‘ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని నేత సంజయ్’
x

‘ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని నేత సంజయ్’

కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంజయ్ జోక్యం చేయడం సరికాదన్న జీవన్ రెడ్డి.


జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు తాను ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పుకోలేని స్థితిలో ఆయన అన్నారంటూ చురకలంటించారు. అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంజయ్ జోక్యం చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే సంజయ్ రాజ్యాంగ నిబంధనలు నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని జీవన్ రెడ్డి అన్నారు. ఆయన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని తెలిపారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనే నిర్ణయించుకోలేకపోతున్నాడని విమర్శించారు.

నియోజకవర్గ అభివృద్ధి అంశంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థిస్తూ ఎమ్మెల్యే సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం మాత్రం పూర్తిగా తప్పని అన్నారు. సంజయ్ ఎవరు కాంగ్రెస్ వ్యవహారాల్లో తలదూర్చడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన రాజకీయ జీవితాన్ని వివరిస్తూ జీవన్ రెడ్డి కీలక విషయాలను ప్రస్తావించారు. 1983 ఎన్నికల్లో టీడీపీ పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఎమ్మెల్యేగా మంత్రిగా జగిత్యాల ప్రజలకు సేవ చేశానని గుర్తు చేశారు. ఆ తర్వాత టీడీపీలో చంద్రబాబు నాయుడు ఆధిపత్యంతో విభేదించి నాదెండ్ల వర్గంలో చేరిన విషయాన్ని వెల్లడించారు. అప్పట్లో తాను స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు.

1985లో పార్టీ పిరాయింపుల చట్టం అమలులోకి వచ్చిందని గుర్తు చేస్తూ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సంజయ్‌కు హితవు పలికారు. గత దశాబ్దాలుగా పార్టీ పిరాయింపులపై తాను ప్రశ్నలు వేస్తూనే ఉన్నానని అన్నారు. అభివృద్ధి అంశంపై సంజయ్ తన వద్దే నేర్చుకోవాల్సి ఉంటుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సంజయ్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన తర్వాత కార్యకర్తలకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. కార్యకర్తల హక్కులు హరించబడినట్టు పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ కార్యకర్తల అభిప్రాయాలతో సహా అధిష్టానానికి తెలియజేశానని జీవన్ రెడ్డి వెల్లడించారు. నువ్వెవ్వడివి మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మాట్లాడడానికి అంటూ సంజయ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు జరిగిన అన్యాయంపై తాను పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంజయ్ జోక్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు.

Read More
Next Story