
రాహుల్ గాంధీ బహిష్కరణ తీర్మానం చెల్లుబాటు అవుతుందా?
నోటీసుపై రాజకీయ విశ్లేషకుల మాటేమిటి?
లోక్‌సభ ప్రతిపక్ష నేత ‘‘రాహుల్ గాంధీ’’ని దిగువ సభ నుంచి బహిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నిషికాంత్ దూబే సమర్పించిన “సబ్‌స్టాంటివ్ మోషన్” రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నోటీసు నిజంగా బలమైనదేనా? లేక కేవలం రాజకీయ మళ్లింపా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
నోటీసు ఇవ్వడానికి అసలు కారణమేంటి?
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం–రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని దేశ ప్రయోజనాలను అమ్మేశారని ప్రధాన మంత్రి ‘నరేంద్ర మోదీ’ పై ఫిబ్రవరి 11న రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేయడం లోక్‌సభలో ఉద్రిక్తతకు దారితీసింది.
ప్రివిలేజ్ మోషన్ నుంచి యూటర్న్..
మొదట రాహుల్‌పై “ప్రివిలేజ్ మోషన్” తీసుకురావాలని కేంద్రం సంకేతాలు ఇచ్చింది. అయితే తరువాత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశాల మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించబడటమే అందుకు కారణమని సమాచారం. అలాగే ప్రివిలేజెస్ కమిటీ ఇంకా ఏర్పాటుకాలేదన్న అంశం కూడా ప్రభుత్వ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
దూబే సబ్‌స్టాంటివ్ మోషన్..
ప్రివిలేజ్ మోషన్ విరమణ తర్వాత నిషికాంత్ దూబే “సబ్‌స్టాంటివ్ మోషన్”ను ప్రవేశపెట్టారు. ఇందులో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, జీవితకాల ఎన్నికల నిషేధం విధించాలని కోరారు. గతంలో పార్లమెంట్‌లో ఇలాంటి తీర్మానాల ద్వారా ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటనలున్నా.. అది చాలా అరుదైనవిగా పరిగణిస్తారు.
నోటీసులో లోపాలేనా?
దూబే నోటీసులో నిరూపణకు సాధ్యంకాని ఆరోపణలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ స్థానంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరును పొరపాటుగా ఉపయోగించడం విమర్శలకు దారితీశాయి. ఈ నోటీసు తిరస్కరణకు గురయ్యే అవకాశముందని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి పేర్కొన్నారు.
కాంగ్రెస్ రెస్పాన్స్..
కాంగ్రెస్ నేతలు ఈ చర్యను “రాజకీయ మళ్లింపు వ్యూహం”గా కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నోటీసుపై వ్యంగ్యంగా విమర్శించారు. NDA కూటమి వర్గాల్లో కూడా ఈ నోటీసు పట్ల అంతర్గత అసంతృప్తి ఉన్నట్లు సమాచారం.
నిపుణల మాటేంటి?
బడ్జెట్ సమావేశాలు విరామ దశకు చేరడంతో ఈ నోటీసుపై తక్షణం నిర్ణయం తీసుకునే అవకాశాలు తగ్గాయి. మార్చి తర్వాతే దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. నోటీసులోని లోపాలను సరిదిద్దకపోతే ఇది కేవలం రాజకీయ ప్రకటనగానే మిగిలిపోవచ్చని నిపుణుల అభిప్రాయం.
మొత్తంగా నిషికాంత్ దూబే సమర్పించిన తీర్మానం చట్టపరంగా బలంగా ఉందా? అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిజంగా బహిష్కరణకు దారితీసే చర్యగా మారుతుందా? లేక రాజకీయ మళ్లింపుగానే నిలిచిపోతుందా? అన్నది రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తేలనుంది.

