుగా దేశంలో సంచలనమైంది.


తర్వాత కేసీఆర్-చంద్రబాబు మధ్య చాలారోజులు మాటలయుద్ధం జరిగింది. ఒక ప్రభుత్వంపై మరో ప్రభుత్వం కేసులు పెట్టుకునేంత స్ధాయికి వివాదం చేరుకున్నది. దాంతో తనను కూడా ఎక్కడ అరెస్టుచేస్తారో అన్న భయంతో కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్ వదిలి విజయవాడ పారిపోయారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాగే ఆంధ్రాపార్టీగా ముద్రపడిన జనసేన అధినేత పవన్ కూడా తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలంగాణను వదిలేసి ఏపీకి వెళ్ళిపోయారు. ఫలితంగా తెలంగాణలో టీడీపీ, జనసేనలు బాగా దెబ్బతినేశాయి. జేసీబీలను పెట్టి లేపినా లేవలేనంతగా రెండుపార్టీలు దెబ్బతినేశాయి.

ఈనేపధ్యంలోనే తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలన్న ఆలోచన చంద్రబాబు, పవన్ లో మొదలైంది. ఈమధ్యనే నేతలిద్దరు తెలంగాణ పార్టీ నేతలసమావేశాల్లో మాట్లాడుతు గ్రేటర్ ఎన్నికలపై అందరు దృష్టి పెట్టాలని ఆదేశించారు. అయితే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీచేస్తారా ? అలా చేయటంలేదు. బీజేపీతో పొత్తుపెట్టుకుని పోటీచేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీతో పొత్తులేకుండా బరిలోకి దిగితే ఏమవుతుందో చంద్రబాబు, పవన్ ఇద్దరికీ బాగా తెలుసు. అయితే బీజేపీనేమో రాబోయే ఏ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీచేస్తానంటోంది. ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోదని బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు తాజాగా ప్రకటించారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కూడా ఇదే విషయాన్ని ఎన్నోసార్లు ప్రకటించారు.

బీజేపీ వాదనేంటి ?

టీడీపీ, జనసేనతో పొత్తు వద్దని బీజేపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. ఎందుకంటే ఈ రెండుపార్టీలతో పొత్తుపెట్టుకుంటే బీజేపీ నష్టపోవటం ఖాయమని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. టీడీపీ, జనసేనకు ఆంధ్రాపార్టీలుగా బీఆర్ఎస్ బలమైన ముద్రవేసింది. ఒకవేళ ఈ రెండుపార్టీలు తెలంగాణలో పోటీచేస్తే వెంటనే కేసీఆర్ అండ్ కో మళ్ళీ తెలంగాణ సెంటిమెంటును రాజేస్తారు. బీఆర్ఎస్ బతుకుతున్నదే తెలంగాణ సెంటిమెంటు మీద. అయితే ఈ సెంటిమెంటు కూడా బీఆర్ఎస్ ను ఎక్కువకాలం ఆదుకోలేందని అందరికీ తెలుసు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటును రాజేస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ప్లేచేయబోయే సెంటిమెంట్ కారణంగా టీడీపీ, జనసేనతో కలిస్తే బీజేపీ కూడా దెబ్బతినటం ఖాయమని ఇప్పటికే బీజేపీ నేతలు వేర్వేరు సందర్భాల్లో జాతీయ నాయకత్వానికి గతంలోనే రిపోర్టులిచ్చినట్లు సమాచారం.

చంద్రబాబు, పవన్ కారణాలేంటి ?

వీళ్ళిద్దరికి హైదరాబాద్ అంటే మహాప్రేమ. కారణం ఏమిటంటే దశాబ్దాలుగా ఉన్న అనుబంధమే. చంద్రబాబు, పవన్ ఆస్తులన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. చంద్రబాబు కుటుంబ సంస్ధ హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీసు కూడా హైదరాబాద్ లోనే ఉంది. పార్టీల అధినేతల వ్యాపారాలు, ఇళ్ళు, ఫామ్ హౌసులు సమస్తం హైదరాబాదే. కాబట్టే ఏపీలో సీఎం, డిప్యుటి సీఎంలుగా ఉన్నా ఇద్దరు ప్రతివారం హైదరాబాద్ లో వాలిపోతున్నారు. ఇంతటి అనుబంధం ఉందికాబట్టే రాజకీయంగా మళ్ళీ నిలదొక్కుకుంటే చక్రంతిప్పచ్చన్నది వీళ్ళ ఆలోచన. ఎలాగూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకడైన ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి చేసే ప్రయత్నమేదో గట్టిగా చేస్తే బీజేపీ పుణ్యమా అని తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ నిలదొక్కుకోవచ్చని చంద్రబాబు ఆశ. తన ప్రయత్నాలకు ఇతరత్రా ఏదైనా అవాంతరాలొస్తే రేవంత్ ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీకి టీడీపీ, జనసేనలు తోకపార్టీలైపోయాయి అనటంలో ఎలాంటి సందేహంలేదు.

Read More
Next Story