మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మహిళా ఓట్లు ఇందుకే వచ్చాయా?
x

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మహిళా ఓట్లు ఇందుకే వచ్చాయా?

మున్సిపల్ ఎన్నికల్లో మహిళల భారీ విజయాలు. సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ ప్రభావంపై విశ్లేషణ.


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు కీలక పాత్ర పోయించారు. ఓట్లు వేయడంతో పాటు పదవులు చేపట్టడంలో కూడా మహిళలదే హవా. మున్సిపల్ ఛైర్మన్‌లలో 67.25 శాతం మంది మహిళలే ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు ఉండగా 38,09,406 మంది అంటే 73.01శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిలో 94,609 ఓట్లు ఇన్‌వాలిడ్ అయ్యాయి. మిగిలిన ఓట్లలో కాంగ్రెస్ వాటా 14,76,746 అంటే 39.08 శాతం. అంటే ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించడంలో కూడా కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఈ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెండంచెల వ్యూహం భారీ సక్సెస్‌గా నిలిచింది. ఒకేసారి అటు బీసీలను, ఇటు మహిళలను తనవైపు తిప్పుకోవడంలో రేవంత్ విజయం సాధించారు.

రేవంత్ రెండంచెల వ్యూహం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు నుంచి బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం కీలకంగా మరింది. అదే సమయంలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ అంశం కూడా తీవ్ర చర్చలకు దారితీసింది. అయితే ఆ రెండు అంశాలను రేవంత్ రెడ్డి ఈ మున్సిపల్ ఎన్నికలతో అందుకున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విజేతల్లో బీసీలే ఎక్కువ మంది ఉన్నారు. మున్సిపల్ ఛైర్మన్‌లు, వైస్ ఛైర్మన్ల పదవులు అందుకున్నవారిలో కూడా బీసీలే ఎక్కువ. అదే విధంగా ఇప్పుడు విజేతల్లో, పదవులు అందుకున్న వారిలో మహిళల పాత్ర కీలకంగా మారింది.

67.25శాతం మంది మహిళలే

మొత్తం 113 మున్సిపాలిటీల్లో 76 చోట్ల మహిళలు చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. ఇది 67.25 శాతం. 2020లో జరిగిన ఎన్నికల్లో 111 మున్సిపాలిటీల్లో 57 మంది మహిళలు మాత్రమే చైర్పర్సన్లుగా గెలిచారు. ఆ సమయంలో శాతం 51.35. ఈసారి అది 16 పాయింట్లు పెరిగింది. వీరిలో 40 ఏళ్ల లోపు మహిళలు 33 మంది. అంటే 43.42 శాతం. యువ మహిళా నాయకత్వం పెరగడం గమనార్హం. వైస్ చైర్పర్సన్ పదవుల్లో కూడా మహిళల సంఖ్య పెరిగింది. 113 మున్సిపాలిటీల్లో 54 మంది మహిళలు వైస్ చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఈ సంఖ్య 30 మాత్రమే. ఇది 20.76 శాతం పెరుగుదల.

కార్పొరేషన్లలో కూడా నారీశక్తే

మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 3 మంది మేయర్లు, 3 మంది డిప్యూటీ మేయర్లు మహిళలే. మొత్తం 414 డివిజన్లలో 223 చోట్ల మహిళలు కార్పొరేటర్లుగా గెలిచారు. అంటే 58.86 శాతం స్థానాలు మహిళలవే. కార్పొరేషన్లలో 43 శాతం స్థానాలను మహిళలు దక్కించుకున్నారు. రిజర్వేషన్ ఉన్న స్థానాల్లో మాత్రమే కాకుండా, జనరల్ స్థానాల్లో కూడా మహిళలు గెలవడం రాజకీయ చైతన్యానికి సూచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళలు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపడానికి ఏయే అంశాలు పనిచేశాయి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. కాగా మహిళలు, పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత కోసం తీసుకున్న నిర్ణయాలే మహిళా ఓటర్లను కాంగ్రెస్ వైపు నడిపించాయని విశ్లేషకులు చెప్తున్నారు.

సంక్షేమ పథకాలు ప్రభావం చూపాయా?

మహిళల ఓటింగ్ ధోరణి మారడానికి ప్రధాన కారణాలపై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా పెట్టుకుని అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రభావం చూపాయా అనే ప్రశ్న ముందుకు వచ్చింది. మహిళల కోసం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం అత్యంత చర్చనీయాంశమైంది.

ఉచిత బస్సు ప్రయాణం

2023 డిసెంబర్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఒక్కో మహిళకు నెలకు సగటున ₹2,000 నుంచి ₹5,000 వరకు ఆదా అవుతోందని అంచనా. ఇది మహిళల రోజువారీ ఖర్చుపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. అర్హులైన పేద మహిళలకు రూ.500కే వంట గ్యాస్ అందిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. గృహ ఖర్చు తగ్గడం మహిళలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించింది.

ఇందిరా మహిళా శక్తి

డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం ద్వారా ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం కల్పించారు. ఐదేళ్లలో ₹1 లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్ల నిర్వహణ, ఆర్టీసీ బస్సుల లీజింగ్, స్కూల్ యూనిఫాంల తయారీ, క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇది ఉపాధి అవకాశాలను విస్తరించింది. ప్రమాద బీమా కింద రూ.10 లక్షలు, సాధారణ మరణానికి ₹2 లక్షల పరిహారం అందించడం కూడా భరోసాను పెంచింది. గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం గృహిణులపై కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించింది.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం వల్ల పేద కుటుంబాలకు ఉపశమనం లభించింది. గర్భిణీలు, బాలింతల ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.

కాంగ్రెస్‌కు లాభం ఎలా?

ఈ సంక్షేమ పథకాల ప్రత్యక్ష లబ్ధి మహిళల ఓటింగ్ తీరు ప్రభావితం చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావం చూపిన పథకాలు ఓటింగ్ సమయంలో కీలక పాత్ర పోషించాయని అంచనా. మహిళల భారీ విజయాలు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌కు బలం చేకూర్చాయి. అయితే ఈ ప్రభావం దీర్ఘకాలికమా లేదా తాత్కాలికమా అన్నది రాబోయే ఎన్నికల్లో స్పష్టమవుతుంది.

గ్రామీణ ఎన్నికల్లో ఇదే ధోరణి?

ఇప్పుడు దృష్టి ZPTC, MPTC ఎన్నికలపై ఉంది. గ్రామీణ మహిళలకూ ఇదే సంక్షేమ పథకాల లబ్ధి అందుతోంది. అందువల్ల అక్కడ కూడా ఇదే ఓటింగ్ ధోరణి కొనసాగుతుందా అన్నది పరిశీలనీయ అంశం. అయితే గ్రామీణ రాజకీయాల్లో స్థానిక అంశాలు, అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం కూడా కీలకం. కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.

2026 మున్సిపల్ ఎన్నికలు మహిళల రాజకీయ ప్రాధాన్యాన్ని స్పష్టంగా చూపించాయి. చైర్‌పర్సన్ నుంచి కార్పొరేటర్ వరకు మహిళల ప్రాబల్యం పెరిగింది. సంక్షేమ పథకాలు మహిళల ఓటింగ్ తీరు ప్రభావితం చేశాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Read More
Next Story