ప్రభుత్వ-బీఆర్ఎస్ మధ్య వివాదం రేగుతున్న ‘కోహెడ’ నేపధ్యం ఇదేనా ?
x
Harish rao with Koheda fruit market farmers

ప్రభుత్వ-బీఆర్ఎస్ మధ్య వివాదం రేగుతున్న ‘కోహెడ’ నేపధ్యం ఇదేనా ?

ఇబ్రహింపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ‘కోహెడ’ పండ్ల మార్కెట్ కేంద్రంగా వివాదం పెరిగిపోతోంది


తెలంగాణలో ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య ప్రతిరోజు ఏదో ఒక వివాదం రేగుతునే ఉండాలి. లేకపోతే తెలంగాణకు దిష్టి తగులుతుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇపుడు విషయంఏమిటంటే ఇబ్రహింపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ‘కోహెడ’ పండ్ల మార్కెట్ కేంద్రంగా వివాదం పెరిగిపోతోంది. ఈ వివాదాన్ని లేవనెత్తింది బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావు. హరీష్ సోమవారం కోహెడకు వెళ్ళి రైతులతో మాట్లాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేశారు. ఆరోపణల్లో ముఖ్యమైనది ఏమిటంటే తమ హయాంలో అంటే బీఆర్ఎస్ హయాంలో కోహెడ్ పండ్ల మార్కెట్ కు కేటాయించిన 200 ఎకరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కదారి పట్టించేందుకు ప్లాన్ చేస్తున్నారట. తమ హయాంలో పండ్ల మార్కెట్ కు కేటాయించిన 200 ఎకరాలను ఇపుడు రేవంత్ తన మద్దతుదారులకు కేటాయించుకునేందుకు కుట్రలు చేస్తున్నారంటు తీవ్రస్ధాయిలో ఆరోపణలు గుప్పించారు.

కొత్తపేట, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో ఏర్పడిన విపరీతమైన రద్దీని తగ్గించేందుకే తమ ప్రభుత్వం కోహెడలో భారీ పండ్ల మార్కెట్ ను నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు హరీష్ అన్నారు. రైతుల నుండి సేకరించిన భూమిలో కొందరు రైతులకు నష్టపరిహారంగా రు. 10 కోట్లను చెల్లించినట్లు కూడా హరీష్ గుర్తుచేశారు. పండ్లమార్కెట్ ఏర్పాటును రు. 350 కోట్లతో టేకప్ చేయటంలో భాగంగా అవసరమైన డీపీఆర్ ను కూడా చేసినట్లు హరీష్ చెప్పారు. రైతుల కోసం తమ ప్రభుత్వం అంతచేస్తే అధికారంలోకి వచ్చిన రేవంత్ ఆభూములను తనమద్దతుదారులకు సొంతచేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపోయారు. 200 ఎకరాలను సొంతంచేసుకోవాలని అనుకుంటున్న రేవంత్ రైతులకు ప్రత్యామ్నాయంగా రైతులకు దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(దిల్)లోని వివాదాస్పద భూములను కేటాయించాలని ఆలోచిస్తున్నారని ఆరోపించారు.

దిల్ భూములపై ఇప్పటికే అనేక వివాదాలున్నాయని గుర్తుచేశారు. భూముల పంపకంపై తెలంగాణ-ఏపీ ప్రభుత్వం మధ్య వివాదాలే కాకుండా తెలంగాణ ప్రభుత్వంపై రైతులు కూడా అనేక కేసులు వేసినట్లు చెప్పారు. కాబట్టి ఇంత వివాదాస్పదమైన భూములను రైతులకు కేటాయించేసి చేతులు దులుపుకోవాలని రేవంత్ ప్రభుత్వం చూస్తోందన్నది హరీష్ ఆరోపణలు.

అయితే హరీష్ ఆరోపణలపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంతే ధీటుగా స్పందించారు. కోహెడ్ పండ్ల మార్కెట్ పై బీఆర్ఎస్ చేస్తున్నదంతా కేవలం దుష్ప్రచారం మాత్రమే అన్నారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్న హరీష్ రావు ప్రభుత్వంపై బురదచల్లేస్తున్నట్లు మండిపడ్డారు. కోహెడలో పండ్లమార్కెట్ కు ఉన్న 200 ఎకరాలను తీసుకోవాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. 2023లో రైతులకు బీఆర్ఎస్ హయాంలో 200 ఎకరాలను పండ్ల మార్కెట్ నిర్మాణానికి కేటాయించినట్లు హరీష్ చెప్పటం తప్పన్నారు. పండ్ల మార్కెట్ నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2011లోనే 178 ఎకరాలను కేటాయించిన విషయాన్ని తుమ్మల బయటపెట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళల్లో ఎలాంటి డెవలప్మెంట్ ఎందుకు చేయలేదని మంత్రి సూటిగా హరీష్ ను ప్రశ్నించారు. 2011లో కేటాయించిన 178 ఎకరాలకు అదనంగా 239 ఎకరాలను మార్కెటింగ్ శాఖకు కేటాయించాలని 2026, ఫిబ్రవరి 23వ తేదీన క్యాబినెట్ సమావేశం నిర్ణయించినట్లు తుమ్మల తెలిపారు.

అన్నీ సౌకర్యాలతో పండ్ల మార్కెట్ కట్టడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయంగా పండ్లను ఎగుమతులు చేయటానికి అవసరమైన అన్నీ సౌకర్యాలను నిర్మించేందుకు రేవంత్ ఆలోచిస్తున్నట్లు తుమ్మల తెలిపారు. కేవలం ప్రభుత్వంపై బురదచల్లేసి రైతులను రెచ్చగొట్టడమే పనిగా హరీష్, బీఆర్ఎస్ నేతలు కోహెడ్ మార్కెట్ లో రైతులతో మాట్లాడారని మంత్రి మండిపడ్డారు. ప్రభుత్వం ఆలోచిస్తున్నదానికన్నా ప్రతిపక్షాల దగ్గర మంచి ఆలోచనలుంటే ప్రభుత్వానికి పంపించాలని మంత్రి విజ్ఞప్తిచేశారు. అన్నీ సౌకర్యాలతో పండ్ల మార్కెట్ నిర్మించటం, అంతర్జాతీయస్ధాయిలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలన్నదే రేవంత్ ప్రభుత్వం ఆలోచనగా మంత్ర తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఈ మొత్తంమీద కోహెడ కేంద్రంగా రేగులున్న వివాదంలో ఎవరి వాదన నిజమో తెలుసుకోవాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Read More
Next Story