హైదరాబాద్ కు మోదీ ‘ట్రయాంగిల్ బుల్లెట్ ట్రైన్ హబ్’ రిటర్న్ గిఫ్టేనా
x
Hyderabad as Bullet trains Hub in South India

హైదరాబాద్ కు మోదీ ‘ట్రయాంగిల్ బుల్లెట్ ట్రైన్ హబ్’ రిటర్న్ గిఫ్టేనా

రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, నేతలను నమ్ముకుంటే పార్టీ బలోపేతం అవదన్న అనుమానం మోదీకి వచ్చినట్లుంది


గతంలో ఎన్నడూ లేనట్లుగా బీజేపీకి తెలంగాణ ప్రజలు 19మంది ప్రజాప్రతినిధులను ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా ? ఈమధ్య బడ్జెట్ ను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఇదేసమయంలో రాబోయే ఎన్నికల్లోపు తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గట్టిగా డిసైడ్ అయినట్లున్నారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, నేతలను నమ్ముకుంటే పార్టీ బలోపేతం అవదన్న అనుమానం మోదీకి వచ్చినట్లుంది. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావటం ఎలాగ అని మోదీ ఆలోచించినట్లున్నారు. ఇందులోభాగంగానే కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న (Bullet Trains Hub)బుల్లెట్ రైళ్ళలో హైదరాబాద్(Hyderabad)కు కీలకమైన భాగస్వామ్యం కల్పించాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ను దక్షిణాది రాష్ట్రాలకు బుల్లెట్ ట్రైన్ హబ్ గా చేసి ఘనంగా(Return gift) రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు.

హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పూణే మధ్య భవిష్యత్తులో పరుగులు పెట్టించాలని అనుకుంటున్న బుల్లెట్ రైళ్ళకు హైదరాబాద్ లో సెంట్రల్ టెర్మినల్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. కేంద్రప్రభుత్వ నిర్ణయం సాకారం అయ్యేందుకు కాస్త సమయం పట్టినా ఆచరణలోకి రావటం మాత్రం కచ్చితమే. బుల్లెట్ రైళ్ళ వ్యవస్ధ గనుక ఆచరణలోకి వస్తే దేశ రవాణ రంగంలో విప్లవాత్మక మార్పులు రావటం తథ్యం. విప్లవాత్మక మార్పులు కూడా ఏ స్ధాయిలో వస్తుందంటే హైదరాబాద్ నుండి బెంగుళూరు, చెన్నై, పూణే నగరాలకు మ్యాగ్జిమమ్ ప్రయాణసమయం రెండున్నర గంటలకన్నా ఉండదు. ఇపుడు 10 నుండి 12 గంటలు పడుతున్న ప్రయాణసమయం రెండున్నర గంటలకు తగ్గిపోతుందటంటే ఇంతకన్నా విప్లవాత్మకమైన మార్పు ఏముంటుంది ?

రాజకీయంగా అవస్తలు

రాజకీయంగా ఎదగటానికి బీజేపీ నానా అవస్తలుపడుతున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుండి 8 మంది ఎంఎల్ఏలు గెలిచారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 8మంది ఎంపీలు గెలిచారు. వీరిలో ఇద్దరు బండి సంజయ్, జీ కిషన్ రెడ్డి కేంద్రమంత్రులుగా ఉన్నారు. పార్టీ తరపున 16 మంది ప్రజాప్రతినిధులున్నా జాతీయ నాయకత్వం ఆశించిన స్ధాయిలో పార్టీ ఎదగటంలేదు. తెలంగాణ చరిత్రలో బీజేపీకి 8 మంది ఎంఎల్ఏలు, 8మంది ఎంపీలు ఎప్పుడూ లేరు. వీరికి అదనంగా రాజ్యసభ ఎంపీగా డాక్టర్ లక్ష్మణ్, ముగ్గురు ఎంఎల్సీలు కూడా ఉన్నారు. ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ పార్టీలో ఎదుగుదల ఎందుకు కనబడటంలేదు అన్న విషయం మోదీ, అమిత్ షా కు పెద్ద పజిల్ గా తయారైంది.

ఆమధ్య జరిగిన పంచాయతీ ఎన్నికలు, ఈమధ్యనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. 12,752 పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులు గెలిచింది సుమారు 400 పంచాయతీల్లో మాత్రమే. అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 2996 వార్డుల్లో బీజేపీ గెలిచింది 261 వార్డులు మాత్రమే. పార్టీ ఈ పరిస్ధితుల్లో ఉండటానికి ప్రధాన కారణం ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల మధ్య అనైక్యతే. ఈ విషయం మోదీతో జరిగిన సమావేశంలో క్లారిటి వచ్చింది. ఇంతమంది ప్రజాప్రతినిధులుండి కూడా పార్టీ పనితీరు ఎందుకు ఆశించినట్లుగా లేదని స్వయంగా మోదీనే సమావేశంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. అందుకనే వీళ్ళని నమ్మకుంటే కష్టమని డైరెక్టుగా ప్రజలనే నమ్ముకుందామని మోదీ ఫిక్సయిన తర్వాతే దక్షిణాదిలో బుల్లెట్ రైళ్ళ టెర్మినల్స్ కు హైదరాబాద్ ను హబ్ గా చేస్తున్నట్లు ప్రకటించింది.

తొందరలోనే బీజం

దక్షిణ భారత దేశంలో ప్రత్యేకించి హైదరాబాద్ హబ్ గా రైల్వే శాఖలో విప్లవాత్మక మార్పులకు సమీప భవిష్యత్తులోనే బీజం పడబోతోంది. సౌత్ ఇండియాలో హైదరాబాద్ కేంద్రంగా రెండు మహానగరాలను కలుపుతు బుల్లెట్ రైళ్ళు పరుగులు పెట్టబోతున్నాయి. బుల్లెట్ రైళ్ళ వ్యవస్ధ గనుక సాకారమైతే దక్షిణభారత రవాణా వ్యవస్ధ కొత్తపుంతలు తొక్కటం ఖాయమనే అనిపిస్తోంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రస్తావించిన హైస్పీడ్ రైల్ ప్రణాళికల్లో హైదరాబాద్–చెన్నై–బెంగళూరు మధ్య “ట్రయాంగిల్ బుల్లెట్ ట్రైన్” కాన్సెప్ట్ ప్రధానంగా చర్చకు వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. బుల్లెట్ రైళ్లు ఏర్పాటు ఖాయమేననే సంకేతాలు ఉన్నప్పటికీ క్షేత్రస్ధాయిలో పనులు మొదలయ్యేందుకు సమయంపట్టే అవకాశముంది.

ట్రయాంగిల్ కాన్సెప్ట్ అంటే ఏమిటి?

హైదరాబాద్–చెన్నై–బెంగళూరు మధ్య ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రణాళికను ఒకే రూట్‌గా కాకుండా మూడు హైస్పీడ్ కారిడార్లుగా కేంద్రమంత్రి ప్రకటించారు. చెన్నై-బెంగళూరు, బెంగళూరు-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై మధ్య బుల్లెట్ రైళ్ళు ఊహకందనంత స్పీడులో పరుగులు పెడుతుంది. పైమూడు కారిడార్లు కలిసి దక్షిణ భారతదేశంలో ఒక ట్రయాంగిల్ ఆకారంగా ఏర్పడుతాయి. ఇందులో హైదరాబాద్ హబ్‌గా ఉంటుందని కేంద్రమంత్రి ప్రకటన ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.

హైదరాబాద్ హబ్ ఆలోచన

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో శంషాబాద్ ప్రాంతం హైస్పీడ్ రైల్ హబ్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం, భవిష్యత్ రవాణా విస్తరణకు అనుకూలంగా ఉండటంవల్ల ఈ ప్రాంతానికి ఎక్కడలేని ప్రాధాన్యం దక్కబోతోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు దగ్గరలోనే ఉన్న బహద్దూర్ పురలో 650 ఎకరాలను బుల్లెట్ ట్రైన్ టెర్మినళ్ళ కోసం రాష్ట్రప్రభుత్వం ఎంపికచేసింది. అయితే ఇది ఇప్పటికి ఇది ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. అధికారికంగా స్టేషన్ లొకేషన్లు ఖరారయ్యాయనే ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

చెన్నై–బెంగళూరు కారిడార్: ముందంజలో ఉన్న రూట్

ఈ ట్రయాంగిల్‌లో బాగా ముందంజలో ఉన్నది చెన్నై–బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్. సుమారు 300 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈమార్గంలో ప్రయాణ సమయం 1.12గంటల ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ కారిడార్‌కు సంబంధించి స్టేషన్ లొకేషన్లు, అండర్‌గ్రౌండ్ సెక్షన్లు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఈ ప్రాజెక్టుకు అమలు సంస్థగా వ్యవహరించే అవకాశం ఉంది.

బెంగళూరు–హైదరాబాద్ కారిడార్

బెంగళూరు నుంచి హైదరాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ ప్రయాణం 2గంటల్లోపే ఉంటుందని కేంద్రమంత్రి చెప్పారు. ఈ మార్గం ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాలకు కీలకంగా మారే అవకాశముంది. అయితే ఈ రూట్‌లో ఎన్ని స్టాపింగులు ఉంటాయి, ఏ నగరాలు కవర్ అవుతాయి అన్న వివరాలు ఫైనల్ కాలేదు. ప్రాథమిక సర్వేలు, అధ్యయనాలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్-బెంగుళూరు మధ్య బుల్లెట్ రైలు వస్తే వ్యాపారులు, ఉద్యోగులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. హైదరాబాద్ లో ఐటి ఉద్యోగులు సుమారు 10 లక్షలమంది ఉంటే బెంగుళూరులో 20 లక్షలమంది ఉండచ్చని అంచనా.

హైదరాబాద్-బెంగుళూరు మధ్య దూరం సుమారు 600 కిలోమీటర్లుంటుంది. రైలులో అయినా రోడ్డు మార్గంలో అయినా ప్రయాణసమయం సుమారుగా 11 గంటలుంటుంది. బుల్లెట్ రైలు ఏర్పాటైతే రెండు నగరాల మధ్య ప్రయాణం 2 గంటలే. టికెట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ఉద్యోగులు, వ్యాపారులు రెండు నగరాల మధ్య ఉదయం బయలుదేరి పనులన్నీ చూసుకుని సాయంత్రానికి తిరిగి తమ గమ్యస్ధానానికి చేరుకోవచ్చు. ఇలాంటి రౌండ్ ట్రిప్పులు ఉద్యోగులకన్నా వ్యాపారస్తులకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది.

హైదరాబాద్–చెన్నై కారిడార్

హైదరాబాద్–చెన్నై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ పొడవు సుమారు 700 కిలోమీటర్ల వరకు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ రూట్‌పై ఇప్పటివరకు వచ్చిన సమాచారం ఎక్కువగా ఫీజిబులిటీ స్టడీ స్థాయిలోనే పరిమితం అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమన్వయం, భూసేకరణ, పర్యావరణ అనుమతులు వంటి అంశాలు ఈ ప్రాజెక్టు పురోగతికి కీలకంగా మారనున్నాయి. పై మూడు రూట్లకు సంబంధించి ఇంకా డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ప్రారంభంకాలేదు.

డీపీఆర్ దశ ఎందుకు కీలకం?

ఏ ప్రాజెక్టు టేకప్ చేయాలన్నా ముందుగా డీపీఆర్ చాలా అవసరం. ఇందులో ప్రాజెక్టు ఆవశ్యకత, ప్రాజెక్టు పూర్తవ్వటానికి అయ్యే ఖర్చు, పట్టే సమయం, ఎన్ని సంవత్సరాల్లో నిర్మాణ వ్యయం వెనక్కువస్తుంది, ప్రాజెక్టు వల్ల ఎంతమందికి లబ్ది జరుగుతుంది లాంటి అనేక అంశాలుంటాయి. ఈ డీపీఆర్ ను బట్టే బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్ధలు అప్పలిస్తాయి. అందుకనే ఇపుడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు ముందుగా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) రెడీ అవ్వాల్సుంటుంది. డీపీఆర్‌లోనే ఖచ్చితమైన అలైన్‌మెంట్, స్టేషన్‌ల సంఖ్య, మధ్యలో ఆగే నగరాలు, ప్రాజెక్టు వ్యయం, నిధుల సమీకరణ విధానం, భూసేకరణ అవసరం లాంటి అంశాలుంటాయి.

ప్రతిపాదిత బుల్లెట్ రైళ్ళు ఇపుడు మెట్రో రైలు పరుగులు పెడుతున్నట్లుగా హై స్పీడు కారిడార్ పద్దతిలోనే ఏర్పాటు చేయబోతున్నారు. అంటే బుల్లెట్ రైళ్ళు భూమి మీద, పట్టాల పైన కాకుండా భూమికి సుమారుగా 50 లేదా 60 అడుగుల ఎత్తులో ప్రత్యేకమైన ట్రాక్ పైన పరుగులు తీస్తుంది. దీనివల్ల భూసేకరణ అవసరం ఉండదు. ఇపుడున్న పరిస్ధితుల్లో భూసేకరణ చేయాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం యజమానులకు మార్కెట్ ధరకు నాలుగు రెట్ల ధర చెల్లించి భూములు తీసుకోవాలి. ప్రతిపాదిత బుల్లెట్ రైల్ మార్గంలో భూసేకరణ చేయాలంటేనే వేలాది కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాల్సుంటుంది. అదే భూమిపైన ఎత్తులో పిల్లర్లు వేసి రైల్ ట్రాకులు వేస్తే భూసమీకరణ అవసరం ఉండదు, ఫలితంగా పరిహారంగా వేలాది కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరమూ ఉండదు.

కేంద్రం చొరవ తప్పదు

హైదరాబాద్‌ను హబ్‌గా మార్చే హైస్పీడ్ రైల్ ప్రణాళిక తెలంగాణకు మాత్రమే కాదు, దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకం. బెంగళూరు–హైదరాబాద్–చెన్నై మధ్య వేగవంతమైన రైలు కనెక్టివిటీ ఐటీ, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రవాహాన్ని కొత్త దిశలో మళ్లించే అవకాశముంది. అదే సమయంలో రాష్ట్రాల మధ్య సహకారం లేకుండా ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం కష్టం. ముఖ్యంగా తమిళనాడు-కర్నాటక, తెలంగాణ-ఏపీ మధ్య అనేక సమస్యలున్నాయి. ఈ సమస్యలను అధిగమించి బుల్లెట్ రైల్ ప్రణాళిక సాకారం కావాలంటే కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిందే తప్ప వేరేదారిలేదు.

ఎవరికి లాభం ?

పై మూడు నగరాల మధ్య బుల్లెట్ రైళ్ళు ఏర్పాటైతే ఎవరికి లాభం అనే ప్రశ్న తలెత్తటం సహజం. ఉద్యోగులు, వ్యాపారస్తులకు చాలా లాభమనే చెప్పాలి. హైదరాబాద్-చెన్నై మధ్య సుమారుగా 700 కిలోమీటర్ల దూరముంది. రోడ్డు మార్గంలో వెళితే సుమారుగా 13 గంటలు పడుతుంది. అదే రైలులో వెళితే కూడా దాదాపు 13 గంటలూ పడుతుంది. ఇపుడు నడుస్తున్న రైళ్ళ గరిష్ట వేగం గంటకు 90-120 కిలోమీటర్లు మాత్రమే. అదే బుల్లెట్ రైలు ఏర్పాటైతే దీని వేగం గంటకు 300 కిలోమీటర్లుంటుంది. మధ్యలోని స్టాపింగులను బట్టి ప్రయణ సమయం మారే అవకాశముంది. బుల్లెట్ రైళ్ళు ఏర్పాటైతే ఉద్యోగులు, వ్యాపారులు ఉదయం బయలుదేరి తిరిగి సాయంత్రానికి గమ్యస్ధానానికి చేరుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బుల్లెట్ రైలులో టికెట్ ధర కూడా అంతేగా ఉంటుంది.


హైదరాబాద్ కీలకమైపోతుంది : గూసికొండ

హైదరాబాద్ హబ్ గా బుల్లెట్ రైళ్ళ వ్యవస్ధ ఏర్పాటైతే దక్షిణాదిలో ఎంతో కీలకమైపోతుందని బెనారస్ హిందూ యూనివర్సిటిలో సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గోసికొండ శ్రీరాములు చెప్పారు. శ్రీరాములు తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ వ్యవస్ధకు హైదరాబాద్ ను హబ్ గా చేయటంవల్ల విప్లవాత్మక మార్పులు వస్తాయి’’ అని చెప్పారు. ‘‘రాజకీయంగా గతంలో ఎప్పుడూ లేనట్లుగా బీజేపీకి తెలంగాణ అత్యధిక ప్రజాప్రతినిధులను ఇచ్చింది కాబట్టి ప్రధానమంత్రి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారేమో’’ అని శ్రీరాములు అభిప్రాయపడ్డారు. ‘‘ఏదేమైనా బుల్లెట్ ట్రైన్ వ్యవస్ధ సాకారమైతే దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణకు బాగా ప్రాధాన్యత పెరిగిపోతుంది’’ అని చెప్పారు. ‘‘బుల్లెట్ రైళ్ళతో పాటు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భద్రాచలం, వేములవాడ, మేడారం తదితరాలను ఉత్తరాధి రాష్ట్రాల రైలుమార్గంలో కలపాలి’’ అని కేంద్రప్రభుత్వానికి సూచించారు. ‘‘పై పుణ్యక్షేత్రాలను ఉత్తరాధి రాష్ట్రాలతో రైలుమార్గంతో కలిపితే భక్తులు పెద్దసంఖ్యలో తెలంగాణకు వస్తారు’’ అని చెప్పారు. ‘‘దీంతో పాటు వారణాశికి తెలంగాణ నుండి డైరెక్ట్ ట్రైన్ వేయటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది’’ అని తెలిపారు.

మొత్తంగా చూస్తే హైదరాబాద్ హబ్‌గా ట్రయాంగిల్ బుల్లెట్ ట్రైన్ ప్రణాళిక దీర్ఘకాలిక దృష్టితో ఏర్పాటవుతున్న ప్రాజెక్టు. ప్రస్తుతం ఇది ప్రకటనలు, అధ్యయనాలు, డీపీఆర్ తయారీదశలోనే ఉంది. భవిష్యత్‌లో ఈ ప్రణాళిక అమలైతే దక్షిణ భారత దేశ రవాణా చరిత్రలోనే విప్లవాత్మకమైన మలుపుగా నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే విప్లవాత్మకమైన మలుపు ఎప్పుడు మొదలవుతుంది అన్నదే ఆసక్తిగా మారింది.


Read More
Next Story