కవిత ఇంతలా భయపడుతున్నారా ?
x
Kalvakuntla Kavitha

కవిత ఇంతలా భయపడుతున్నారా ?

సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వయితే ఒకదాన్నించి పోటీచేస్తాను అని మాట ఎందుకు మార్చారు ?


కల్వకుంట్ల కవిత భయపడినట్లున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయంలో కవిత బాగా సందిగ్దంలో ఉన్నట్లు అర్దమవుతోంది. తాజాగా మీడియాతో మాట్లాడుతు కవిత చేసిన ప్రకటనే ఆమెలోని భయానికి అద్దంపడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ‘‘సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయితే వాటిల్లో ఒకదాన్నించి పోటీచేస్తాను’’ అని ప్రకటించారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తమకు గొప్ప అవకాశంగా కవిత చెప్పారు. ఇదే కవిత ఆమధ్య మీడియాతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో సిద్ధిపేట, బోధన్ నుండి పోటీచేయబోతున్నట్లు ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. పైన చెప్పిన రెండు నియోజకవర్గాల్లో కూడా సిద్ధిపేటే తన మొదటి ఛాయిస్ అన్నారు.

ఎందుకంటే ఇపుడు సిద్ధిపేటలో బీఆర్ఎస్ కీలకనేత తన్నీరు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాను పార్టీలో నుండి బయటకు వచ్చేయటానికి కారకుల్లో హరీష్ కూడా కీలకమని కవిత బాగా మండుతున్నారు. అందుకనే వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో పోటీచేసి హరీష్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ప్రకటనయితే చేశారు కాని హరీష్ ను ఓడించటం అంతవీజీ కాదు. ఈ విషయం తెలిసి ప్రకటించారా లేకపోతే తెలీకుండానే ప్రకటించారో అర్ధంకావటంలేదు. అలాంటిది ఇపుడు సడెన్ గా సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వయితే ఒకదాన్నించి పోటీచేస్తాను అని మాట ఎందుకు మార్చారు ? మహిళలకు రిజర్వ్ కాకపోతే సిద్ధిపేట, గజ్వేలులో ఎందులో నుండి కూడా తాను పోటీచేయను అని చెప్పకనే చెప్పినట్లే లెక్క. మరింతోటి దానికి ‘‘సిద్ధిపేటలో పోటీచేస్తాను కాస్కో’’ అని సవాలు చేయటం ఎందుకు ? ఇపుడు వెనక్కు తగ్గటం ఎందుకు ?

కవిత తాజా ప్రకటనతో సిద్ధిపేటలో పోటీనుండి వెనక్కు తగ్గినట్లు అర్ధమవుతోంది. నిజంగానే సిద్ధిపేట మహిళలకు రిజర్వయినా కవిత గెలుపు అంత తేలికకాదు. ఎందుకంటే సిద్ధిపేటలో హరీష్ కాకపోతే తనభార్యను పోటీచేయించటానికే ఎక్కువ అవకాశాలున్నాయి. సిద్ధిపేటలో హరీష్ పోటీచేసినా ఒకటే తన భార్య పోటీచేసినా ఒకటే. సిద్దిపేటలో హరీష్‌కు అపారమైన జనాధరణ ఉందన్నది వాస్తవం. ఉపఎన్నికలతో కలిపి గడచిన ఏడుఎన్నికల్లో హరీష్ వరుసగా గెలుస్తునే ఉన్నారు. దీన్నిబట్టే హరీష్‌కు జనాల్లో ఎంతటి పట్టుందో అర్ధమవుతోంది. ఈ విషయం అర్ధమైన తర్వాతే కవిత మాట మార్చినట్లున్నారు.

ఇక, గజ్వేలు సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇపుడు గజ్వేలుకు ప్రాతినిధ్యం వహిస్తున్నది తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గడచిన మూడుఎన్నికల్లో కేసీఆర్ వరుసగా గెలుస్తున్నారు. అంతకుముందు సిద్ధిపేటలో ఏడుసార్లు గెలిచిన కేసీఆర్ గజ్వేలుకు మారి ఇక్కడ కూడా వరుసగా గెలుస్తున్నారు. ఈ నియోజకవర్గం మహిళలకు రిజర్వయితే ఇక్కడ పోటీచేయటానికి కవిత చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే మహిళలకు రిజర్వయితే కేసీఆర్ కు బదులుగా ఎవరు పోటీచేస్తారనే విషయం సస్పెన్సుగా మారింది. సిద్ధిపేటలో హరీష్ కు బదులు హరీష్ భార్య పోటీచేసే అవకాశాలున్నాయి అన్నట్లుగా గజ్వేలులో కేసీఆర్‌కు బదులు కేసీఆర్ భార్య పోటీచేస్తారా ? ఏమో కాలమే చెప్పాలి. ఉత్తగా నియోజకవర్గాన్ని కవితకు అయితే కేసీఆర్ వదిలిపెట్టరు. వీళ్ళసంగతి ఎలాగున్నా బరిలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు పోటీచేయటం ఖాయం కాబట్టి ఎవరి గెలుపు కూడా అంత తేలిక కాదు.

Read More
Next Story