హేట్ స్పీచ్ బిల్లు ‘హిడెన్ అజెండా’ ఇదేనా ?
x
Revanth Reddy

హేట్ స్పీచ్ బిల్లు ‘హిడెన్ అజెండా’ ఇదేనా ?

బీఆర్ఎస్‌ను నియంత్రించటానికే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడురోజుల క్రితం అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లును ప్రవేశపెట్టింది. సభలో సుదీర్ఘ చర్చల తర్వాత సభ్యుల సూచనల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బిల్లును సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. సెలక్ట్ కమిటీని స్పీకర్ నియమించిన తర్వాత బిల్లును కమిటీ కూలంకుషంగా పరిశీలించి, వివిధ వర్గాలతో చర్చించి సూచనలు, సలహాలతో స్పీకర్ కు రిపోర్టును అందిస్తుంది. ఆ రిపోర్టును క్షుణ్ణంగా అధ్యయనంచేసిన స్పీకర్ తిరిగి బిల్లుతో పాటు రిపోర్టును ప్రభుత్వంకు పంపుతారు. సెలెక్ట్ కమిటి రిపోర్టుతో పాటు స్పీకర్ సూచనలను ప్రభుత్వం అధ్యయనంచేస్తుంది. ప్రభుత్వం అవసరం అనుకుంటే సూచనలను పరిగణలోకి తీసుకుని మార్పులు చేసి మళ్ళీ బిల్లును రెడీచేసి తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది.

ఈ ప్రక్రియనంతా పక్కనపెట్టేస్తే అసలు హేట్ స్పీచ్‌ను తీసుకుని రావాల్సిన అవసరం రేవంత్ ప్రభుత్వానికి ఏమొచ్చింది అన్నది కీలకమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే బీఆర్ఎస్‌ను నియంత్రించటానికే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే రేవంత్ ను వ్యక్తిగతంగానే కాకుండా ప్రభుత్వంపైన ప్రతిరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు పదేపదే టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా రేవంత్ ను పై ఇద్దరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాము రాజకీయ ప్రత్యర్ధులము అన్న విషయం మరచిపోయి రాజకీయ శతృవులం అన్న పద్దతిలో వ్యవహరించుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ ను బీఆర్ఎస్ క్యాంప్ ఏమాత్రం సహించలేకపోతున్నది వాస్తవం. అందులోను తమ ఆరోపణలకు అంతే ధీటుగానో లేకపోతే అంతకన్నా ఎక్కువగానో రేవంత్ సమాధానాలు చెబుతుండటాన్ని తట్టుకోలేకపోతోంది.

అందుకనే వ్యక్తిగతంగా రేవంత్ తో పాటు రేవంత్ ప్రభుత్వాన్ని తీవ్రస్ధాయిలో బీఆర్ఎస్ క్యాంప్ వ్యతిరేకిస్తోంది. ఉన్నవీ, లేనివి పోగేసి నోటికొచ్చిన ఆరోపణలతో రెచ్చిపోతోంది. తాము రేవంత్ తో పాటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటమే కాకుండా తమమీడియాతో పాటు తమ మద్దతున్న సోషల్ మీడియాతో కూడా అదే పద్దతిలో బురదచల్లించేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పారు. ఇందుకు రెండు ఉదాహరణలు చెప్పుకోవాలి.

మొదటిది ఏమిటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో 400 ఎకరాల భూ వివాదం. భూములు యూనివర్సిటి కాంపౌండులోనే ఉన్నప్పటికీ ఆ భూములన్నీ ప్రభుత్వానివే. ఆ భూములను తీసుకోవాలని ప్రభుత్వం అనుకుని ప్రయత్నాలు మొదలుపెట్టింది. వెంటనే బీఆర్ఎస్ యూనివర్సిటిలోని విద్యార్ధిసంఘాలను రెచ్చగొట్టింది. ప్రభుత్వ చర్యను నిరసిస్తు విద్యార్ధులు, అధ్యాపకుల్లో కొందరు ఏకమైపోయి పెద్దఎత్తున ఆందోళన మొదలుపెట్టారు. వీళ్ళు ఎప్పుడైతే ఆందోళన మొదలుపెట్టారో డైరెక్టుగా బీఆర్ఎస్ నేతలు ఎంటరైపోయారు. యూనివర్సిటి పరిధిలోని వందల ఎకరాల్లో అడవులను రేవంత్ ప్రభుత్వం ధ్వంసం చేసేస్తోందని, నగరానికి లంగ్ స్పేస్ గా ఉన్న అడవులను నాశనం చేస్తోందని, అడవుల్లో ఉంటున్న జింకలు, నెమళ్ళు, దుప్పులతో పాటు పక్షిజాతాలను నాశనం చేసేస్తోందని బీఆర్ఎస్ నానా గోలగోల చేసింది. కాంట్రాక్టర్ భూములను చదునుచేయటం వల్ల జేసీబీల కిందపడి జింకలు, నెమళ్ళు చనిపోయాయని వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో పెట్టింది.

ఎప్పుడైతే జేసీబీల కారణంగా జింకలు, నెమళ్ళు చనిపోయాయనే వీడియోలు వెలుగుచూశాయో దేశంలో ఒక్కసారిగా సంచలనమైపోయింది. పర్యావరణ ప్రేమికులు, జంతు, పక్షి ప్రేమికులు సుప్రింకోర్టులో కేసులు దాఖలు చేశారు. ఫొటోలు, వీడియోలను చూసిన సుప్రింకోర్టు కూడా ప్రభుత్వంపై చాలా సీరియస్ అయిపోయింది. ప్రభుత్వ వాదనను ఏమాత్రం పట్టించుకోలేదు. చీఫ్ సెక్రటరీని నానామాటల అనటమే కాకుండా తమఆదేశాలు పాటించకపోతే జైలుకు పంపిస్తామంటు చాలా ఘాటు వ్యాఖ్యలుచేసింది. నిజాలు తెలుసుకునేందుకు సుప్రింకోర్టు నిపుణులను కమిటీని నియిమంచింది. సదరు కమిటి యూనివర్సిటిలో పర్యటించింది. నిపుణుల కమిటీ పర్యటనలో తేలింది ఏమిటంటే సుప్రింకోర్టు చూసిన వీడియోలు, ఫొటోలు Ai జనరేటెడ్ అని. యూనివర్సిటిలోని చెట్ల దగ్గర జింకలు, నెమళ్ళు, పక్షి జాతులున్నది వాస్తవమే అయినా ఫొటోలు, వీడియోల్లో కనబడినన్ని లేవని తేలిపోయింది.

అసలు ఆ వీడియోలు, ఫొటోలు ఎలాగ వచ్చాయి ? ఎలాగంటే బీఆర్ఎస్సే వీటిని బయటకు రిలీజ్ చేసినట్లు రేవంత్, మంత్రులు ఆరోపించారు. ఎప్పుడైతే ఫొటోలు, వీడియోలు వాస్తవంకాదని తేలిపోయిందో వెంటనే ఫొటోలు, వీడియోలు బీఆర్ఎస్ ట్విట్టర్ ఖాతానుండి మాయమైపోయాయి. అయితే అప్పటికే జాతీయస్ధాయిలో రేవంత్ ప్రభుత్వానికి బాగా డ్యామేజి జరిగిపోయింది.

ఇక, రెండో ఉదాహరణ ఏమిటంటే మూసీనది సుందరీకరణ పనుల నేపధ్యంలో ఆక్రమిత ప్రాంతంలో ఇళ్ళను కొట్టడానికి రేవంత్ ప్రభుత్వం ప్రయత్నించినపుడు బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడ్డుపడ్డారు. పేదల ఇళ్ళను కూల్చకుండా మూసీ అభివృద్ధి చేసుకోమని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఇదే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ టేకప్ చేశారు. మూసీనది ఒడ్డును ఆక్రమించి రెండువైపులా నిర్మించిన ఇళ్ళను తొలగించేయాలని ఆదేశించారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయటంలో భాగంగా ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించాలని అసెంబ్లీలో స్వయంగా కేసీఆరే అధికారులను ఆదేశించారు. ఆక్రమణల వెనుక ఎంతటి వారున్నా సరే పట్టించుకోవద్దని కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆక్రమణలను తొలగించటానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి లేదని అసెంబ్లీలోనే ప్రకటించారు. ప్రకటించటమే కాకుండా అయ్యప్పసొసైటీతో పాటు కొన్ని ఏరియాల్లో భవనాలను, నిర్మాణాలను కూల్చేయించారు.

ఇపుడు ఆక్రమణలను, కబ్జాలను తొలగించటానికి రేవంత్ ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్ధను ఏర్పాటుచేస్తే దాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాము అధికారంలో ఉన్నపుడు చేసిన పనులనే ఇపుడు రేవంత్ చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా మద్దతివ్వాల్సిన బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. వ్యతిరేకతలో భాగంగానే రేవంత్ ప్రభుత్వంపై టన్నులకొద్ది బురదను చల్లేస్తు జనాలను రెచ్చగొట్టేట్లుగా మాట్లాడుతోంది. ఇలాంటి అనేక అంశాలను పరిశీలించిన రేవంత్ ప్రభుత్వం హేట్ స్పీచ్ బిల్లును తీసుకుని రావాలని అనుకోవటంలో వింతేమీలేదు. నిరాధార ఆరోపణలను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టే చర్యలను నియంత్రించటానికి, బాధ్యులపై చర్యలు తీసుకోవటానికి మాత్రమే హేట్ స్పీచ్ బిల్లును తెచ్చినట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టేటపుడు ప్రకటించారు. అయితే మంత్రి ఉద్దేశ్యంవరకు మాత్రమే ప్రభుత్వం పరిమితమవుతుందా ? లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళందరిపైనా కేసులు నమోదు చేసి కట్టడికి ప్రయత్నిస్తుందా అన్నది చూడాలి.

Read More
Next Story