
రేవంత్ కు తలనొప్పిగా తయారైన జగిత్యాల
ఈ మున్సిపాలిటీ పంచాయతీని పరిష్కరించేందుకు ఏకంగా ఏఐసీసీ పరిశీలకుడు సంపత్ రంగంలోకి దిగినా సాధ్యంకావటంలేదు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి జగిత్యాల్ మున్సిపాలిటి పంచాయతీ పెద్ద తలనొప్పిగా తయారైంది. రాష్ట్రంలోని అన్నీ మున్సిపాలిటీలు ఒక ఎత్తయితే జగిత్యాల మున్సిపాలిటి మరో ఎత్తుగా తయారైంది. ఈ మున్సిపాలిటీ పంచాయతీని పరిష్కరించేందుకు ఏకంగా ఏఐసీసీ పరిశీలకుడు సంపత్ రంగంలోకి దిగినా సాధ్యంకావటంలేదు. దీనికి కారణం ఏమిటంటే కాంగ్రెస్ సీనియర్ నేత టీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్ వర్గాలే.
సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించటాన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. సంజయ్ కాంగ్రెస్ లోకి ఫిరాయించిన దగ్గర నుండి రేవంత్ మద్దతు ఎక్కువగా ఫిరాయింపు ఎంఎల్ఏ వైపే ఉందన్నది వాస్తవం. ఈ విషయం జీవన్ రెడ్డికి జీర్ణం కావటంలేదు. అందుకనే ప్రతిరోజు ఏదో కారణంతో సంజయ్ తో జీవన్ గొడవపడుతునే ఉన్నారు. అవసరం ఉన్నా లేకపోయినా సంజయ్ ను వివాదంలోకి లాగి ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో ఇద్దరినీ సర్దుబాటు చేయటానికి చేసిన ప్రయత్నాలన్నీ గతంలో లాగేనే ఫెయిలయ్యాయి. రెండువర్గాల్లో ఎవరికి ఎక్కువ టికెట్లు ఇవ్వాలి అన్న ప్రశ్న వచ్చింది. నిజానికి రెండువర్గాలకు చెరిసగం వార్డులను పంచవచ్చు. జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులున్నాయి. 50 వార్డుల్లో ఇద్దరి వర్గాలకు చెరి 25 టికెట్లు ఇవ్వచ్చు.
అయితే అందుకు జీవన్ రెడ్డి, సంజయ్ అంగీకరించలేదు. ఎవరికి వాళ్ళు తమకే ఎక్కువ టికెట్లు కావాలని పట్టుదలకు పోయారు. దాంతో పార్టీ సంజయ్ వర్గానికి 30 టికెట్లు, జీవన్ వర్గానికి 20 టికెట్లు ఇచ్చింది. అయితే తనకు వచ్చిన 20 వార్డుల్లో అందరితోను నామినేషన్లు వేయించారు జీవన్. అలాగే మరికొన్ని వార్డుల్లో కూడా జీవన్ మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేసి పోటీచేశారు. సరే, ఎవరు ఎలాగ పోటీచేసినా రెండువర్గాలు కలిపి 38 వార్డుల్లో గెలిచారు. మిగిలిన వార్డుల్లో బీజేపీ 6, బీఆర్ఎస్ 4, మజ్లిస్ తరపున ఇద్దరు గెలిచారు. కాంగ్రెస్ తరపున గెలిచిన 38 మందిలో సంజయ్ వర్గీయులు 22 మంది ఉండగా, జీవన్ మద్దతుదారులు 16 మందున్నారు.
ఎక్కువమంది తమ వర్గంవారే గెలిచారు కాబట్టి ఛైర్మన్ పోస్టు తమ వర్గానికే దక్కాలని సంజయ్ పట్టుబడుతున్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా సేవచేయటమే కాకుండా ఇపుడు 16మందిని గెలిపించాను కాబట్టి తన వర్గానికే ఛైర్మన్ పదవి ఇవ్వాలని జీవన్ పట్టుబడుతున్నారు. ఇద్దరిలో ఎవరికి నచ్చచెప్పాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లు ఎంత ప్రయత్నించినా ఎవరూ తగ్గటంలేదు. దాంతో ఏమిచేయాలో పార్టీకి దిక్కుతోచటంలేదు. కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటి ఉండికూడా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పోస్టుల కోసం రెండువర్గాలు గట్టిగా పట్టుబట్టడం వల్లే సమస్య మరింత జటితమైపోతోంది. చివరకు రేవంత్ ఈ సమస్యను ఎలాగ పరిష్కరిస్తారో చూడాలి.

