జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్నది ఏదయినా ఉందంటే అది కాంగ్రెసే అని ఆ పార్టీ నేతలు గొప్పులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ గ్రూపులు, వర్గాలు ఉండటం కనిపిస్తూనే ఉంటుంది.
తాజాగా బీహార్ లోనూ ఇలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ నానాటీకి క్షీణిస్తుందని రాజ్యసభ సభ్యురాలు రంజిత్ రంజన్ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీలో ఉన్న లుకలుకలు మరోసారి బయటపడ్డాయి.
వీటిని హైకమాండ్ ను కూడా కలవరపరిచాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది.
పార్టీ బలహీనతకు రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న వారే ప్రధాన కారణమని రాహుల్ అభిప్రాయపడినట్లు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర స్థాయి నాయకులదేనని.. ఆలస్యంగా విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకురాకపోవడం మంచిపద్ధతి కాదని రాహుల్ ఈ సందర్భంగా నాయకులను ఆదేశించారు. పార్టీని బీహార్ లో బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేయాలని సూచించారు.
బీహార్ నాయకులతో భేటీ
గత ఏడాది బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ కూటమి ఇక్కడ ఘన విజయం సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన వారు కూడా అధికార కూటమిలో చేరతారనే వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ శుక్రవారం (జనవరి 23) న్యూఢిల్లీలో బీహార్‌కు చెందిన పార్టీ నాయకత్వంతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ లోనే ఉంటాం..
ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఆయన నేరుగా బీహార్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారా? అని అడిగినట్లు సమాచారం. దీనికి వారంతా ‘‘కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం” అని స్పష్టంగా సమాధానమిచ్చారని పార్టీ అంతర్గత సమాచారం. అయితే శాసనసభ్యులు పార్టీ మారడం కేవలం మీడియా సృష్టేనని ఖర్గే తరువాత చెప్పారు.
అనుకున్న ఫలితాలు రాకపోవడమేనా? గత ఏడాది రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించారు. దీనికి బీహార్ లో భారీగా ప్రజా స్పందన లభించింది. అయిన స్పందన వచ్చినంత బలంగా ఫలితాలు మాత్రం రాలేదు. దీనితో పార్టీ నాయకత్వం తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్లు తెలిసింది. యాత్ర ప్రభావం ఫలితాల్లో కనిపించకపోవడం పార్టీ నేతలను ఆలోచనలో పడేసింది.
‘సర్’ వెనక కమలదళం?
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(S.I.R) పేరుతో బీహార్‌లో అనేక వేల మంది ఓటర్ల పేర్లను తొలగించడం వెనక కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఉందని కాంగ్రెస్ అప్పట్లో ఆరోపించింది.
ఎన్నికల కమిషన్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ అంశాలన్నీ ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయినట్లుగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చేసిన వాదనలు బీహార్ ప్రజలు తిరస్కరించారు. ఆ పార్టీ 50కి పైగా స్థానాల్లో పోటీ చేసిన మిత్రపక్షం సాయంతో కేవలం అరడజన్ సీట్లు మాత్రమే గెలుచుకుంది.
‘రాష్ట్ర నాయకత్వానిదే జవాబుదారీ..’
బీహార్‌లో పార్టీ క్షీణతకు అక్కడి నాయకత్వమే బాధ్యత వహించాలని రంజీత్ రంజన్‌కు హైకమాండ్ కు తెలియజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ కూడా 2015, 2020లో గెలిచిన తరువాత ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నుంచి ఈసారి ఓటమి పాలయ్యారు.
ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థ) కేసీ వేణుగోపాల్‌తో పాటు రాజేష్ రామ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను తెలుసుకునేందుకు ది ఫెడరల్ సంప్రదించగా.. రంజన్ స్పందించేందుకు నిరాకరించారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. రాజేష్ రామ్ కూడా ఫోన్‌కాల్స్‌కు స్పందించలేదని సమాచారం.
శాసన సభా పక్ష నేత ఎంపిక..
బీహార్ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) నాయకుడి ఎంపిక అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ పదవి చాలా కాలంగా ఖాళీగానే ఉంది. రాష్ట్ర నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. నిత్యం పార్టీ వర్గాలు కీచులాడుకుంటూ ఉండటంతో నాయకుడిని ఎన్నుకోవడం వాయిదా పడుతూ వస్తోంది.
ఈ అంశంపై తుది నిర్ణయం పూర్తిగా హైకమాండ్ చేతుల్లోనే ఉంటుందని, ఫిబ్రవరి 2న ప్రారంభం కానున్న బీహార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే CLP పేరును ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
‘వైఫల్యాలను ప్రశ్నించండి’
బీహార్‌లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలపై మరింత పోరాటాలకు సిద్ధం కావాలని హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు సమాచారం. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించింది. వెనుకబడిన, అణగారిన వర్గాలతో పాటు అగ్రవర్ణ కులాలను కూడా కలుపుకొని వెళ్లే రాజకీయ వ్యూహాన్ని అవలంబించాలని పార్టీ మేధావులు సూచించినట్లు తెలుస్తోంది.