
జీవన్ రెడ్డికి డిమాండ్ పెరిగిపోతోందా ?
జీవన్ ను తమపార్టీలో చేర్చుకోవాలని ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మరోవైపు ప్రతిపక్ష బీజేపీ నేతలు పోటీపడుతున్నారు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి టీ జీవన్ రెడ్డికి డిమాండ్ బాగా పెరిగిపోతోంది. తమ పార్టీలో చేరాలంటే కాదు తమ పార్టీలో చేరాలని జీవన్ కు ఆఫర్లు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ ఆరుసార్లు ఎంఎల్ఏగా గెలిచి మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. ఒకసారి ఎంఎల్సీగా కూడా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ అధికారంలోకి రావటంతో తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించారు. అయితే బీఆర్ఎస్ తరపున గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. అప్పటినుండి జీవన్ పరిస్ధితి పార్టీలో బాగా ఇబ్బందిగా తయారైంది. పార్టీ అధిష్ఠానం పట్టించుకోక, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి లెక్కచేయక, నియోజకవర్గంలో మాటచెల్లుబాటు కాకపోవటంతో జీవన్లో అసంతృప్తి పెరిగిపోయి చివరకు పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
జీవన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని, ఇదే విషయమై ఈనెల 25వ తేదీన ముహుర్తం పెట్టుకున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే ఇతర పార్టీల నుండి జీవన్ కు డిమాండ్ పెరిగిపోతోంది. జీవన్ ను తమపార్టీలో చేర్చుకోవాలని ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మరోవైపు ప్రతిపక్ష బీజేపీ నేతలు పోటీపడుతున్నారు. జీవన్ రెడ్డిని ఆహా..ఓహో అంటు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వస్తే భుజాలపైన ఎత్తుకుని తీస్కొస్తా అంటు బీఆర్ఎస్ కోరుట్ల ఎంఎల్ఏ కల్వకుంట్ల సంజయ్ మీడియాతోనే చెప్పారు. జీవన్ అవినీతి ఎరుగని సీనియర్ నాయకుడంటు సంజయ్ పొగిడారు. జీవన్ 30 ఏళ్ళ క్రితం ప్రజల కోసం ఏ విధంగా పనిచేశారో ఇపుడు కూడా అదేపద్దతిలో పనిచేస్తున్నట్లు కితాబిచ్చారు. జీవన్ అంటే తనకు ఎంతో అభిమానం, గౌరవమని చెప్పారు. పార్టీలోకి వస్తానంటే జీవన్ ను ఆనందంగా స్వాగతిస్తామని చెప్పారు.
నాయకత్వం అనుమతి ఉందా ?
జీవన్ గురించి మీడియా సమావేశంలోనే బీఆర్ఎస్ ఎంఎల్ఏ ఆహో..ఓహో అని ఆకాశానికి ఎత్తేశారంటే పార్టీ నాయకత్వం అనుమతి లేకుండా జరగదని అర్ధమవుతోంది. అలాగే జగిత్యాలలో పార్టీకి సరైన నేత లేడన్న విషయం కూడా తెలిసిపోతోంది. జీవన్ బీఆర్ఎస్ లో చేరేవిషయంలో ఇప్పటికే కేటీఆర్ తో మంతనాలు జరిగాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగానే కోరుట్ల ఎంఎల్ఏ సంజయ్ బహిరంగంగా మాట్లాడారని అనుకోవాలి.
ఇక, బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతు జీవన్ రెడ్డిని మానసికంగా హింసిచటం కాంగ్రెస్ కు తగదని హెచ్చరించారు. పార్టీలో జీవన్ చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు సానుభూతి చూపించారు. నిజానికి జీవన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ధర్మపురికి ఏమాత్రంలేదు. అయినా సానుభూతిగా మీడియాతోనే మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. జీవన్ ను బీజేపీలో చేర్చుకునే విషయమై ఎంపీ కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావుతో మాట్లాడుతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది.
జీవన్ గనుక పార్టీలో చేరితే జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ బలోపేతం అవుతుందని ధర్మపురి పార్టీ పెద్దలతో చెప్పినట్లు సమాచారం. భవిష్యత్తుపై సరైన భరోసా ఇస్తే జీవన్ తప్పకుండా బీజేపీలో చేరుతారని కూడా ధర్మపురి పార్టీ పెద్దలతో చెప్పినట్లుగా బీజేపీ వర్గాల సమాచారం. 25వ తేదీన జీవన్ మద్దతుదారులతో సమావేశం అవుతారా ? సమావేశంలో ఏమి నిర్ణయం తీసుకుంటారు ? ఆరోజు ఎలాంటి ప్రకటన చేస్తారు ? ఏపార్టీలో చేరబోతున్నారు అన్న విషయాలు ప్రస్తుతానికి సస్పెన్సుగా మారిపోయాయి. పార్టీల్లో చేర్చుకునే విషయంలో బీఆర్ఎస్, బీజేపీల ఆసక్తులు చూస్తుంటే రెండుపార్టీల్లోను జీవన్ రెడ్డికి డిమాండ్ బాగా పెరిగిపోతున్నట్లు అర్ధమవుతోంది.

