
ఎల్లోమీడియా దాచితే దాగుతుందా ?
ఎల్లోమీడియా ఎందుకు అవస్తలు పడుతోందంటే డ్రగ్స్ కేసులో అరెస్టయిన వాళ్ళల్లో టీడీపీ ఎంపీ కూడా ఉన్నాడు కాబట్టే
ఫామ్ హౌస్ లో డ్రగ్స్ వ్యవహారం బయటపడిన దగ్గర నుండి ఎల్లోమీడియా నానా అవస్తలు పడుతోంది. పట్టుబడింది ఎవరో అయితే ఎల్లోమీడియా ఎందుకు అవస్తలు పడుతోందంటే డ్రగ్స్ కేసులో అరెస్టయిన వాళ్ళల్లో టీడీపీ ఎంపీ కూడా ఉన్నాడు కాబట్టే. శనివారం హైదరాబాద్ శివార్లలోని అనేక ఫామ్ హౌస్ లలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కూడా ఒకటి. ఈ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ రోహిత్ రెడ్డిది. శనివారం రాత్రి కొందరు ప్రముఖులు ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకోబోతున్నారు అన్నవిషయం ఈగల్ టీమ్ తో పాటు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ బృందానికి సమాచారం అందింది. వచ్చిన సమాచారం ఆధారంగా రెండు పోలీసు బృందాలు గట్టి నిఘా ఉంచాయి.
శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన పార్టీ రాత్రికి తారస్ధాయికి చేరుకున్నది. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పై రెండు బృందాలు ఒక్కసారిగా ఫామ్ హౌస్ పైన దాడిచేశాయి. పోలీసులు దాడిచేసినపుడు అక్కడ టేబుళ్ళపై డ్రగ్స్, మద్యం, బీరు బాటిళ్ళు కూడా కనబడ్డాయి. దాంతో మొత్తం అందరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళు మొత్తం 11మంది ఉన్నారని లెక్కతేలింది. వీరిలో బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, రాజస్ధాన్ లోని జైపూర్ మాజీ ఎంఎల్ఏ నమిత్ శర్మ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నమిత్ శర్మ ఏ పార్టీ తరపున గతంలో ఎంఎల్ఏ అయ్యారో ఇంకా బయటకు రాలేదు.
ఎప్పుడైతే పట్టుబడ్డవాళ్ళల్లో రోహిత్ తో పాటు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కూడా ఉన్నారన్న విషయం తెలిసిందో అప్పటినుండి ఎల్లోమీడియా దాదాపు సైలెంట్ అయిపోయింది. టీవీల్లో, సోషల్ మీడియాలో పట్టుబడిన వాళ్ళ వివరాలు అన్నీ కనబడుతున్నా ఎల్లోమీడియాలో మాత్రం పొడిపొడిగా కనబడుతోంది. నిజానికి ఇంతటి సంచలనమైన వార్తను పెద్దగా కవర్ చేయాల్సిన మీడియా ఏదో మొక్కుబడిగా మాత్రమే ఇస్తోంది. ఎల్లోమీడియాలో ఒకటైతే ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ ఇచ్చిన వివరాలను కూడా సరిగా ఇవ్వలేదు. పట్టుబడిన 11మందిలో ఎవరెవరికి పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని ఎస్పీ వివరించినా సదరు పత్రిక మాత్రం ‘ఆరుగురికి పాజిటివ్ వచ్చింది’ అని మాత్రమే రాసి ఊరుకుంది.
పట్టుబడిన వారు ఎంతమంది ? అందులో పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ఏమిటి ? ఎక్కడివారు ? వారిహోదా ఏమిటన్న వివరాలను పూర్తిగా గాలికొదిలేసింది. ఇక మరో పత్రిక అయితే పాజిటివ్ వచ్చిన వారి పేర్లను ఇచ్చినా ‘ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్’ అని మాత్రమే ఇచ్చింది. పుట్టా మహేష్ యాదవ్ అంటే ఏ నియోజకవర్గం ఎంపీ ? ఏ పార్టీ తరపున గెలిచాడు అన్న వివరాలు ఇవ్వటానికి మనసొప్పలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మెయిన్ మీడియాను సోషల్ మీడియా ఎప్పుడో మించిపోయింది. మీడియాలో కనబడని వార్తలు, వివరాలు, పుట్టుపూర్వోత్తరాలతోసహా సవివరంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. అలాంటపుడు తాము దాచిపెట్టినంత మాత్రాన జనాలకు డ్రగ్స్ తీసుకుంటు అరెస్టయ్యింది ఎవరు ? వారి పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో జనాలకు తెలీకుండానే ఉంటుందా ? అదే తమకు గిట్టని పార్టీ నేతలు దొరికుంటే ఎల్లోమీడియా ఈపాటికి ఎంత రచ్చచేసుండేదో అందరికీ తెలిసిందే.

