
మావో ఉద్యమం ముగిసినట్లేనా? కొత్త రూపు దాలుస్తుందా?
మావోయిస్టు ఉద్యమం భవిష్యత్ పై అనేక అనుమానాలు మిగిల్చిన దేవ్ జీ ఇంటర్వ్యూలు
మావోయిస్టు ఉద్యమం కేవలం భద్రతా చర్యల వల్ల మాత్రమే కాదు, సంస్థలోని వ్యూహపరమైన లోపాలు, అంతర్గత విభేదాలు, మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కూడా బలహీనపడింది. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ప్రధాన మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలను విశ్లేషిస్తే అనేక కొత్త కోణాలు తొంగిచూస్తున్నాయి.అయితే మావో ఉద్యమం పూర్తిగా ముగిసిందా? లేక కొత్త రూపంలోకి మారుతుందా? అన్నది రాబోయే కాలంలో భారత రాజకీయాలకు ఒక కీలక ప్రశ్నగా మారే అవకాశం ఉంది.
దేవ్ జీ ఇంటర్వ్యూలలో ప్రధానంగా ఈ అంశాలు ప్రస్తావించారు:
1.మావోయిస్టు పార్టీలో తీవ్ర అంతర్గత విభేదాలు
2.నాయకత్వంలో సమన్వయం లేకపోవడం
3.వ్యూహాత్మక నిర్ణయాలలో తప్పిదాలు
4.ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలపడటం
5. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఉద్యమం
6. ఆపరేషన్ కగార్ పూర్తిగా దళాలు,అగ్రనేతలను కంగారు పెట్టింది.ఊపిరి సలకకుండా చేసింది.
7. తమది లొంగుబాటు కాదు. పారిపోబోయి పట్టుబడ్డాం
ఈ అంశాలన్నీ కలిసి మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరిచాయని దేవ్ జీ మాటలలో స్పష్టమైంది.
లొంగుబాటు కాదు.. పరారీలో పట్టుబడ్డాం
మావోయిస్ట్ భావాలకు ప్రభావితమైన తరువాత దళంలో చేరిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ , 4 దశాబ్దాల పాటు మావోయిస్ట్ ఉద్యమంలో కొనసాగి, కార్యకర్త స్థాయి నుంచి అగ్రనేత ప్రస్థానానికి ఎదిగాడంటేనే ఉద్యమం దిశ, దశను అణువణువూ అవగతం చేసుకున్నారు.అందుకే దేవ్ జీ మాటలను తేలిగ్గా తీసిపారయ్యలేమన్నది ఆ ఉద్యమాన్ని నిశితంగా పరిశీలిస్తున్న పరిశీలకుల మాట కూడా. దేవ్ జీ ఒక మాటను మాత్రం స్పష్టంగా తెలిపాడు. తనది తనతోపాటు బైటికి వచ్చిన వారిది లొంగుబాటు కాదని, తలదాచుకోడానికి పారిపోతుంటే, పోలీసులకు దొరికి పోయామన్నారు. దానిని లొంగుబాటు గా చూపారని తేల్చిచెప్పారు.ఆయుధాలు కూడా అడవిలోనే వుంచి వచ్చామన్నారు.
మావోయిస్టు ఉద్యమం ఎందుకు బలహీనపడింది?
మావో మాజీ నేత దేవ్ జీ ఇంటర్వ్యూలో బయటపడ్డ నిజాలు ,ఆయన మాటలను విశ్లేషణ చేస్తే మావో ఉద్యమం పూర్తిగా నిర్వీర్యం దిశగా మారుతోందా అన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారతదేశంలో దశాబ్దాల పాటు కొనసాగిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు కీలక మలుపు దశలోకి వెళ్లిందనే అభిప్రాయం బలపడుతోంది. దేవ్ జీ ఇచ్చిన ఇంటర్వ్యూ ఉద్యమం లోపల ఉన్న విభేదాలు, వ్యూహపరమైన తప్పిదాలు, ప్రభుత్వ వ్యూహాల ప్రభావం వంటి అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది.దాదాపు 44 సంవత్సరాలు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న దేవ్ జీ, ఇటీవల ప్రధాన ప్రవాహంలోకి రావడం కూడా ఈ చర్చను మరింత వేగవంతం చేసింది.
అంతర్గత విభేదాలు – ఉద్యమానికి పెద్ద దెబ్బ
దేవ్ జీ ప్రకారం మావోయిస్టు పార్టీలో నాయకత్వ స్థాయిలోనే విభేదాలు తీవ్రంగా పెరిగాయి.
కొంతమంది నేతలు ఆయుధ పోరాటాన్ని కొనసాగించాలని భావిస్తే, మరికొందరు లొంగిపోవాలని సూచించారని ఆయన పేర్కొన్నారు.ఇలాంటి పరిస్థితి పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. ముఖ్యంగా కీలక నాయకత్వం ఒకే దిశలో లేకపోవడం వల్ల కేడర్‌లో అయోమయం ఏర్పడిందని ఆయన చెప్పారు .
నాయకత్వ సంక్షోభం
మావోయిస్టు ఉద్యమంలో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరైన బసవరాజు మరణం తర్వాత పార్టీకి స్పష్టమైన నాయకత్వం ఏర్పడలేదని దేవ్ జీ అన్నారు.
పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు సక్రమంగా జరగకపోవడం, కొత్త నాయకత్వం ఎంపికలో ఆలస్యం వంటి అంశాలు ఉద్యమాన్ని మరింత బలహీనపరిచాయి. దేవ్ జీ కన్నా ముందు లొంగిపోయిన మల్లోజుల,ఆశన్న పార్టీని చీల్చారని కూడా దేవ్ జీ అభిప్రాయపడ్డారు. ఆయుధాలతో లొంగిపోవాలన్న నిర్ణయం అగ్రనాయకత్వం తీసుకోలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ప్రభావం మావోయిస్టు ఉద్యమం బలహీనపడడానికి మరో ముఖ్య కారణంగా దేవ్ జీ పేర్కొన్నారు.పార్టీలోకి “కోవర్ట్స్” చొరబడ్డారని, వారి ద్వారా ప్రభుత్వానికి సమాచారం చేరడంతో కీలక ఆపరేషన్లు చేశారని ,దీనివల్ల మావోయిస్టు నాయకత్వంపై దాడులు సులభమయ్యాయని భావిస్తున్నారు.నంబాల ఎన్కౌంటర్ విషయంలో జరిగింది ఆయన బాడీగార్డులు కోవర్టులుగా మారడమే కారణమని తేల్చేశారు. ఈ మాటలు విన్న తరువాత అసలు మావోయిస్ట్ రిక్రూట్మెంట్ తీరుపైనే సందేహాలు కలుగుతున్నాయి. మావో భావజాలం, సిద్దాంతాలతో సంబంధంలేకుండా దళాలలో చేర్చుకోవడం చర్చనీయాంశమైంది.
మారుతున్న సమాజాన్ని మావో అగ్ర నాయకత్వం అర్థం చేసుకోలేకపోవడం దేవ్ జీ చేసిన ముఖ్యమైన వ్యాఖ్యల్లో ఒకటి .పార్టీ గ్రామీణ ప్రాంతాల్లోనే బలంగా ఉన్నప్పటికీ, నగర ప్రాంతాల్లో పెరుగుతున్న సామాజిక మార్పులను పార్టీ పట్టించుకోలేకపోయిందని ఆయన అన్నారు.సమాజం, యువత ఆశలు మారుతున్నా, ఉద్యమం మాత్రం పాత వ్యూహాలతోనే కొనసాగుతోందన్నది ఎవరూ కాదనలేని పరిస్థితి.తుపాకీ గొట్టంతో ఏమీ సాధించలేమన్న భావం కూడా మావో కేడర్ లో పెరిగి పోయింది.
ప్రభుత్వ కౌంటర్ ఇన్‌సర్జెన్సీ వ్యూహాలు
చత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వం చేపట్టిన భారీ స్థాయి కౌంటర్ ఇన్‌సర్జెన్సీ ఆపరేషన్లు కూడా మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరిచాయని దేవ్ జీ చెప్పారు.దండకారణ్యంలో భారీగా భద్రతా బలగాలు మోహరించడం వల్ల మావోయిస్టుల కదలికలు కష్టమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను చేపట్టిన తరువాత మావో స్థావరాల లక్ష్యంగా జరుగుతున్న దాడులు శ్రేణుల్లో వణుకు పుట్టించాయి. బతికి వుంటే బలుసాకు తినొచ్చన్న రీతిలో స్థైర్యం కోల్పోయి, దళం నుంచి బయటకు వచ్చి లొంగిపోవడానికి సిద్దమవుతున్నారు. పోలీస్ ఎన్ కౌంటర్ లో హతమైన వారి సంఖ్య కూడా అధికంగా వుండగా, ఆయుధాలతో పాటు మావోలు సరెండర్ అవుతున్నారు. కేంద్ర పోలీస్ బలగాలు కూడా మావోయిస్ట్ ల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అడవుల నంతా జల్లెడ పట్టడమే కాకుండా , కీలకమైన మావో నేతలు ఎక్కడ తలదాచుకుంటున్న ఆరు, ఎక్కడ సమావేశం అవుతున్నారన్న సమాచారాన్ని పక్కాగా సేకరించి, గురి తప్పకుండా తమ లక్ష్యాలను ఛేధిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించినట్లు మార్చి చివరినాటికి మావోయిస్ట్ లందరినీ తుదముట్టించే దిశగా ఈ ప్రయాణం సాగుతోంది.మావో అగ్ర నేతలు లొంగుబాటు , క్యాడర్ లో తొంగి చూస్తున్న భయం కేంద్రం అనుకున్న లక్ష్యానికి చేరువ అయినట్లుగా నే కనిపిస్తోంది.ఒకప్పుడు “రెడ్ కారిడార్”గా పిలిచిన ప్రాంతాలు—ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఇప్పుడు క్రమంగా ప్రభుత్వ నియంత్రణలోకి వస్తున్నాయి.
మావోయిస్టులు రాజకీయ పార్టీగా మారే అవకాశం?
మావోయిస్టు మాజీ నేత దేవ్ జీ ఇచ్చిన ఇంటర్వ్యూల తరువాత మావోలు రాజకీయ పార్టీపై మరింత చర్చకు వచ్చింది. ఆయన చేసిన వ్యాఖ్యలు మావోయిస్టు ఉద్యమం భవిష్యత్తు, వ్యూహం, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశాలపై కొత్త కోణం చూపిస్తున్నాయి.
సాయుధ పోరాటం ప్రస్తుతం పూర్వంలా ప్రభావం చూపడం లేదన్న సంకేతాలు వచ్చాయి
గతంలో మావోయిస్టుల ప్రధాన వ్యూహం “ప్రజా యుద్ధం” (People’s War) కానీ గత దశాబ్దంలో భద్రతా బలగాల ఆపరేషన్లు పెరిగాయి.అటవీ ప్రాంతాల్లో వారి ప్రభావం తగ్గిందని అనేక విశ్లేషణలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వర్గాలు రాజకీయ మార్గాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు దేవ్ జీ మాటల్లో కనిపిస్తోంది. ప్రజా మద్దతు లేకుండా ఉద్యమం కొనసాగగలదా? అన్నది దేవ్ జీ చెప్పిన మరో పాయింట్ , ప్రజల మద్దతు లేకుండా మావోయిస్టు ఉద్యమం నిలవదు.
గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి.కానీ ప్రజలు హింసాత్మక మార్గం కంటే రాజకీయ పరిష్కారాలు కోరుకుంటున్నారనే అభిప్రాయం పెరుగుతోంది.
అందుకే కొందరు మావోయిస్టు వర్గాలు “మాస్ పాలిటిక్స్” వైపు చూడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
మావోయిస్టులు రాజకీయ పార్టీగా మారడం సాధ్యమేనా?ఇది సిద్ధాంతంగా అసాధ్యం కాదు. అయితే చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి.
నేపాల్‌లో మావోయిస్టులు సాయుధ పోరాటం తరువాత రాజకీయ పార్టీలుగా మారి ప్రభుత్వంలో కూడా భాగమయ్యారు.భారతదేశంలో కూడా గతంలో కొన్ని వామపక్ష తీవ్రవాద గ్రూపులు తర్వాత ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి వచ్చాయి.
అయితే కొన్ని ప్రధాన అడ్డంకులు వున్నాయి.ముందుగా సిద్ధాంత పరమైన మార్పు రావాలి.ఆయుధాల విరమణ జరగాలి.ప్రభుత్వంతో చర్చలు సాగాలి.నిషేధిత సంస్థ అనే చట్టపరమైన సమస్య వుంది కాబట్టి ప్రభుత్వం నిషేధం ఎత్తివేయాలి. అందుకే దేవ్ జీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఈ ప్రతిపాదన చేశారు. అయితే అది కేంద్ర ప్రభుత్వం పరిధి అంటూ రేవంత్ దానిని కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఉద్యమం బలహీనపడినప్పుడు సాధారణంగా రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఉద్యమం మరింత తీవ్రత చేయడం, లేక రాజకీయ మార్పు దిశగా సాగడం. అయితే ఇప్పుడు మొదటి ఆప్షన్ కష్టం కాబట్టి రెండో అవకాశం వైపు చూస్తున్నారు.
దేవ్ జీ వ్యాఖ్యలు కూడా రెండో మార్గం వైపు ఒక ఆలోచనా సంకేతం కావచ్చని కొందరు భావిస్తున్నారు.
వాస్తవంగా పార్టీగా మారాలంటే ఏమి జరగాలి?
మావోయిస్టులు రాజకీయ పార్టీగా మారాలంటే కొన్ని కీలక మార్పులు అవసరం.
సాయుధ పోరాటం పూర్తిగా విరమించాలి.భారత రాజ్యాంగాన్ని అంగీకరించాలి. నిషేధం తొలగించుకొని
ప్రజాస్వామ్య ఎన్నికల్లో పాల్గొనాలి.ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనదే.
ప్రస్తుతం కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో మావోయిస్టులను భద్రతా సమస్యగా చూస్తున్నారు .
కాబట్టి రాజకీయ పార్టీకీ మారాలంటే ముందు
శాంతి చర్చలు , ఆయుధాల అప్పగింత చట్టపరమైన ప్రక్రియ తప్పనిసరి.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు వెంటనే రాజకీయ పార్టీగా మారే అవకాశం తక్కువగా కనిపించినప్పటికీ, భవిష్యత్తులో ఉద్యమం దిశ మారితే సాయుధ పోరాటం నుంచి ప్రజాస్వామ్య రాజకీయాల వైపు మార్పు అసాధ్యం కాదు.

