
ఇందిరమ్మ ఇళ్లు.. ఎప్పుడొస్తాయో...
ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు కాగితాలపై కాకుండా.. పేదల జీవితాల్లో ఎప్పుడు నిజమవుతాయి?
ఒక చిన్న ఇల్లు.. నాలుగు గోడలు.. తలదాచుకోవడానికి ఓ నీడ.. ఇదీ లక్షలాది పేద కుటుంబాల జీవితకాల స్వప్నం! సొంతింటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వాలు ఇచ్చే హామీలు కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. కానీ ఆ హామీలు ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం పరిస్థితి మారిపోతోంది.
ఇల్లు మంజూరైంది.. కానీ నిర్మాణం మొదలుపెట్టలేక కొందరు! పునాదులు వేసి డబ్బుల కోసం ఎదురుచూస్తున్న మరికొందరు! నిర్మాణం పూర్తయినా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న ఇంకొందరు! తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుల పరిస్థితి ఇదీ!తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రెండు దశల్లో మొత్తం 7 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ప్రభుత్వ లక్ష్యాలు భారీగా ఉన్నప్పటికీ, నిర్మాణాల పురోగతి మాత్రం ఆశించిన స్థాయిలో ఉందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
2026 అక్టోబర్ చివర్లో RTI ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,96,220 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 83,563 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. అంటే నిర్మాణం పూర్తయినవి, వివిధ దశల్లో కొనసాగుతున్నవి కలిపి 2,79,783 ఇళ్లు మాత్రమే. ప్రభుత్వం నిర్దేశించుకున్న 7 లక్షల ఇళ్ల లక్ష్యంతో పోలిస్తే ఈ పురోగతి ఎంతవరకు సరిపోతుంది?
RTI సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 2,49,460 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మొత్తం రూ.7,559.27 కోట్ల ఆర్థిక సాయం విడుదల చేసింది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారుడికి సగటున సుమారు రూ.3.03 లక్షలు అందినట్లు తెలుస్తోంది.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఇల్లు మంజూరైన ప్రతి కుటుంబం నిర్మాణం ప్రారంభించే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం విడతలవారీగా విడుదలవుతోంది.
ఒక విడత డబ్బులు అందితేనే తదుపరి పనులు చేపట్టాల్సిన పరిస్థితి. కానీ నిర్మాణం ఒకసారి మొదలుపెట్టాక మధ్యలో ఆగిపోతే కుటుంబాలకు ఆర్థిక భారం మరింత పెరుగుతోంది.మరోవైపు సిమెంట్, ఇసుక, ఇనుము, ఇటుకలు, కూలీల ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం అందించే సాయం ప్రస్తుత నిర్మాణ వ్యయానికి సరిపోకపోవడంతో లబ్ధిదారులు సొంతంగా అప్పులు చేయాల్సి వస్తోంది.
దీంతో మూడు రకాల సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
1. ఇల్లు మంజూరైనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణం ప్రారంభించలేని కుటుంబాలు.
2. పునాదులు వేసి, గోడలు నిర్మించి, తదుపరి విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు.
3. నిర్మాణం పూర్తిచేసినా ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల కోసం నిరీక్షిస్తున్న కుటుంబాలు.వీళ్లందరి సమస్య ఒక్కటే.. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎప్పుడు పూర్తిస్థాయిలో అమలవుతుంది? తమ సొంతింటి కల ఎప్పుడు నిజమవుతుంది?
ఇదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని గుర్తుచేసుకుంటే, అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 2.92 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అందులో 1.11 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వాటిని లబ్ధిదారులకు కేటాయించారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో అర్హులైన పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఇప్పుడు ప్రభుత్వం మారింది. పథకం పేరు మారింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయి.కానీ పేదల సమస్య మాత్రం పూర్తిగా పరిష్కారం కాలేదు.ఈ నేపథ్యంలో కొన్ని కీలక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. 80.54 లక్షల దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తోంది? ఏడు లక్షల ఇళ్ల లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయగలదా? నిర్మాణం ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన ఇళ్లకు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు? పెరుగుతున్న నిర్మాణ వ్యయానికి అనుగుణంగా ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని పెంచే ఆలోచన ఉందా? నిర్మాణం పూర్తిచేసిన లబ్ధిదారులకు బకాయి బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు?
ఇవన్నీ కేవలం ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలనా ప్రశ్నలు మాత్రమే కాదు. లక్షలాది పేద కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు.ప్రభుత్వాలు మారుతున్నాయి.. ఎన్నికలు వస్తున్నాయి.. కొత్త పథకాలు ప్రకటిస్తున్నారు.. లక్షల ఇళ్ల నిర్మాణానికి లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు.
కానీ ఒక పేద కుటుంబానికి మాత్రం ఇల్లు అనేది కేవలం ప్రభుత్వ పథకం కాదు. అది జీవితకాలపు ఆశ. పిల్లల భవిష్యత్తుకు భరోసా. వర్షం వచ్చినా, ఎండ కాసినా భయపడకుండా బతకడానికి ఒక చిరునామా.డబుల్ బెడ్రూమ్ హామీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల హామీ వరకు.. పేర్లు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ పేదల సొంతింటి కల మాత్రం ఇంకా ఎదురుచూపుల్లోనే ఉంది. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు కాగితాలపై కాకుండా.. పేదల జీవితాల్లో ఎప్పుడు నిజమవుతాయి? ఇదే ఇప్పుడు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముందున్న ప్రశ్న!
