జీవన్ రెడ్డి రాజీనామాకు కారణాలు ఇవే !
x

జీవన్ రెడ్డి రాజీనామాకు కారణాలు ఇవే !

కాంగ్రెస్ పార్టీ వైఖరి, ఫిరాయింపుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డి. ఫిరాయింపులను పార్టీ అంతర్గత వ్యవహారాల్లోకి ఎలా తెస్తారంటూ ఆగ్రహం.


తెలంగాణ కాంగ్రెస్‌కు జగిత్యాల ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. పార్టీతో తనకున్న 41 సంవత్సరాల బంధానికి స్వస్తి పలికారు. తెలంగాణ కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి వివాదం చాలా కాలంగా కొనసాగుతూ వచ్చింది. పార్టీ వైఖరిపై ఆయన దాదాపు ఏడాదిగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా ఆయనను పార్టీలోనే ఉంచాలని టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రతినిధులు సహా పలువురు నేతలు బుజ్జగింపులు చేసినా లాభం లేకుండా పోయింది. చివరికి బుధవారం ఆయన పార్టీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు జగిత్యాలలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో జీవన్ రెడ్డి వెల్లడించారు. ఆయనతో పాటు సుమారు మూడు వేల మంది కూడా పార్టీని వీడినట్లు తెలిపారు.

అంతేకాకుండా తాను పార్టీకి ఎందుకు రాజీనామా ఇస్తున్నాను అన్న అంశాలపై కూడా జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగానే పార్టీ వైఖరి, సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘1995లో రాష్ట్రమంతా టీడీపీ హవా ఉన్నా.. అప్పుడు కూడా జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. అది అప్పటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఐక్యతకు నిదర్శనం. చంద్రబాబు స్వయంగా వచ్చినా, ఎంఐఎం మద్దతుగా నిలిచినా 93 ఎన్నికల్లో 75 శాతం ఓట్లతో ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత 2006, 2008లో వచ్చిన రెండు ఉపఎన్నికల్లో కూడా ఏఐసీసీ తననే అభ్యర్థిగా ఎన్నుకుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నా జగిత్యాలలో హస్తం హవా తగ్గలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా నేను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఒంటిచేత్తో పోరాడాను’’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

‘‘పది స్థానాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణం’’ అని జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఫిరాయింపులను ప్రోత్సహించడం.. దశాబ్ద కాలం పాటు చేసి పోరాటంపై ఆధిపత్యం చెలాయించడమే అవుతుందని అన్నారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్.. గాంధీభవన్‌లో నిర్వహిస్తే అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా వస్తారు?’’ అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఒక పార్టీ నుంచి గెలిచి.. రాజీనామా చేయకుండా వేరే పార్టీలోకి వచ్చి, ఆ పార్టీ నుంచి అదే అభ్యర్థి పోటీ చేయడం ఏం సంకేతాన్ని ఇస్తుంది? అని కూడా జీవన్ రెడ్డి నిలదీశారు.

అభివృద్ధిలో కలిసివస్తే పర్లేదు కానీ.. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. తన అనుచరుడి హత్య జరిగిన సమయంలో సరైన స్పందన లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై ఓపికగా ఉండలేకపోయానని తెలిపారు. పార్టీ అధిష్ఠానం వైఖరి నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. దీర్ఘకాలం సేవ చేసినప్పటికీ తనకు తగిన గుర్తింపు రాలేదని తెలిపారు. ఇకపై తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది. రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా మారుతాయో గమనించాల్సి ఉంది.

Read More
Next Story