కాంగ్రెస్‌పై యుద్ధానికి జీవన్ సిద్ధం.. నెక్స్ట్ సీఎం కేసీఆరే అంటూ..!
x

కాంగ్రెస్‌పై యుద్ధానికి జీవన్ సిద్ధం.. నెక్స్ట్ సీఎం కేసీఆరే అంటూ..!

రేవంత్ ఒక అసమర్థ నాయకుడు, తెలంగాణ షాడో సీఎం చంద్రబాబేనంటూ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.


కాంగ్రెస్‌పై యుద్ధం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జీవన్ రెడ్డి చెప్పారు. అతి త్వరలో సమరశంఖం పూరిస్తానన్నారు. రేవంత్ పని అయిపోయిందని, తెలంగాణకు నెక్స్ట్ సీఎం కేసీఆరే అంటూ జోస్యం కూడా చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమయిందని, కాంగ్రెస్ అంటేనే ప్రజలు చీదరించుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ ప్రెసిడెంట్ కావాల్సిన వాడినని, దానిని జానారెడ్డి అడ్డుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలంగాణ సీఎం రేవంత్ కాదంటూ కూడా ఆయన ఘాటు వ్యాక్యలు చేశారు.

ప్రస్తుతం ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబే.. తెలంగాణకు షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ నడుచుకుంటున్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రేవంత్ తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌కు కాకుండా చంద్రబాబుకు పంపినప్పుడు తన గురుభక్తి బట్టబయలయిందని దుయ్యబట్టారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదని, ఇందులో మాస్టర్ మైండ్ రేవంత్ రెడ్డే అని అన్నారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడా ఎమ్మెల్యేను గెలిపించుకోలేని వ్యక్తి రేవంత్ అని, అతనిని ఇప్పుడు సీఎం సీటులో కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం అయ్యాక కూడా రేవంత్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. రేవంత్ సీఎంగా ఉన్నప్పుడే మహబూబ్‌నగర్‌లో వంశీ చంద్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకోలేకపోయిన అసమర్థ నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు జీవన్ రెడ్డి.

సంజయ్ ఒక టూల్ మాత్రమే..

తనను పార్టీ నుంచి బయటకు పంపడానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను రేవంత్.. ఒక టూల్‌గా వినియోగించుకున్నారని అన్నారు. తాను టీపీసీసీ ప్రెసిడెంట్ అవ్వాల్సి ఉందని, కానీ ఉపఎన్నిక విషయాన్ని ముందుపెట్టిన తనను అడ్డుకున్న కుట్రదారుల్లో జానారెడ్డి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ నుంచి ఇంకేం కావాలి?

‘‘నేను కేసీఆర్ దగ్గరకు వెళ్తే ఏమవుతుందో తెలుసా? అని చాలా మంది అంటున్నారు. ఏమవుతుంది. కడియంకు డిప్యూటీ సీఎం, తుమ్మలకు ఎమ్మెల్సీ, మంత్రి, కేకేను సెక్రటరీ జనరల్, ఆయన కూతురు మేయర్ చేశారు. అంతకుమించి ఏం కావాలి?’’ అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మళ్ళీ కేసీఆర్ కావాలన్న ఆశ ప్రజల్లో భారీగా ఉందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగానే కాంగ్రెస్‌పై సమరశంఖం పూరిస్తానని, ఎవరో వదిలితే వెళ్లే అస్త్రం జీవన్ కాదని, తనదైన అస్త్రాలను సంధించే లీడర్ అని ఆయన అన్నారు. ఏప్రిల్ 20న గులాబీ కండవా కప్పుకుంటానని స్పష్టం చేశారు. ఆ రోజున నిర్వహించే బహిరంగసభలో కేసీఆర్ కూడా మాట్లాడతారని చెప్పారు.

Read More
Next Story