బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు డెడ్ లైన్ డిసైడ్ అయ్యిందా ?
x
BRS defection MLAs

బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు డెడ్ లైన్ డిసైడ్ అయ్యిందా ?

ఈ ఇద్దరిపైనా అనర్హత వేటు ఖాయమనే ప్రచారం అందరికీ తెలిసిందే


ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలకు సంబంధించి ఏడుగురి విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(T Assembly Speaker Gaddam Prasad kumar) ఇప్పటికే క్లారిటి ఇచ్చేశారు. ఏడుగురు ఎంఎల్ఏలు (BRS)బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు కారుపార్టీ ఎంఎల్ఏలు సరైన ఆధారాలను చూపటంలో విఫలమైనట్లుగా స్పీకర్ తేల్చేశారు. ఫిరాయించినట్లుగా ఆధారాలను చూపలేకపోయిన కారణంగా ఏడుగురు ఎంఎల్ఏలు తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ఎంఎల్ఏలే అని ప్రకటించారు. కాబట్టి ఇక సమస్యంతా మిగిలిన ముగ్గురు ఎంఎల్ఏలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ కుమార్ విషయంలోనే. అందుకనే ఈ ముగ్గురు ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

వీళ్ళలో టెన్షన్ ఎందుకంటే ఈముగ్గురి విషయంలో నిర్ణయంతీసుకునేందుకు సుప్రింకోర్టు శుక్రవారం విచారణ సందర్భంగా రెండువారాలు గడువిచ్చింది. రెండువారాల్లో స్పీకర్ ఏ కారణం వల్లయినా సరే నిర్ణయం తీసుకోలేకపోతే ఆ నిర్ణయమేదో తానే తీసుకుంటానని సుప్రింకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. విచారణ సందర్భంగా స్పీకర్ వైఖరిపైన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తంచేసింది. ఈరోజు విచారణను గమనిస్తే ఫిరాయింపుల విషయంలో సుప్రింకోర్టు సీరియస్ గానే ఉన్నట్లు అర్ధమవుతోంది.

విచారణకు హాజరవ్వాల్సిందిగా స్పీకర్ కార్యాలయం దానం, కడియంకు ఎన్నిసార్లు నోటీసులు జారీచేసినా ఉపయోగం కనబడలేదు. ప్రతిసారి ఏదో కారణంచెప్పి విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరారే కాని ఒక్కసారి కూడా విచారణ హాజరవ్వాలని అనుకోలేదు. కడియం, దానంపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు ఇక ఎక్కువ సమయంలేదని అర్ధమవుతోంది. ఎందుకంటే నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ కు సుప్రింకోర్టు ఇచ్చిన గడువు రెండువారాలు మాత్రమే. ఈ రెండువారాల్లోనే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే తీసుకున్నట్లు లేకపోతే లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సంజయ్ కుమార్ విషయంలో కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. స్పీకర్ విచారణకు సంజయ్ హాజరయ్యారు. అయినా సంజయ్ ను కూడా స్పీకర్ దానం, కడియంతో జతకట్టేశారు.

మానసికంగా సిద్ధంగా ఉన్నారా ?

రాజీనామా చేయటానికి కడియం, దానం సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని వేర్వేరు సందర్భాల్లో వాళ్ళే స్వయంగా మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు రాజీనామాలు చేస్తామన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. దానం మీడియాతో మాట్లాడుతు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వెంటనే రాజీనామా చేస్తానని దానం ప్రకటించారు. కడియం ఈ మాట చెప్పలేదు కాని తన నియోజకవర్గంలో ఎప్పుడు ఉపఎన్నిక జరిగినా పోటీచేసేది తానే, గెలిచేదీ తానే అని మాత్రం ప్రకటించారు. ఈ రెండు ప్రకటనలను బట్టి ఈ ఇద్దరు రాజీనామాలకు మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. మిగిలిన సంజయ్ విషయంలోనే అయోమయం కంటిన్యు అవుతోంది.

బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉంటూ కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసిన దానం, వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీచేసిన కడియం కావ్యను ప్రతిపాదిస్తు సంతకంచేసిన వారిలో శ్రీహరి కూడా ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరిపైనా అనర్హత వేటు ఖాయమనే ప్రచారం అందరికీ తెలిసిందే. మరి సంజయ్ విషయంలో స్పీకర్ ఏమి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయమే సస్పెన్సులో ఉండిపోయింది. అనర్హత వేటు వేసేముందు తామే రాజీనామాలు చేస్తే సరిపోతుందని దానం, కడియం అనుకుంటున్నారని పార్టీవర్గాల సమాచారం. మరి రెండువారాల్లోగా స్పీకర్ ఏమిచేస్తారు ? తర్వాత సుప్రింకోర్టు ఏమి చేయబోతోంది అన్నది చూడాలి.

Read More
Next Story