టెన్షన్ పెంచేస్తున్న జీవన్ రెడ్డి
x
Congress senior leader T Jeevan Reddy

టెన్షన్ పెంచేస్తున్న జీవన్ రెడ్డి

పార్టీలో ఉంటు ఇంకా ఎంతకాలం అవమానాలు భరించాలని ఎదురు ప్రశ్నించారు


మాజీమంత్రి, సీనియర్ నేత టీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ పెంచేస్తున్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతు పార్టీమార్పు విషయంలో పునరాలోచిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో ఉంటు ఇంకా ఎంతకాలం అవమానాలు భరించాలని ఎదురు ప్రశ్నించారు. సమయం, సందర్భం వచ్చినపుడు తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. పార్టీలోని తన మద్దతుదారులతో సమయం వచ్చినపుడు చర్చించి నిర్ణయం తీసుకుని తప్పనిసరిగా మీడియాకు చెబుతానని అన్నారు. జగిత్యాలలో పార్టీ పరిస్ధితి ఏమీ బాగాలేదని, బయటపార్టీ నుండి వచ్చిన వాళ్ళకే ఎక్కువ మర్యాద, గౌరవం దక్కుతోందని తన అసంతృప్తిని వ్యక్తంచేశారు.

తాజా వ్యాఖ్యలతో పార్టీలో కొనసాగే విషయంలో జీవన్ ఎంతగా అసంతృప్తితో రగిలిపోతున్నారో అర్ధమవుతోంది. జీవన్ లోని అసంతృప్తికి ప్రధాన కారణం జగిత్యాల నియోజకవర్గం ఎంఎల్ఏ సంజయ్ కుమార్ అనే చెప్పాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్ధిగా జీవన్ పోటీచేస్తే బీఆర్ఎస్ తరపున సంజయ్ పోటీచేశారు. అప్పుడు సంజయ్ గెలిచినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తర్వాత జరిగిన పరిణామాల్లో కొంతకాలానికే సంజయ్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు.

ఎప్పుడైతే సంజయ్ కాంగ్రెస్ లోకి ఫిరాయించారో అప్పటినుండే సంజయ్, జీవన్ మధ్య పెద్ద గొడవే అవుతోంది. ఇద్దరు మద్దతుదారుల మద్య జరిగిన గొడవల్లో జీవన్ మద్దతుదారులు ఒకళ్ళిద్దరు మరణించారు. దాంతో ఇద్దరి మధ్య అప్పటినుండి పచ్చగడ్డి వేయకుండాన భగ్గుమంటోంది. తనను నమ్ముకుని పార్టీ ఫిరాయించాడు కాబట్టి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా సంజయ్ కే ఎక్కువ విలువిస్తున్నాడు. దాంతో జీవన్ మరింతగా మండిపోతున్నారు. ఈమధ్యనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా జగిత్యాల, రాయికల్ వార్డుల్లో మెజారిటి వార్డుల్లో సంజయ్ వర్గీయులకే ఎక్కువ సీట్లు దక్కాయి. అప్పటినుండి జీవన్ అసంతృప్తితో మరింత మండిపోతున్నారు. ఆ అసంతృప్తే జీవన్ పార్టీ మారబోతున్నారనే ప్రచారానికి ఊతమిస్తోంది.

మారితే..ఎందులోకి ?

జీవన్ పార్టీ మారే అవకాశాలు ఎంతున్నాయన్నది ఇప్పటికైతే అనుమానమే. అయితే ఒకవేళ పార్టీ మారాల్సొస్తే ఎందులోకి మారుతారు అన్నది కీలకంగా మారింది. జీవన్ మద్దతుదారుల సమాచారం ప్రకారం బీజేపీలోకి మారటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ మీద సంవత్సరాలుగా పోరాటంచేస్తున్నారు కాబట్టి జీవన్ కారుపార్టీలోకి మారే అవకాశాలు తక్కువనే చెప్పాలి. బీజేపీకి వ్యతిరేకంగా జీవన్ చేసిన పోరాటం పెద్దగా లేదు. పైగా కమలంపార్టీకి కూడా జీవన్ లాంటి సీనియర్ నేతల అవసరం చాలా ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ టికెట్ హామీ ఇస్తే బీజేపీలోకి జీవన్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. బీఆర్ఎస్ మీద పోరాటం, కాంగ్రెస్ మీద అసంతృప్తి రెండు కలిసి జీవన్ ను బీజేపీలో చేరేట్లుగా ఉసిగొల్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదన్నది ఆయన మద్దతుదారుల సమాచారం. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story