ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి సభ్యత్వం రద్దు ?
x
BRS MLA Padi Kaushik Reddy

ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి సభ్యత్వం రద్దు ?

నోటికొచ్చినట్లు ఊగిపోతు ఆరోపణలతో రెచ్చిపోవటం అవకాశం ఉంటే దాడిచేయటం పాడికి అలవాటుగా మారిపోయిందనే చెప్పాలి


బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డిపై సీరియస్ యాక్షన్ తీసుకోవటానికి అసెంబ్లీ వేదికగా రంగం సిద్ధమైనట్లే ఉంది. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడిన కాంగ్రెస్ సభ్యులంతా పాడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు చేసిన విజ్ఞప్తులను చేసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. భూకుంభకోణాలపై ఈరోజు సభలో వాడివేడి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూకుంభకోణాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. దాంతో రేవంత్ తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు మాట్లాడుతు బీఆర్ఎస్ సభ్యులపై ఎదురుదాడులకు దిగారు. తొమ్మిదిన్నరేళ్ళ అధికారంలో ఉన్నపుడు ధరణి పోర్టల్ పేరుతో లక్షలాది ఎకరాల కుంభకోణాలకు పాల్పడ్డారని తీవ్రంగా ప్రత్యారోపణలకు దిగారు.

ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన కడియంశ్రీహరి మాట్లాడుతు కేసీఆర్, కేటీఆర్ పై అనేక ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూకుంభకోణాలపై వాస్తవాలు బయటకు రావాలంటే హౌస్ కమిటి వేయాలన్న రేవంత్ సూచనను బలపరిచారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తదితరులపై కడియం ఆరోపణలు చేయటంతో బీఆర్ఎస్, హుజూరాబాద్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. సభలో చర్చ జరుగుతున్న అంశానికి పరిమితం కాకుండా డైరెక్టుగా కడియంపై ఆరోపణలతో రెచ్చిపోయారు. కడియంతో పాటు రేవంత్ ప్రభుత్వంపై ఆవేశంతో ఊగిపోతు నోటికొచ్చిన ఆరోపణలు చేశారు.

ఎప్పుడైతే కౌశిక్ రెచ్చిపోయారో వెంటనే సభలో గందరగోళం మొదలైంది. ఇక్కడ కౌశిక్ వ్యవహారశైలి గురించి కొద్దిగా మాట్లాడుకోవాలి. అదేమిటంటే పాడి ఏ విషయంలో అయినా సరే నోటికిపనిచెబుతాడు. ప్రత్యర్ధులను నోటకొచ్చినట్లు తిట్టేస్తాడు. కొన్నిసార్లు దాడిచేయటానికి కూడా వెనకాడడు. ఆమధ్య కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్ పై అందరిముందు దాడిచేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత మరో ఫిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ విషయంలో కూడా పాడి ఇలాగే వ్యవహరించటంతో రెండుమూడు రోజులు తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఈమధ్యనే బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ కు వెళ్ళినపుడు ఇన్సెపెక్టర్ పైన విరుచుకుపడిన విషయం గుర్తుండే ఉంటుంది. నోటికొచ్చినట్లు ఊగిపోతు ఆరోపణలతో రెచ్చిపోవటం అవకాశం ఉంటే దాడిచేయటం పాడికి అలవాటుగా మారిపోయిందనే చెప్పాలి.

పాడిని నియంత్రించాల్సిన కేటీఆర్, హరీష్ ఆపనిచేస్తున్నట్లు కనబడటంలేదు. అందుకనే పాడి రెచ్చిపోవటం వెనుక కేటీఆర్, హరీషే ఉన్నారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. తెరవెనుక ఉన్నది ఎవరైనా గ్రౌండ్ లో ఉండేది మాత్రం పాడి కాబట్టి అందరిలోను తన వ్యవహారశైలితో టార్గెట్ అయిపోతున్నాడు. ఇపుడు అసెంబ్లీలో కూడా కడియంను చూపిస్తు పాడిచేసిన ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అందుకనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ ఎంఎల్ఏలు ఆది శ్రీనివాస్, తదితరులు పాడి సభ్యత్వాన్ని రద్దుచేయాలని స్పీకర్ కు పదేపదే సూచిస్తున్నారు. గతంలో తమ సీట్లలో నుండి స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చారన్న కారణంగా కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ సభ్యత్వాన్ని అప్పటి స్పీకర్ రద్దుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో స్పీకర్ సభ్యత్వాలను రద్దుచేసినట్లుగానే ఇపుడు కౌశిక్ సభ్యత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. పాడి సభ్యత్వాన్ని రద్దుచేసే విషయమై సభలో చర్చించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అనే డిమాండ్ సభలో పెరిగిపోతోంది. చివరకు స్పీకర్ ఏమిచేస్తారో చూడాల్సిందే.

Read More
Next Story