
కాంగ్రెస్-బీఆర్ఎస్ ‘వాలంటైన్స్ డే’ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయా ?
కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య వాలంటైన్స్ డే వ్యవహారం నడుస్తోందని వ్యగ్యంగా అన్నారు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క మున్సిపాలిటీలో కూడా బీజేపీ గెలవలేదు. అలాగే ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే నాలుగు కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలిచింది. రెండు కార్పొరేషన్లు కరీంనగర్, నిజామాబాద్ లో శుక్రవారం కౌంటింగ్ ముగిసే సమయానికి బీజేపీకి అవకాశం ఉందని అనిపించింది. రెండు కార్పొరేషన్లలో గెలిచేసినట్లే అని బీజేపీ శ్రేణులు సంబరాలు కూడా చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నానానికి నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీకి అవకాశాలు తగ్గిపోయి కాంగ్రెస్ కు పెరిగాయి. దాంతో కరీంనగర్ కార్పొరేషన్ ను ఎలాగైనా కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కరీంనగర్ కార్పొరేషన్లో జెండా ఎగరేగటం బీజేపీకి అన్నా బండి సంజయ్ కు చాలా ముఖ్యం. ఎందుకంటే బండి కరీంనగర్ నుండి రెండోసారి ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్రమంత్రిగా ఉండి తన పార్లమెంటు హెడ్ క్వార్టర్స్ కార్పొరేషన్లోనే జెండా ఎగరేయలేకపోయారు అనంటే చాలా నామర్దా. అందుకనే మేయర్ కుర్చీలో బీజేపీ అభ్యర్ధిని కూర్చోబెట్టేందుకు బండి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్లో డివిజన్ల వివరాలు చూద్దాం.
కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లున్నాయి. ఇందులో కాంగ్రెస్ 14 చోట్ల గెలిచింది. బీజేపీ 30 డివిజన్లలో గెలవగా బీఆర్ఎస్ 9 చోట్ల గెలిచింది. మజ్లిస్ 3, ఫార్వార్డ్ బ్లాక్ 2, ఇతరులు 8 డివిజన్లలో గెలిచారు. ఏ పార్టీ అభ్యర్ధి మేయర్ గా కూర్చోవాలన్నా 34 మంది ఓట్లేయాల్సిందే. అంట 66 డివిజన్లలో సగం 33+ఒకటి అదనంగా గెలిచుండాలి. దాని ప్రకారం చూస్తే 34 డివిజన్ల మద్దతున్న పార్టీ అభ్యర్ధే మేయర్ అవుతారు. కాగితాల లెక్కల ప్రకారం చూస్తే 30 డివిజన్లలో గెలిచిన బీజేపీకే ఎక్కువ అవకాశముంది.
ఎలాగంటే కమలంపార్టీ నేతల ప్రకారం 8 చోట్ల గెలిచిన ఇతరుల్లో బీజేపీ తిరుగుబాటు అభ్యర్ధులు కూడా ఉన్నారట. కాబట్టి వారు కచ్చితంగా బీజేపీకే మద్దతుగా ఉంటారని అంచనా. ఇక కాంగ్రెస్ లెక్కచూస్తే కాంగ్రెస్ 14+బీఆర్ఎస్9+మజ్లిస్3+ఫార్వర్డ్ బ్లాక్ 2+ఇతరులు8= 36 కార్పొరేటర్ల బలం ఉందని అంచనా. అయితే ఇతరులు 8లో ఇప్పటికే ముగ్గురు బీజేపీకి మద్దతు పలికారన్న వార్తలు ప్రచారంలో ఉన్నది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవమో తెలీదు. ఈ నేపధ్యంలోనే బండితో పాటు బీజేపీ నేతలు మధ్యాహ్నం మీడియా సమావేశం పెట్టి బీజేపీ నుండి గనుక మేయర్ పీఠాన్ని లాగేసుకుంటే భూకంపం తప్పదన్నట్లుగా హెచ్చరించారు.
బీజేపీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, ఫార్వార్డ్ బ్లాక్ ఏకమైపోయినట్లు ఆరోపించారు. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. ప్రజలు తమకు ఓట్లేస్తే మధ్యలో హైజాక్ రాజకీయాలు చేసి కాంగ్రెస్ మేయర్ కుర్చీలోకూర్చోవాలని అనుకోవటం ఏమిటి ? అంటు నానా గోలచేశారు. అంటే బండి ఆరోపణలు, వార్నింగులు చూసిన తర్వాత కరీంనగర్ మేయర్ కుర్చీ చేజారిపోతుందనే భయం పెరిగిపోయిందా అనే అనామనాలు పెరిగిపోతున్నాయి. ఇతరుల్లోని 8 మంది కార్పొరేటర్ల కోసం ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ మంతనాలు మొదలుచేస్తున్నారని సమాచారం. మేయర్ ఎన్నిక జరిగేది 16వ తేదీ కాబట్టి ఈ రెండురోజుల్లో ఏమన్నా జరగచ్చు అన్న ఆలోచనే బండిలో టెన్షన్ పెంచేస్తున్నట్లుంది.
జనాలు బీజేపీకి మద్దతిచ్చి ఓట్లేసి గెలిపించారనే బండి వాదన కూడా తప్పే. ఎందుకంటే నిజంగా బీజేపీకే పట్టం కట్టుంటే జనాలు 66 డివిజన్లలో కనీసం 40 చోట్ల కమలంపార్టీ అభ్యర్ధులనే గెలిపించేవారు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటి మేయర్ కుర్చీకి అవసరమైన మెజారిటిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ 30 సీట్లతో ఆమడదూరంలోనే ఆగిపోయింది. అంటే జనాలు బీజేపీకి కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వలేదన్న విషయం తేలిపోయింది. కాబట్టి పోటీచేసిన అన్నీ పార్టీల్లో బీజేపీనే ఎక్కువ డివిజన్లలో గెలిచింది.
అధికారంలో ఉండటం కాంగ్రెస్ కు బాగా కలిసొచ్చే అంశం కాబట్టి ఫార్వార్డ్ బ్లాక్ కార్పొరేటర్లు ఇద్దరు, 8 మంది ఇతరుల్లో ఎక్కువమంది కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈ పరిస్ధితుల్లో కో ఆప్షన్ సభ్యుల ఓట్లే కీలకమవుతాయి. ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యులుగా తీసుకుంటారు. ఛైర్మన్, మేయర్ ఓటింగులో కోఆప్షన్ సభ్యులు కూడా ఓట్లేయచ్చు. ఈ లెక్కన చూస్తే బండి సంజయ్ తో పాటు ఒక ఎంఎల్సీ బీజేపీకి ఉంటారు. అలాగే కాంగ్రెస్,బీఆర్ఎస్, మజ్లిస్ కలవటం ఖాయమైతే కారుపార్టీకి చెందిన ఒక ఎంఎల్ఏ గంగుల కమలాకర్, ఇద్దరు ఎంఎల్సీలు ఎల్ రమణ, టీ. భానుప్రసాదరావు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ లో కూడా కో ఆప్షన్ మెంబర్లుండచ్చు. ఈ లెక్కన చూస్తే మేయర్ పీఠంలో ఎవరు కూర్చుంటారు అన్న విషయంలో కో ఆప్షన్ సభ్యుల ఓట్లే కీలకంగా మారే అవకాశాలున్నాయి.
ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత బండి పై మూడుపార్టీల మధ్య మండిపోతున్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య వాలంటైన్స్ డే వ్యవహారం నడుస్తోందని వ్యగ్యంగా అన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ కు వాలంటైన్స్ డే విషెస్ కూడా చెప్పేశారు. బండి ఆరోపణలు నిజమే అయితే ఉన్న ఒక్క ఆశకూడా బీజేపీకి దూరమైపోవటం ఖాయమేనా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకేనేమో బండిలో టెన్షన్ పెరిగిపోతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

