
మంత్రి పొంగులేటి ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందా ?
మామిడితోటల్లో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను పెట్టుకుని ట్యాపింగ్ జరుగుతోందని మండిపోయారు
తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయా ? అంటే అవుననే అంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తన ఫోన్ ను ట్యాప్ చేసి ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన ఆడియోను బీఆర్ఎస్ నేతలు రిలీజ్ చేయటంపై తీవ్రంగా మండిపోయారు. తన ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. తన ఫోన్ ను ట్యాప్ చేసిందెవరు, ఎవరెవరి మామిడి తోటల్లో ఫోన్ ట్యాపింగ్ పరికరాలున్నాయనే విషయంపై ప్రభుత్వం దర్యాప్తు చేయించాలన్నారు. మామిడితోటల్లో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను పెట్టుకుని ట్యాపింగ్ జరుగుతోందని మండిపోయారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందురోజు మంత్రి పొంగులేటి మాట్లాడుతు తన ఫోన్ ట్యాపింగ్ జరగుతోందని చేసిన ప్రకటన పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే మంత్రి కొన్ని మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లకు ఇంచార్జిగా ఉన్నారు. తాను ఇంచార్జిగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గెలుచునేందుకు చాలా కష్టపడ్డారు. ఇందులో భాగంగానే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు చాలామందితో ఫోన్లో మాట్లాడారు. మంత్రి ఉద్యోగసంఘాల నేతలతో మాట్లాడిన మాటలను ఖమ్మం పట్టణానికి చెందిన బీఆర్ఎస్ ఎంఎల్సీ తాతా మధు మీడియా సమావేశం పెట్టి ఆడియో టేపును వినిపించారు. ఇదే విషయమై పొంగులేటి తర్వాత మీడియాతో మాట్లాడుతు తన ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే బీఆర్ఎస్ నేతలకు ఉద్యోగసంఘాల నేతలతో తాను మాట్లాడిన సంభాషణల ఆడియో ఎలా దొరికిందని నిలదీశారు.
బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చినా దొంగచాటుగా తమ ఫోన్లను ట్యాపింగ్ ద్వారా వింటోందని ఆరోపించారు. ఈ విషయమై తాను ప్రభుత్వానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు కూడా తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు చెందిన మామిడితోటల్లో ట్యాపింగ్ పరికరాలను పెట్టి టెలిఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్లు మంత్రి మండిపోయారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉద్యోగసంఘాల నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో టేప్ బయటకు వచ్చింది అన్నంత మాత్రాన టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా అనుకునేందుకు లేదు. చాలా స్మార్ట్ మొబైల్స్ లో ఆటోమేటిక్ రికార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఉన్న ఫోన్ కు ఎవరు మాట్లాడినా మొబైల్ ఉపయోగిస్తున్న వారి ప్రమేయంలేకుండానే మాటలన్నీ రికార్డయిపోతాయి. తర్వాతెప్పుడో ఆ ఆడియో ఫైల్స్ ను మొబైల్ యజమానులు డిలీట్ చేస్తుంటారు.
ఇపుడు పొంగులేటి ఆరోపించిన తన మాటలు కూడా అలాగే ఆటోమేటిక్ రికార్డర్ ఆప్షన్ ద్వారా ఎవరి మొబైల్ లోనే రికార్డయిపోయుంటాయి. ఆ నేత బహుశా బీఆర్ఎస్ మద్దతుదారుడు అయ్యుంటాడు. ఏదో సందర్భంలో సదరు ఉద్యోగ నేత బీఆర్ఎస్ నేతలకు ఈ ఆడియో ఫైల్ ను వినిపించి ఉండవచ్చు. ఆటోమేటిక్ రికార్డర్ ఆప్షన్లో రికార్డయిన మంత్రి మాటలకు టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధం ఉండాల్సిన అవసరంలేదు. ఆటోమేటిక్ రికార్డర్ లో రికార్డయిన సంభాషణలను బీఆర్ఎస్ నేతలు వినిపించారంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేయించారు అనే గ్యారెంటీ ఏమీలేదు. కాబట్టి మంత్రి ఈ విషయాన్ని చెక్ చేసుకున్నారో లేదో తెలీదు. ఆటోమేటిక్ రికార్డర్ ఆప్షన్లో రికార్డయిన మాటలు కాదు కచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారానే తమ మాటలను బీఆర్ఎస్ నేతలు విన్నారని మంత్రి నిరూపించగలిగితే అప్పుడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అంశమే అనటంలో సందేహంలేదు.

