
బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి ?
వివాదం చివరకు పెరిగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచించేట్లుగా పెరిగిపోయింది
మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీ జీవన్ రెడ్డి తొందరలో బీఆర్ఎస్ లో చేరబోతున్నారా ? ఆయన మద్దతుదారుల సమాధానం అయితే అవుననే వినబడుతోంది. దశాబ్దాలుగా పార్టీలో సాఫీగా సాగిన జీవన్ ప్రయాణం 2023 ఎన్నికల్లో పెద్ద కుదుపుకు లోనైంది. ఎలాగంటే ఆఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి పోటీచేసిన జీవన్ పైన బీఆర్ఎస్ అభ్యర్ధి డాక్టర్ సంజయ్ కుమార్ గెలిచారు. తాను ఓడిపోయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని జీవన్ సంతోషించారు. అయితే ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఎలాగంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏ సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అప్పటినుండి సుమారుగా ఏడాదిన్నరగా జీవన్-సంజయ్ మధ్య పెద్ద వివాదమే నడుస్తోంది.
ఆ వివాదం చివరకు పెరిగి పెద్దదైపోయి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచించేట్లుగా పెరిగిపోయింది. ఆదివారం కీలకమైన మద్దతుదారులతో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ లో కొనసాగే విషయమై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు ఈమధ్యనే జీవన్ ప్రకటించారు. తనకు గౌరవం, మర్యాదలేని పార్టీలో ఉండదలచుకోలేదని డైరెక్టుగానే చెప్పారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతల్లో చాలామందితో జీవన్ చాలాకాలంగా అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏ సంజయ్ కు రేవంత్, పార్టీలో తనకన్నా ఎక్కువ గౌరవం దక్కుతోందన్నది జీవన్ కోపం. అయితే ఆ కోపాన్ని చల్లార్చేపని మాత్రం జరగలేదు. అందుకనే ఇక పార్టీలో ఉండి లాభంలేదని డిసైడ్ అయినట్లు మద్దతుదారులు చెబుతున్నారు. చివరగా ఆదివారం మీటింగ్ పెట్టుకుని అందరి అభిప్రాయాలు తీసుకుని రాజీనామా విషయాన్ని ప్రకటించాలని జీవన్ రెడ్డి డిసైడ్ అయినట్లు సమాచారం.
జగిత్యాలలో ఆరుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన జీవన్ కు పార్టీ అనుబంధం ఫిరాయింపు ఎంఎల్ఏ సంజయ్ కారణంగా తెగిపోతోందని ఆయన అభిమానులు, మద్దతుదారులు మండిపోతున్నారు. జీవన్ ను చల్లబరిచేందుకు రేవంత్, సీనియర్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం కనబడలేదు. ఈమధ్యనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా జగిత్యాల మున్సిపాలిటీలోని 50 వార్డుల్లో అత్యధిక వార్డుల్లో సంజయ్ మద్దతుదారులకే అధిక టికెట్లు దక్కాయి. దాంతో తన మద్దతుదారులు పోటీచేసిన వార్డుల్లో మాత్రమే జీవన్ ప్రచారం చేశారు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇటు సంజయ్ మద్దతుదారులు, అటు జీవన్ మద్దతుదారుల్లో ఎక్కువమంది గెలిచారు. దాంతో సంజయ్ మద్దతుదారుల్లో గెలిచిన వారినే పార్టీ ఛైర్మన్ గా నియమించింది. అప్పటినుండి జీవన్ సంజయ్ ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏపై అనర్హత వేటుపడుతుందేమో అని జీవన్ వెయిట్ చేశారు. చివరకు వేటుపడే అవకాశం లేదని తేలిపోయింది.
ఇదే సమయంలో బీఆర్ఎస్ కు కూడా జగిత్యాలలో గట్టి నేతలేడు. అందుకనే కేసీఆర్, కేటీఆర్-జీవన్ కు కావాల్సిన వాళ్ళు రంగంలోకి దిగి ఇరువైపులా ఫోన్లో మాట్లాడించినట్లు తెలిసింది. తనకు కావాల్సిన భరోసాను జీవన్ తీసుకున్న తర్వాత రేపు మీటింగ్ ను ఏర్పాటు చేసినట్లు పార్టీవర్గాల సమాచారం. మరి షెడ్యూల్ ప్రకారం ఆదివారం మీటింగు జరుగుతుందా ? జీవన్ ఏమి నిర్ణయం తీసుకుంటారు, ప్రకటిస్తారన్నది ఆసక్తిగా మారింది.

