
జీవన్ రెడ్డిలో అసలు సమస్య ఇదేనా ?
జీవన్ వయసు సుమారు 75 ఏళ్ళు, మహాయితే 2029 అసెంబ్లీ ఎన్నికలవరకు యాక్టివ్ గా ఉండగలరంతే
జగిత్యాల నియోజకవర్గానికి చెందిన తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటంపై పార్టీలో మిశ్రమస్పందన వినబడుతోంది. ఎక్కువమంది తొందరపడి జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామాచేశారనే అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణాలు మూడున్నాయి. మూడు కారణాలను విశ్లేషిస్తే జీవన్ లోని అతిపెద్ద మైనస్ పాయింట్ ను అందరు ఏకీభవిస్తారు. ముందు కారణాలను చూస్తే నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని జీవన్ తెంచుకోకుండా ఉండాల్సింది. పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నా ఇంకా కంటిన్యు అవ్వాలా అని తాను ప్రశ్నించారు. జీవన్ ఎంఎల్ఏగా గెలిచిన ఆరుసార్లలో ఐదుసార్లు కాంగ్రెస్ తరపునే గెలిచారు. అలాగే రెండుసార్లు మంత్రిగా, ఒకసారి ఎంఎల్సీగా గెలిచిన విషయాన్ని జీవన్ మరచిపోయారు. రాజకీయాల్లో ప్లస్సులనే తప్ప మైనస్సులను ఎవరు పట్టించుకోరు. ఇందులో భాగంగానే జీవన్ కూడా పార్టీలో ఇపుడు అన్నీ మైనస్సులనే ప్రొజెక్టుచేస్తున్నారు.
రాజకీయాల్లో ఒక్కోసారి ఒక్కోరికి అవకాశం రావటం అన్నది చాలా సహజం. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకరిదే పైచేయిగా ఉండదు. జగిత్యాలలో జీవన్ హవా దాదాపు 43 సంవత్సరాలు సాగింది కదా. అప్పుడు పార్టీలోనే ఉన్న తన ప్రత్యర్ధులు తమకు అవకాశాలు రావటంలేదని ఎంతగా బాధపడుంటారు ? పార్టీలోని తన ప్రత్యర్ధుల గురించి జీవన్ ఎప్పుడైనా ఆలోచించారా ? తన హవా నడిచినంతకాలం ప్రత్యర్ధుల్లో ఎవరినీ లెక్కచేయలేదు కదా. అలాంటిది రెండేళ్ళు ఫిరాయింపు ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్ ధాటిని తట్టుకోలేక ఆవేశపడిపోయి నానారచ్చ చేసి చివరకు పార్టీకి రాజీనామా చేయటం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కతేంటో చూస్తానని శపథం చేయటం చాలా ఆశ్చర్యంగా ఉంది.
నియోజకవర్గంలో జీవన్ కాకపోతే మరో గట్టినేత ఎవరు అని ప్రశ్నించుకుంటే ఎవరు కనబడరు. ఎందుకు కనబడటంలేదంటే జీవన్ ద్వితీయశ్రేణి నేతల్లో ఎవరినీ ప్రోత్సహించలేదు కాబట్టే. తన మద్దతుదారుల్లో కూడా మున్సిపల్ కౌన్సిలర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధాయివరకే ప్రోత్సహించారు. ఎందుకంటే అన్నీ స్ధాయిల్లోను జీవనే పోటీచేయలేరు కాబట్టి కిందస్ధాయివరకు మద్దతుదారులను ఎదగనిచ్చారు.
అతిపెద్ద మైనస్ ఏమిటి ?
జీవన్లో అతిపెద్ద మైనస్ ఏమిటంటే వయసు. ఇపుడు జీవన్ వయసు సుమారు 75 ఏళ్ళు. మహాయితే 2029 అసెంబ్లీ ఎన్నికలవరకు యాక్టివ్ గా ఉండగలరంతే. మానసికంగా తాను యువకుడినే అని జీవన్ అనుకున్నా శారీరం సహకరించాలికదా. వయసు పెరిగేకొద్దీ శరీర పటుత్వం తగ్గిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇపుడు కాకపోయినా మరో నాలుగేళ్ళయిన తర్వాతైనా జీవన్ కు పార్టీ ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సిందే. ఆ పనిని రేవంత్ ఇపుడే చేశాడంతే. బీఆర్ఎస్ తరపున గెలిచిన సంజయ్ రాజకీయ పరిణామాల కారణంగా కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఫిరాయించేముందు రేవంత్ తో సంజయ్ అన్నీవిషయాలను అంటే జీవన్ వ్యవహారాన్ని కూడా మాట్లాడుకునే ఉంటాడు అనటంలో సందేహంలేదు. ఇపుడు సంజయ్ వయసు సుమారు 63 ఏళ్ళు. 60 ఏళ్ళంటే రాజకీయాల్లో నడివయసనే అనుకోవాలి. 75 ఏళ్ళ జీవన్ తో పోల్చితే 63 ఏళ్ళ సంజయ్ కుర్రవాడుకిందే లెక్క.
బీఆర్ఎస్ లో చేరితే..
జీవన్ బీఆర్ఎస్ లో చేరుతారని, లేదు లేదు బీజేపీలో చేరుతారనే ప్రచారం పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే పై రెండుపార్టీల్లో చేరాలని జీవన్ కు ఆఫర్లు వస్తున్నాయి. బీఆర్ఎస్ లో చేరితే ఏమవుతుంది అంటే రాబోయే ఎన్నికల్లో జగిత్యాలలో టికెట్ దక్కవచ్చు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ వెనకాల నిలబడాల్సిందే తప్ప యాక్టివ్ పార్ట్ తీసుకునేందుకు లేదు. స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం అసలు ఉండనే ఉండదు. జీవన్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో నుండి కొందరు నేతలు పొన్నాల లక్ష్మయ్య, సంభాని చంద్రశేఖర్, టీడీపీ నుండి ఎల్వీ రమణ, మండవ వెంకటేశ్వరరావు లాంటి అనేకమంది చేరారు. పార్టీలో చేరేముందు వీళ్ళందరికీ అమితమైన ప్రయారిటి ఇచ్చిన కారుబాసు పార్టీలో చేరిన తర్వాత దగ్గరకు కూడా ఎవరినీ రానీయలేదు. ఇపుడు పైన చెప్పుకున్న నేతల పరిస్ధితి ఏమిటో కూడా ఎవరికీ తెలీదు. కాబట్టి జీవన్ పరిస్ధితి కూడా దాదాపు అలాగే అవుతుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
బీజేపీలో చేరితే...
బీఆర్ఎస్ ను కాదని బీజేపీలో చేరితే ఏమవుతుంది ? ఏమవుతుంది ఏమీకాదు. ఎందుకంటే బీజేపీకి క్షేత్రస్ధాయిలో పెద్దగా బలంలేదు. బీజేపీకి చెప్పుకోదగ్గ బలంలేదు కాబట్టి జీవన్ బలమే పార్టీ బలమవుతుంది. పార్టీలో ఇపుడున్న ఎనిమిదిమంది ఎంపీల్లో ఇద్దరు బండి సంజయ్, జీ కిషన్ రెడ్డి కేంద్రమంత్రులు. మరో ఎనిమిదిమంది ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంఎల్సీలున్నారు. వీళ్ళలో వీళ్ళకే సఖ్యత లేదు కాబట్టి వీరిమధ్య సమన్వయలోపం స్పష్టంగా కనబడుతోంది. ఈ విషయమై ఒక భేటీలో స్వయంగా నరేంద్రమోదీనే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అనిపదేపదే చెప్పుకుంటున్న కమలంపార్టీ నేతలు అందుకు అవసరమైన కార్యచరణను మాత్రం రూపొందించలేకపోతున్నారు.
మొత్తంమీద అర్ధమవుతున్నది ఏమిటంటే 75 ఏళ్ళవయసులో జీవన్ పార్టీ మారి తప్పుచేశారన్న అభిప్రాయాలే పార్టీలో ఎక్కువగా వినబడుతున్నాయి. అధికారంలో ఇంకా మూడేళ్ళుండే కాంగ్రెస్ ను కాదని అర్జంటుగా పార్టీకి రాజీనామా చేయటంవల్ల జీవన్ సాధించబోయేది ఏమీ ఉండదనే మెజారిటి నేతలు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ తో ఏదో పద్దతిలో సర్దుబాటు చేసుకోవాల్సింది పోయి ఫిరాయింపు ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ అంశాన్ని బూతద్దంలో చూపించి జీవన్ తప్పుచేశారని కూడా అనుకుంటున్నారు.
‘‘గతంలో చంద్రబాబునాయుడు, కేసీఆర్ మీదే పోరాడాను ఇపుడు రేవంత్ తో కూడా పోరాడుతాను’’ అని జీవన్ హెచ్చరించటం పెద్ద జోక్ గా కొట్టిపారేస్తున్నారు. చంద్రబాబు, కేసీఆర్ మీద పోరాటం చేసినపుడు జీవన్ వయసెంత ? ఇపుడు వయస్సు ఎంత ? అని పార్టీలోని వారు ఎద్దేవాచేస్తున్నారు.
పునర్వ్యవస్ధీకరణ ప్రభావం
తొందరలోనే నియోజకవర్గాల పునర్వ్యవస్ధీకరణ జరగబోతోంది. అప్పుడు తెలంగాణలో 60 నియోజకవర్గాలు పెరుగుతాయి. ఇపుడున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 179కి పెరుగుతాయి. పెరగబోయే నియోజకవర్గాల్లో కచ్చితంగా జీవన్ కు అవకాశం ఉండేదే అనటంలో సందేహంలేదు. జగిత్యాల జిల్లాలో ఒకటో రెండో నియోజకవర్గాలు పెరుగుతాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇపుడు జీవన్ గనుక ఓపికగా ఉండుంటే పునర్వ్యవస్ధీకరణలో పెరగబోయే నియోజకవర్గాల్లో కచ్చితంగా అవకాశం వచ్చేదే అనటంలో సందేహంలేదు. జీవన్ అదృష్టం ఎలాగుందో తెలీదుకాని లాజికల్ గా మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం మాత్రం తొందరపాటు చర్యనే మెజారిటి నేతలు అభిప్రాయపడుతున్నారు.

