
‘కోటా వితిన్ కోటా’ మహిళా రిజర్వేషన్లలో సాధ్యమేనా ?
ఓబీసీ మహిళలకు 33శాతంలో 50శాతం అంటే 16.5శాతం సబ్ కోటా ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.
కోటా వితిన్ కోటాకు తెలంగాణ బీసీ సంఘాల్లో డిమాండ్ పెరిగిపోతోంది. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లకు మద్దతుగా మాట్లాడుతునే ఓబీసీ మహిళలకు 33శాతంలో 50శాతం అంటే 16.5శాతం సబ్ కోటా ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. మహిళల్లో ఓబీసీలకు 16.5 శాతం రిజర్వేషన్లు కేటాయించకపోతే అగ్రవర్ణాల మహిళలతో ఓబీసీ మహిళలు పోటీపడలేరని బీసీ సంఘాల నేతలంటున్నారు. తెలంగాణలోని వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కోటా వితిన్ కోటా పై మాట్లాడి మహిళా రిజర్వేషన్ బిల్లులో సవరణలు చేయించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్లు చేస్తున్నారు.
మహిళారిజర్వేషన్ల బిల్లుపై ఈనెల 16,17,18 తేదీల్లో పార్లమెంటులో ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తోంది. బిల్లు తయారుచేసి, పార్లమెంటులో ప్రవేశపెట్టడానికే దశాబ్దాలు పట్టింది. అలాంటిది 33శాతం మహిళా రిజర్వేషన్లలోనే 16.5శాతం ఓబీసీ కోటాగా రిజర్వ్‌చేయాలనే డిమాండ్ సాకారమవుతుందా ? ఈమేరకు కేంద్రప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లులో సవరణలకు సానుకూలంగా స్పందిస్తుందా ? అనుమానమే. కోటా వితిన్ కోటా కోసం బీసీ సంఘాల నేతలు డిమాండ్లు ఎందుకు చేస్తున్నారు ? వాళ్ళు చెబుతున్న కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం. కోటా వితిన్ కోటా వల్ల బీసీల్లోని అణగారిన సామాజికవర్గాల మహిళలకు న్యాయం జరుగుతుందా ?
మహిళారిజర్వేషన్లు అమల్లోకివస్తే ఏరాష్ట్రంలో అయినా అసెంబ్లీ సీట్లసంఖ్యలో 33శాతం మహిళలకు కేటాయించాల్సిందే. ఈ33శాతం రిజర్వేషన్లకు ఇప్పటికే అమల్లోఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఏమాత్రం సంబంధంలేదు. అయితే ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కు ఏమిటంటే మహిళా రిజర్వేషన్లు అంటే నూరుశాతం రిజర్వేషన్లను అగ్రవర్ణాల్లోని బాగా డబ్బున్న మహిళలే సొంతం చేసుకుంటారు అనే అనుమానం పెరిగిపోతోంది. అందుకనే 33 శాతం మహిళారిజర్వేషన్ల సీట్లలో 50శాతం సీట్లను ఓబీసీలకు కేటాయిస్తే అచ్చంగా ఓబీసీ మహిళలు మాత్రమే పోటీచేయాల్సుంటుంది అని బీసీ నేతలంటున్నారు. అప్పుడు బీసీ మహిళలకు న్యాయం జరిగినట్లు అవుతుందని బీసీ సంఘాల నేతలంటున్నారు.
ఎన్ని సీట్లు పెరుగుతాయి
ఇపుడు రిజర్వేషన్లు లేకపోయినా వివిధ పార్టీల్లోని మహిళా నేతలు తమ కెపాసిటీ ఆధారంగా టికెట్లు సాధించుకుని పోటీచేస్తున్నారు. ఉదాహరణకు తెలంగాణనే తీసుకుంటే మొత్తం 119 సీట్లుంటే ఇపుడున్న మహిళ ప్రాతినిధ్యం 10 మంది మాత్రమే. అదే 33శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తే కచ్చితంగా 30సీట్లను మహిళలకు కేటాయించాల్సుంటుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సీట్ల సంఖ్య పెరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 119 సీట్లు కాస్త 179కి పెరుగుతుంది అంటే 60 సీట్లు పెరుగుతాయి. ఈ పెరిగే 60 సీట్లు కూడా అప్పుడు మహిళలకే కేటాయించాల్సుంటంది. దీనిప్రకారం 60సీట్లలో సగం అంటే 30సీట్లను ఓబీసీలకు కేటాయించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. బీసీ నేతల డిమాండ్ ప్రకారం 30 సీట్లు ఓబీసీలకే కేటాయిస్తే అప్పుడు ఏ పార్టీ తరపున ఎవరు పోటీచేసినా బీసీ మహిళలే అయ్యుంటారు.
అయితే ఇక్కడ మరో చిక్కు సమస్య ఎదురవుతుంది. అదేమిటంటే ఓబీసీ మహిళలనే పోటీలోకి దింపినా వారి ఆర్ధిక పరిస్ధితి ఒకేలాగ ఎందుకుంటుంది ? బీసీల్లో బాగా డబ్బున్న నేతలులేరా ? బీసీలంటే సుమారు 140 కులాల సమాహారం. ఇప్పటికే రాజకీయ అవకాశాలపై బీసీల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. ఎలాగంటే, బీసీల్లో ముఖ్యంగా ముదిరాజ్, యాదవులు, గౌడ్లు, మున్నూరుకాపు, పద్మశాలి కులాలకు చెందిన నేతలే అన్నీ పదవులను అనుభవిస్తున్నారనే గోల ఇప్పటికే ఉంది. 140 కులాలకు అందాల్సిన ఫలాలను పైన చెప్పిన ఐదు ఉపకులాలే అనుభవిస్తున్నాయనే ఆరోపణలు గట్టిగానే వినబడుతున్నాయి.
అట్టడుగు వర్గాలకు దక్కుతాయా ?
బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నట్లుగా 33శాతం మహిళా రిజర్వేషన్లలో 50శాతం ఓబీసీలకు కేటాయించారని అనుకుందాము. అప్పుడు పైనచెప్పిన ఐదు సామాజికవర్గాల్లోని మహిళా నేతలు కాకుండా పోటీచేసే అవకాశాలు మిగిలిన 135 కులాల్లోని మహిళలకు దక్కుతాయనే గ్యారెంటీ ఉందా ? 140 కులాల్లో అట్టడుగున ఉన్న చివరి 15 లేదా 20 ఉపకులాల మహిళలకు ఓట్లేసే అవకాశాలు తప్ప పోటీచేసే అవకాశాలు దొరుకుతాయని బీసీ నేతలు హామీ ఇవ్వగలరా ?
డబ్బులున్న నేతలు, డబ్బులు లేని నేతలనే తేడా ప్రతి సామాజికవర్గంలోను ఉంటుంది. ఒకళ్ళకు టికెట్ దక్కటం, దక్కకపోవటం అన్నది అనేక కారణాలు, సమీకరణల మీద ఆధారపడుంటుంది. టికెట్ దక్కించుకున్నంతమాత్రాన గెలిచేసినట్లు కాదు. టికెట్టు దక్కించుకోవటం ఎంతకష్టమో ప్రచారం చేసుకోవటం, ఎలక్షనీరింగ్, గెలవటం అంతే కష్టం. ఈనెల 16, 17, 18 తేదీల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం జరగబోయే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వివిధ పార్టీల నేతలు ఏమేమి చర్చిస్తారో చూడాల్సిందే.
రోస్టర్ పద్దతిలోనే అందరికీ న్యాయం : పర్వతం వెంకటేశ్వర్లు
‘‘కోటా వితిన్ కోటా వల్ల బీసీ మహిళా చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశాలు దక్కుతాయి’’ అని పర్వతం వెంకటేశ్వర్లు చెప్పారు. తెలంగాణ ఫెడరల్ తో ఈ విషయమై మాట్లాడుతు ‘‘కోటా వితిన్ కోటా లేకపోతే మొత్తం అగ్రవర్ణాల మహిళలే అవకాశాలు దక్కించుకుంటారు’’ అని అన్నారు. ‘‘మహిళలకు ఎక్కువ అవకాశాలు దక్కితే రాజకీయ అవినీతి తగ్గుతుంది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్నీపార్టీలు నూరుశాతం మద్దతివ్వాలి’’ అని కోరారు. ‘‘బీసీ మహిళల గురించి ఇపుడు ఏ పార్టీ లేదా ప్రభుత్వం సరిగా పట్టించుకోవటంలేదు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘ మహిళలు ఎక్కువమంది చట్టసభల్లోకి అడుగుపెట్టినపుడే మన సమాజంలో ఇపుడు మహిళలపైన ఉన్న చిన్నచూపు తగ్గుతుంది’’ అని అన్నారు. ‘‘రాజకీయాల్లో అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే పదవులు, ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలను రోస్టర్ పద్దతిలో అమలు చేయాల్సిందే’’ అని పర్వతం వెంకటేశ్వర్లు చెప్పారు.

