
పవన్ పర్యటన రద్దు కారణమిదేనా ?
పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో అన్నీపార్టీలు భగ్గుమన్నాయి
జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన రద్దయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున పవన్ ప్రచారం చేయబోతున్నట్లు ఇటు (Telangana BJP)బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు, అటు జనసేన పార్టీ ఎంతో ఆర్భాటంగా ప్రకటన చేశాయి. ఈనెల 7,8 తేదీల్లో ప్రచారం చేయబోతున్నట్లు (Pawan Kalyan)పవన్ గురించి విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. అయితే ఒక్కరోజు ముందు అంటే 6వ తేదీ సాయంత్రం తెలంగాణలో పవన్ పర్యటన రద్దయ్యిందనే ప్రకటన వచ్చింది.
చివరి నిముషంలో పవన్ పర్యటన ఎందుకు రద్దయ్యిందన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ వర్గాల సమాచారం ఏమిటంటే ఈమధ్య పవన్ కోనసీమలో పర్యటిస్తు కొబ్బరిచెట్లు దెబ్బతినటానికి తెలంగాణ దిష్టే కారణమని వ్యాఖ్యానించారు. అప్పుడు పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో అన్నీపార్టీలు భగ్గుమన్నాయి. తెలంగాణ పట్ల పవన్ లోని వ్యతిరేకత మరోసారి బయటపడిందనే ప్రచారం బాగా జరిగింది. ఇలాంటి నేపధ్యంలో ఇపుడు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తే లాభంకన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుందని బీజేపీలోని కొందరు అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లు సమాచారం. పైగా జనసేనకు ఆంధ్రాపార్టీ అనే ముద్ర కూడా తెలంగాణలో బలంగా ఉంది.
పవన్ అభిమానులు, సీమాంధ్ర జనాలు ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉంటున్నారు. గ్రేటర్ ఎన్నికలు ఇపుడు జరగటంలేదు. ఇతర మున్సిపాలిటీల్లో పవన్ ప్రచారం లాభం ఏమిటనే చర్చ కమలనాదుల్లో మొదలైంది. పవన్ ప్రచారం వల్ల బీజేపీకి లాభంకన్నా నష్టమే ఎక్కువని నిర్ణయించుకునే పవన్ ప్రచారం వద్దని బీజేపీ నేతలు చెప్పినట్లు సమాచారం. అందుకనే చివరి నిముషంలో తెలంగాణ పర్యటనను పవన్ రద్దుచేసుకున్నారని బీజేపీ వర్గాల ద్వారా తెలిసింది. నిజానికి పవన్ ప్రచారం చేయటంవల్ల బీజేపీకి జరిగే లాభం ఏమిటో కమలంపార్టీ నేతలే చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే పవన్ కు తెలంగాణలో ఫాన్ ఫాలోయింగ్ ఎంతుందో తెలీదు. అలాగే పవన్ చెప్పాడని బీజేపీకి ఎంతమంది ఓట్లేస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి.
ఎందుకంటే 2023 ఎన్నికల్లో బీజేపీ పొత్తులో జనసేన 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసింది. ఈ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుకు పవన్ విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే పోటీచేసిన అభ్యర్ధుల్లో ఏ ఒక్కరికీ కనీసం డిపాజిట్టు కూడా రాలేదు. సొంతపార్టీ అభ్యర్ధల కోసం పవన్ అంత తిరిగినా జనాలు పట్టించుకోలేదు. అలాంటిది ఒకవైపు తెలంగాణపై నోటికొచ్చినట్లు మాట్లాడుతు, మళ్ళీ తెలంగాణలోకి వచ్చి బీజేపీ అభ్యర్ధులను గెలిపించండని అడిగితే ఎవరైనా ఓట్లేస్తారా అన్న అనుమానాలు కమలనాదుల్లో పెరిగిపోయింది. అన్నీ కోణాల్లో ఆలోచించుకున్న బీజేపీ నేతలు పవన్ ప్రచారం వల్ల తమకు లాభంకన్నా నష్టమే ఎక్కువని అర్ధంచేసుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తులో లేవు. రెండుపార్టీల అభ్యర్ధులు కొన్ని వార్డుల్లో పోటీచేస్తున్నారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, రియికల్, గద్వాలతో కలిపి మరో 7 మున్సిపాలిటీల్లో అంటే మొత్తం 11 మున్సిపాలిటీల్లోని కొన్ని వార్డుల్లో బీజేపీ, జనసేన అభ్యర్ధులు ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. పై మున్సిపాలిటీల్లో పవన్ ప్రచారం చేస్తే ఎవరి తరపున ప్రచారం చేస్తారు ? బీజేపీ తరపున ప్రచారం చేస్తే సొంతపార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్ధులను తానే దెబ్బకొట్టినట్లవుతుంది. పోనీ సొంతపార్టీ జనసేన అభ్యర్దు తరపున ప్రచారం చేద్దామా అంటే బీజేపీ నేతలు ఎందుకు ఊరుకుంటారు ? రెండు పార్టీల అభ్యర్ధుల్లో ఎవరికి ప్రచారంచేసినా డ్యామేజీ తప్పదు అన్న ఆలోచన కూడా పవన్ తో పాటు బీజేపీ నేతల్లో కూడా మొదలైంది. అందుకనే అన్నీ చూసుకునే చివరినిముషంలో తెలంగాణ పర్యటనను పవన్ రద్దుచేసుకున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం.

