రేవంత్‌ను ఆవేశంలో అలా అనేశా: తలసాని
x

రేవంత్‌ను ఆవేశంలో అలా అనేశా: తలసాని

సికింద్రాబాద్ ప్రాంతంపై జరుగుతున్న పరిపాలనా మార్పులపై మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తలసాని.


సికింద్రాబాద్‌ను విభంజించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే ‘సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్యలకు దారితీశాయి. కాంగ్రెస్ శ్రేణులు ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, సీఎం రేవంత్‌కు బేషరతుగా క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రచ్చ ఉద్రిక్తం అవుతున్న క్రమంలో తన వ్యాఖ్యలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను అలా మాట్లాడి ఉండకూడదని అన్నారు. తన మాటలను ఉపసంహరించుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఏదో ఆవేశంలో అలా అనేశానని వివరణ ఇచ్చారు.

ఆవేశంలో దొర్లిన మాటలు

“ఆవేశంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు జారిపోతాయి. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని గౌరవించే వ్యక్తిని నేను. సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకోవడంలో నాకు ఎలాంటి సమస్య లేదు,” అని తలసాని అన్నారు.అయితే సికింద్రాబాద్ ప్రాంతంపై జరుగుతున్న పరిపాలనా మార్పులపై మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “సికింద్రాబాద్ మా భావోద్వేగం. ఇక్కడి ప్రాంతాలను ఒక్కొక్కటిగా మల్కాజ్‌గిరి పరిధిలో కలుపుతున్నారు. పదవిలో ఉన్నామని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలే తగిన సమాధానం చెబుతారు,” అంటూ హెచ్చరించారు.

ప్రస్తుతం గందరగోళ పరిస్థితి

గతంలో కేసీఆర్ ప్రభుత్వం శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసి పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసిందని గుర్తు చేసిన తలసాని, ప్రస్తుతం పరిస్థితి గందరగోళంగా మారిందన్నారు. “ఏ పోలీస్ స్టేషన్ ఏ జోన్‌కు చెందుతుందో స్పష్టత లేకుండా అయిపోయింది. సీఎం చెబుతున్న మాటలకు వాస్తవాలకు పొంతన లేదు. సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను మల్కాజ్‌గిరి జోన్‌లో కలిపిన విషయం నిజం కాదా?” అని ప్రశ్నించారు.

ఈ నెల 17న నిర్వహించనున్న శాంతి ర్యాలీకి అనుమతి కోరుతూ ఈ నెల 5న హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేస్తే, మల్కాజ్‌గిరి కమిషనర్ అనుమతి తీసుకోవాలని చెప్పారని వెల్లడించారు. సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కాజ్‌గిరి జోన్‌లోని బోయిన్‌పల్లి సర్కిల్‌లోకి చేర్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు. “మన అస్తిత్వం ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరిది. భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా ఇప్పుడే అడ్డుకోవాలి,” అంటూ పిలుపునిచ్చారు. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు నిర్వహించే శాంతి ర్యాలీలో అన్ని సంఘాలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

హైదరాబాద్‌ను ఎందుకు విభజించాలి?

హైదరాబాద్‌ను మూడు మున్సిపల్ కార్పొరేషన్‌లుగా విభజించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంలా కనిపించినా, అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రతిపాదన వెనుక పరిపాలనా అవసరాలు, నగర విస్తరణ, రాజకీయ లెక్కలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

సమర్థమైన పరిపాలన

గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరించడంతో ఒక్క కార్పొరేషన్ ద్వారా సేవల నిర్వహణ కష్టంగా మారింది. రోడ్లు, డ్రైనేజీ, చెత్త సేకరణ, బిల్డింగ్ అనుమతులు వంటి అంశాలపై అధికారులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మూడు కార్పొరేషన్‌లుగా విభజిస్తే ప్రజలకు సేవలు వేగంగా అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

పెరుగుతున్న నగర విస్తరణ

గత దశాబ్దంలో హైదరాబాద్ జనాభా గణనీయంగా పెరిగింది. ఐటీ కారిడార్, అవుటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కొత్త కాలనీలు వేగంగా ఏర్పడ్డాయి. ఈ స్థాయి నగరానికి ఒకే మున్సిపల్ వ్యవస్థ సరిపోదన్న అభిప్రాయం పాలక వర్గాల్లో బలపడింది.

రాజకీయ సమీకరణాలపై ప్రభావం

హైదరాబాద్ రాజకీయ మ్యాప్ ప్రాంతానుసారం భిన్నంగా ఉంది. మూడు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తే వార్డుల పునర్విభజన జరుగుతుంది. దీంతో ఎన్నికల సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కోణంలో కూడా ఈ నిర్ణయం కీలకంగా మారింది.

జాతీయ స్థాయి నమూనాల ప్రభావం

దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో పరిపాలనా వికేంద్రీకరణపై ఇప్పటికే చర్చ కొనసాగుతోంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో జోన్లుగా పాలన సాగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్‌ను కూడా మెట్రో పాలిటన్ మోడల్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది.

‘సడెన్ డెసిషన్’లా ఎందుకు అనిపించింది?

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ జోన్ మార్పులు, పరిపాలనా సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ, మున్సిపల్ సవరణలు ఒకేసారి ముందుకు రావడంతో ప్రజల్లో ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంలా అనిపించింది. అయితే అధికార వర్గాల ప్రకారం ఈ అంశంపై నెలలుగా చర్చలు సాగుతున్నాయి. నివేదికలు సిద్ధమైన తరువాతే ప్రతిపాదన ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్‌లుగా విభజించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పరిపాలన మెరుగుదల, నగర విస్తరణ అవసరం, రాజకీయ వ్యూహాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

Read More
Next Story