రేవంత్ మొదలుపెడుతున్నది ‘ఎన్నికల బ్రేక్ ఫాస్ట్’  కాదు కదా ?
x

రేవంత్ మొదలుపెడుతున్నది ‘ఎన్నికల బ్రేక్ ఫాస్ట్’ కాదు కదా ?

ఈ పథకంలో మొత్తం 22 లక్షల మంది పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ అందుతుంది


ప్రభుత్వాధినేతలు ఏమిచేసినా మైలేజ్ పొందటం తద్వారా ఎన్నికల్లో లబ్దిపొందే వ్యూహంతోనే చేస్తారని అందరికీ తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన ‘ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ పథకం’ కూడా ఇలాంటిదేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కూడా ఇదే పథకాన్ని ఎన్నికల ముందు ప్రకటించి అమలులో చేతులు దులిపేసుకున్నారు కాబట్టే. ఇపుడు రేవంత్ ప్రకటించిన పథకంపై ఎందుకు జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయంటే తొందరలోనే పరిషత్ ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండటమే. సాధారణ ఎన్నికలకు ఇంకా దాదాపు రెండున్నరేళ్ళున్నాయి. అయితే తొందరలోనే పరిషత్, మున్సిపల్ ఎన్నికలున్న కారణంగా లబ్దిపొందటానికే రేవంత్ ఈ పథకాన్ని ప్రకటించారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఈ పథకం వివరాలు చూస్తే వచ్చేవిద్యాసంవత్సరం ఆరంభం అంటే జూన్ 2వ తేదీనుండి అమల్లోకి వస్తుంది. ప్రీప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ పిల్లలవరకు బ్రేక్‌ఫాస్ట్‌ను అందించబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఆదివారం మినహా మిగిలిన ఆరురోజులు ఈపథకం అమలవుతుంది. ఆరురోజులు ఉదయం అల్పాహారంలోకి మిలెట్ ఇడ్లీలు, మెలెట్ చపాతీలు, మిల్లెట్లతో పూరీలు, దోసె, ఉప్మా, బోండా లాంటివి ఉంటాయి. స్కూలు పిల్లల బ్రేక్ ఫాస్ట్ కు రు. 540 కోట్లు, పాలకోసం రు. 180 కోట్లు, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్ధుల కోసం మరో రు. 56 కోట్లు మొత్తం రు. 780 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రు. 720 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం చూపించింది. ఈ పథకంలో మొత్తం 22 లక్షల మంది పిల్లలకు లబ్దిజరగబోతున్నది.

ఈ పథకం ఉద్దేశ్యం ఏమిటంటే పిల్లలను స్కూళ్ళకు రప్పించటమే. మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత స్కూళ్ళల్లో డ్రాపవుట్లు తగ్గినట్లు ప్రభుత్వం చెప్పింది. మధ్యాహ్న భోజనంలోకి కోడిగుడ్లు, పులుసు, రసం లాంటివాటితో పాటు కొత్తగా చేపలు కూడా అందించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇపుడు కొత్తగా బ్రేక్ ఫాస్ట్ పథకం కూడా తోడయ్యింది.

నిజానికి మధ్యాహ్నభోజనం పథకం అయినా, బ్రేక్‌ఫాస్ట్ పథకం అయినా పిల్లలను స్కూళ్ళకు రప్పించటం, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించటమే. ప్రభుత్వ స్కూళ్ళల్లో చదవుతున్న పిల్లలంటేనే చాలావరకు పేద పిల్లలనే అనుకోవాలి. పేద కుటుంబాల్లోని పిల్లలకు భోజనం పెట్టడం, అందులోను సరైన పోషకాహారాన్ని అందించి స్కూళ్ళకు పంపటం అంటే తల్లి, దండ్రులకు తలకుమించిన భారమే. అందుకనే ఎక్కువమంది తల్లి, దండ్రులు తమ పిల్లలను బడులకు కాకుండా పనుల్లోకి పంపుతుంటారు. చిన్నపిల్లలు స్కూళ్ళకు రాకుండా పనులకు వెళ్ళటాన్ని బాలలహక్కుల సంఘాలు, ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకున్నాయి. అందుకనే పిల్లలను స్కూళ్ళకు రప్పించాలంటే మధ్యాహ్న భోజన పథకం ఒకటే మార్గమని గత ప్రభుత్వాలు నిర్ణయించాయి. కేసీఆర్, రేవంత్ మరో అడుగు ముందుకేసి పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ కూడా అందించాలని నిర్ణయించారు.

కేసీఆర్ హయాంలోనే

బ్రేక్‌ఫాస్ట్ పథకం కేసీఆర్ హయాంలోనే మొదలైంది. అయితే 2023 ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని ప్రకటించటంతో ఎన్నికల సమయంలో పథకం అమలును కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దాని ఫలితంగా పథకం మూలనపడిపోయింది. అప్పటి పథకానికే రేవంత్ ప్రభుత్వం మెరుగులుదిద్ది పాతసీసాలో కొత్తసారా అన్నట్లు బ్రేక్ ఫాస్ట్ వెరైటీలు మార్చి, ఇంటర్మీడియట్ పిల్లలను కలుపుకుని పథకాన్ని ప్రకటించింది.

ఎన్నికల పథకమనే అనుమానాలు

రేవంత్ ప్రకటించిన బ్రేక్‌ఫాస్ట్ పథకం ఎన్నికల బ్రేక్‌ఫాస్ట్ పథకమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తొందరలోనే పరిషత్ ఎన్నికలు, గ్రేటర్ తో పాటు ఖమ్మ, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికలుండటమే. గ్రేటర్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికలను పక్కనపెడితే పరిషత్ ఎన్నికలు పూర్తిగా గ్రామీణ వాతావరణంలో జరిగేవే అని అందరికీ తెలిసిందే. 545జిల్లాపరిషత్తులు, 6500మండలపరిషత్తులకు ఎన్నికలు తొందరలోనే జరగబోతున్నాయి. ప్రభుత్వం ఇపుడు ప్రకటించిన బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలయ్యేది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్ళల్లోనే. ఎలాగంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోని 27 వేల స్కూళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిల్లో 22 వేలు మండల పరిషత్ స్కూళ్ళయితే 5 వేల జిల్లా పరిషత్ స్కూళ్ళు. ఈ స్కూళ్ళల్లో సుమారుగా 21 లక్షలమంది పిల్లలు చదువుకుంటున్నారు. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో సుమారు 450 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో సుమారు లక్షమంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. గురుకుల్, రెసిడెన్షియల్ స్కూళ్ళకు ఈ పథకంతో సంబంధంలేదు.

రేవంత్ ప్రభుత్వం విద్యార్ధులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మథ్యాహ్నం భోజనం అందిస్తున్నది అంటే దాని ప్రభావం పాజిటివ్ గా పిల్లల ఇళ్ళల్లో బాగానే కనబడుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లుంది. పిల్లలకు రెండుపూటల ఆహారం ప్రభుత్వం పెడుతోంది అంటే ఆ మేరకు తల్లి, దండ్రులపై ఆర్ధికభారం తగ్గినట్లే కదా. 22 లక్షలమంది పిల్లలు ప్రభుత్వ పథకం వల్ల లబ్దిపొందుతున్నారంటే వాళ్ళఇళ్ళల్లో సుమారు 45 లక్షలమందిలో ప్రభుత్వంపై పాజిటివ్ ఒపీనియన్ ఫామ్ అవుతుందనే అనుకోవాలి. 45లక్షలమంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండకపోయినా, పరిషత్ ఎన్నికల్లో నూరుశాతం ఓట్లేయకపోయినా అందులో సగంమంది ఓట్లేసినా చాలనే కోణం కూడా రేవంత్ ప్రభుత్వంలో ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.


ఎన్నికలు అయ్యేవరకే ఈపథకం ఉంటుందా లేకపోతే షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికలవరకూ కంటిన్యు అవుతుందా అన్నదే ఇపుడు సస్పెన్సుగా మారింది. అనుమానం ఎందుకంటే నిజంగానే పిల్లలకు మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్ పథకం అందించాలని చిత్తశుద్ది రేవంత్ లో ఉంటే ఇప్పటినుండే పథకాన్ని ఎందుకు అమల్లోకి తీసుకుని రాలేదు అనే చర్చ కూడా పెరిగిపోతోంది. ఇపుడు తెలంగాణలో ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. ఏప్రిల్ రెండోవారంతో పరీక్షలు అయిపోయి సెలవులు ఇచ్చేస్తారు. నెలన్నర తర్వాత అంటే జూన్ రెండోవారంలో స్కూళ్ళు తెరుస్తారు. అందుకనే జూన్ 2వ తేదీనుండి పథకాన్ని ప్రారంభించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికిప్పుడే పథకాన్ని ప్రారభించి స్కూళ్ళకు సెలవులిచ్చే వరకు అమలుచేసి లోటుపాట్లను తెలుసుకుని సెలవుల తర్వాత పక్కాగా పథకాన్ని అమలు చేయవచ్చుకదా అనే వాళ్ళుకూడా ఉన్నారు. ఏదేమైనా లక్షలాదిమంది పిల్లలకు వర్తించబోయే ఈ పథకాన్ని రేవంత్ ప్రభుత్వం సమర్ధవంతంగా అమలుచేస్తుందనే ఆశిద్దాం.

పిల్లలకు మంచి జరిగితే చాలు : చావా రవి

పథకాన్ని సక్రమంగా అమలుచేస్తే ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందనటంలో సందేహంలేదు అని తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్రఅధ్యక్షుడు చావారవి అన్నారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ఏ ప్రభుత్వమైనా పథకాల అమలువెనుక కచ్చితంగా మైలేజ్ ను ఆశిస్తుంది అనటంలో సందేహంలేదు’’ అన్నారు. ‘‘ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమైనా పిల్లలకు రెండుపూటలా మంచి టిఫిన్, భోజనం అందుతుంది అంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది’’ అని అడిగారు. ‘‘బ్రేక్ ఫాస్ట్ పథకం మొదలుపెట్టింది కేసీఆర్ అయినా అమలులో ఫెయిలైంది’’ అని గుర్తుచేశారు. ‘‘పథకం అమలుకు మండలానికి ఒక స్కూలును పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నా సరైన పర్యవేక్షణ లేకపోవటం, ఎన్నికలు రావటంతో పథకం అమలు మూతపడింది’’ అని చెప్పారు. ఆ పథకానికే రేవంత్ మెరుగులు దిద్ది అమలుచేస్తామని ప్రకటించటాన్ని రవి ఆహ్వానించారు.

Read More
Next Story