జనాల చెవిలో బీజేపీ ‘మ్యానిఫెస్టో’ పువ్వు పెట్టిందా ?
x
T BJP Manifesto for Municipal elections

జనాల చెవిలో బీజేపీ ‘మ్యానిఫెస్టో’ పువ్వు పెట్టిందా ?

లోకల్ ఎన్నికల్లో మ్యానిఫెస్టో రిలీజ్ చేయటంలో అర్ధమేలేదు


జనాలను రాజకీయ పార్టీలు పిచ్చోళ్ళని అనుకుంటున్నట్లున్నాయి. అందుకనే ఎన్నికల్లో తమ బుర్రకు తోచిన హామీలను మ్యానిఫెస్టోల రూపంలో విడుదల చేస్తుంటాయి. ఆచరణ సాధ్యంకాని హామీలను ఇచ్చేసి తమ మ్యానిఫెస్టోను తప్పకుండా అమలుచేస్తామని ఎన్నికల్లో ఊదరగొడుతాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు తిప్పేసిన పార్టీలను చాలానే చూశాము. ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేసి గెలిపించాలని కోరుతు పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఒక మ్యానిఫెస్టోని రిలీజ్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లోనో లేకపోతే పార్లమెంటు ఎన్నికల్లోనో పార్టీలు మ్యానిఫెస్టోని రిలీజ్ చేసినా అర్ధముంది. అంతేకాని లోకల్ ఎన్నికల్లో మ్యానిఫెస్టో రిలీజ్ చేయటంలో అర్ధమేలేదు. ఇపుడు విషయం ఏమిటంటే బీజేపీ మ్యానిఫెస్టోలో చాలా హామీలను గుప్పించింది. అందులో కొన్నింటిని పరిశీలిద్దాము. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇంటిపన్ను సహా ఎలాంటి పన్నుల పెంపు ఉండదట. ఆన్ లైన్, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వారం రోజుల్లోనే ఇంటికి అనుమతులు ఇచ్చేస్తారట. ప్రతి వార్డు లేదా డివిజన్లో బస్తీ దవాఖాలను ఏర్పాటుచేస్తారట. అర్హత కలిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను స్మార్ట్ సిటీలుగా ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పిస్తారట. ఇలాంటి హామీలు చాలానే ఉన్నాయి.

పైన చెప్పుకున్న కొన్ని హామీల గురించి మాట్లాడుకుందాము. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇంటిపన్నుతో సహా ఏ పన్ను పెంచరట. నిజానికి పన్నులు పెంచటం, తగ్గించటం అన్న విషయంలో ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి అధికారం ఉండదు. రాష్ట్రప్రభుత్వం పాలసీ నిర్ణయం ప్రకారమే పన్నులు తగ్గటం లేదా పెరగటం జరుగుతాయి. ప్రతి వార్డు లేదా డివిజన్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తారట. బస్తీ దవాఖానా అంటే చిన్నసైజు డిస్పెన్సరీ లేదా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అన్నమాట. డిస్పెన్సరీని ఏర్పాటుచేయాలంటే డాక్టర్లు, నర్సుల నియామకం జరగాలి. ఇవి జరగాలంటే ప్రభుత్వం అనుకుంటేనే సాధ్యమవుతుంది.

మున్సిపాలిటీలో బీజేపీ గెలిచినంత మాత్రాన ఏమవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు బీజేపీ ఏమీ చేయలేందు. అర్హత కలిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను స్మార్ట్ సిటీలు ఏర్పాటుచేయటానికి ప్రయత్నిస్తారట. ఎలాగ ప్రయత్నిస్తారంటే కేంద్రంతో మాట్లాడి ఒప్పిస్తారట. కేంద్రంతో మాట్లాడి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను స్మార్ట్ సిటీలు మార్పించే శక్తే ఉంటే ఆ పని ఇపుడే చేయచ్చు కదా ? జనాలు ఓట్లేసి 8 మంది ఎంపీలను బీజేపీ తరపున గెలిపించింది ఎందుకు ? 8మంది ఎంపీల్లో ఇద్దరు కేంద్రమంత్రులే కదా. వీళ్ళతో కలిసి మిగిలిన ఆరుగురు ఎంపీలు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, 8 మంది ఎంఎల్ఏలను వెంటపెట్టుకుని అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీలో నరేంద్రమోదీని కలిసి తెలంగాణలో స్మార్ట్ సిటీలను ఎందుకు ఎంపికచేయలేదు ?

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మున్సిపాలిటీలకు మ్యానిఫెస్టోలు రిలీజ్ చేసి హామీలను అమలుచేస్తామని రామచంద్రరావు చెబితే నమ్మే జనాలు ఎవరూ లేరు. ఏ మున్సిపాలిటీలో బీజేపీ గెలిచినా రాష్ట్రప్రభుత్వాన్ని కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఈ మ్యానిఫెస్టోలు, హామీలు అన్నీ వార్తలు రాసుకోవటానికి, కాసేపు మాట్లాడుకోవటానికి తప్ప ఎందుకూ పనికిరాదు.

Read More
Next Story