అమరావతి ‘చట్టబద్ధ’ హోదా  కోసం అసెంబ్లీలో  తీర్మానం
x

అమరావతి ‘చట్టబద్ధ’ హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం

అమరావతి రాజధాని కి పార్లమెంటు చట్టం ద్వారా లీగల్ హోదా కల్పించి అనిశ్చితికి ముగింపు పలకాలని కోరుతూ ఆంధ్రా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం


ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధంగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో చారిత్రాత్మక తీర్మానం ప్రవేశపెట్టారు.

చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఎన్ డిఎ ప్రభుత్వం అధికారం చేపట్టి నప్పటి నుంచి పార్లమెంటులో చట్టం చేసి అమరావతే రాజధాని అని ప్రకటించండని కోరుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినపుడల్లా ప్రధానిని , హోం మంత్రి అమిత్ షాను కలుస్తున్నారు. పార్లమెంటులో చట్టం చేసి ‘అమరావతినే రాజధాని, అమరావతి ఒక్కటే రాజధాని, అది మారదు, ఎవరూ మార్చలేరు, ఈ విషయంలో ఎవరూ ముఖ్యంగా ఇన్వస్టర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదు,’ అనే భరోసా వచ్చేలా చట్టం చేయాలని కోరుతూ వస్తున్నారు. ఎందుకో గాని కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. పార్లమెంటులో ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేయించడం ప్రధాని మోదీ ప్రభుత్వానికి అంత కష్టమేమీ కాదు. ఈ కోరిక కోరుతున్నది కూడా ఎవరో కాదు, ఎన్ డిఎ ప్రభుత్వానికి కీలకమయిన మద్దతు నిచ్చిన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత. అయినా సరే, బిల్లును ప్రవేశపెట్టలేదు.

దీనితో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరంగా అసంబ్లీ ప్రత్యేక ‘అమరావతి సమావేశం,’ ఏర్పాటు చేసి తీర్మానం చేయించాల్సి వచ్చింది.

ఈ తీర్మానం ప్రధానంగా రాష్ట్ర విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)లో సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరుతోంది. ప్రస్తుతం ఉన్న “కొత్త రాజధాని ఏర్పాటు చేయాలి” అనే వాక్యానికి బదులుగా “అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలి” అని స్పష్టంగా చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

అలాగే అమరావతి అంటే ఏపీ సీఆర్‌డీఏ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతమని నిర్వచించాలని కూడా తీర్మానంలో పేర్కొన్నారు. ఈ మార్పుల ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా రాజధాని స్థానం మారకుండా చట్టపరమైన రక్షణ కల్పించడం లక్ష్యంగా ఉంది. ఇటీవలే కేంద్రం కూడా అమరావతికి శాశ్వత హోదా కల్పించే దిశగా చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు సమాచారం ఉండటం ఈ నిర్ణయానికి మరింత బలం చేకూర్చింది. అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా అమోదించింది. విభజన చట్టం సెక్షన్-5(2)ను సవరించాలని కోరుతూ ‘ఎట్ అమరావతి’ అనే పదాన్ని చట్టంలో చేర్చేలా అసెంబ్లీ తీర్మానించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతాలకు కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. శాసన సభ ఆమోదం పొందిన ఈ తీర్మానాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌కు పంపించారు.



జగన్ మీద చంద్రబాబు మాట దాడి

రాజధానిపై వైసీపీ బుద్ధి ఇంకా మారలేదని, గతంలో చేసిన కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశపెడుతూ ఆక్షేపించారు. సీఎం మాట్లాడుతూ వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు.‘రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదంటారు. వీళ్లకు ఏమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా? రాజారెడ్డి రాజ్యాంగాన్ని వీళ్లు అనుసరిస్తారు. దేశం అనుసరించేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. విభజన అనంతరం రాష్ట్రానికి రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలని 46 శాతం మంది కోరుకున్నట్టు శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పింది. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ వివిధ జాతీయ స్థాయి సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశాం. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తున్నామని గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడు రోజుకో మాటతో ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడు,’ అని ముఖ్యమంత్రి విమర్శించారు.

అసెంబ్లీలో వేడెక్కిన చర్చలు

తీర్మానం ప్రవేశపెట్టే ముందు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ఈ సభ ప్రతిబింబమని పేర్కొన్నారు. అయితే కీలక సమయంలో సభకు హాజరు కాని 11 మంది వైసీపీ సభ్యులపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పరిణామాలపై బాధ్యత తీసుకోవడంలో లోపం ఉందని సూచించారు.

తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2014 నుంచి 2019 మధ్య అమరావతి అభివృద్ధికి బలమైన పునాదులు వేసినప్పటికీ, తరువాతి కాలంలో ఆ ప్రగతి ఆగిపోయిందని తెలిపారు. పరిపాలనలో నిరంతరత లేకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితిని గుర్తుచేశారు.

అమరావతి నిర్మాణ ప్రస్థానం

తీర్మానానికి మద్దతుగా మంత్రి పి.నారాయణ అమరావతి ఎంపిక విధానాన్ని వివరించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, ప్రజాభిప్రాయం ఆధారంగా అమరావతిని ఎంపిక చేసినట్లు చెప్పారు. కేవలం 58 రోజుల్లో దాదాపు 30 వేల మంది రైతులు 34 వేల ఎకరాలకు పైగా భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వడం విశేషమని తెలిపారు. ప్రస్తుతం రూ. 59 వేల కోట్లతో 90కి పైగా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వివరించారు. అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా తీర్చిదిద్దే దిశగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

చట్టపరమైన ప్రక్రియ

ఈ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు పంపబడుతుంది. అనంతరం పార్లమెంటులో సవరణ బిల్లుగా ప్రవేశపెట్టి ఆమోదం పొందే ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వివరించినట్లుగా, ఇది రాష్ట్ర బిల్లు కాకుండా కేంద్ర చట్ట సవరణకు సంబంధించిన అంశం కావడంతో అసెంబ్లీలో మాత్రమే చర్చించడం సరైన ప్రక్రియగా పేర్కొంది. ఈ చర్యతో దశాబ్దకాలంగా కొనసాగుతున్న రాజధాని వివాదానికి చట్టబద్ధ ముగింపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రాజకీయ ప్రతిస్పందనలు

ఇక ఈ తీర్మానంపై రాజకీయంగా కూడా స్పందనలు వెల్లువెత్తాయి. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దీనిని రాజకీయ చర్యగా విమర్శించారు. అమరావతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధినేత సభకు హాజరు కాలేదు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ తీర్మానం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేసింది. రాజధాని అంశంలో స్పష్టత, స్థిరత్వం తీసుకురావడం ప్రధాన లక్ష్యమని పేర్కొంది.

ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ద్వారా అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేసే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. కేంద్ర నిర్ణయం తర్వాత తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

Read More
Next Story