
హరీష్‌ను విచారిస్తున్న పోలీస్ స్టేషన్ దగ్గర హైటెన్షన్
విచారణ పేరుతో తమ నేత హరీష్ రావును వేధిస్తున్నారంటూ ఆందోళన బాట పట్టిన బీఆర్ఎస్ శ్రేణులు.
జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ వద్ద హైటెన్షన్ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు విచారణ జరుగుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. తమ నాయకుడు హరీష్ రావును విడిచిపెట్టాలంటూ నినాదాలు చేస్తున్నారు. విచారణ పేరుతో హరీష్ రావును ఐదు గంటలకుపైగా వేధిస్తున్నారని, ఫోన్ టాపింగ్‌తో తనకు సంబంధం లేదని చెప్పినా హరీష్ రావును అధికారులు విడిచి పెట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తుండటంతో పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవన్నీ డైవర్షన్ ప్రయత్నాలే: హరీష్ రావు
అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు హాజరు కావడానికి ముందే హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనకు ఇచ్చిన నోటీసులు, విచారణ అంతా కూడా ప్రజల దృష్టిని మల్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుతున్న పన్నాగాలేనని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. పిలిచిన ప్రతిసారి విచారణకు హాజరవుతానని భయపడబోనని అన్నారు. గతంలో తనపై నమోదైన కేసులను హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టివేశాయని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆరు గ్యారంటీలు ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నలు కొనసాగుతాయని అవినీతి అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఆగ్రహం..
రెండు సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా మాజీమంత్రి హరీస్ రావును విచారణకు పిలిచింది సిట్. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హరీష్ రావును విచారిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులు.. సిట్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పసలేని వ్యవహారమని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పినా, అధికారులు మాత్రం ప్రభుత్వం చెప్పింది వింటూ తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎటువంటి సాక్షాధారాలను సిట్ సంపాదించలేక పోయిందని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి. నిజంగా తప్పు జరిగి ఉంటే ఇప్పటి వరకు ఎందుకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

