
కారెక్కిన జీవన్ రెడ్డి.. కేటీఆర్ ఆహ్వానానికి గ్రీన్ సిగ్నల్
కేసీఆర్‌తో సమావేశం తర్వాత కేటీఆర్ జగిత్యాల పర్యటన, ఫ్లెక్సీల్లో జీవన్‌రెడ్డి ఫోటోతో రాజకీయ చర్చలు వేగం పుంజుకున్నాయి.
జగిత్యాల ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారెక్కారు. గులాబీ కండవా కప్పుకున్నారు. తీవ్ర అసంతృప్తి కారణంగా 41 ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయన ఇటీవల గుడ్‌బై చెప్పారు. కాగా తాజాగా ఆయనను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి.. బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. కేటీఆర్ ఆహ్వానాన్ని జీవన్ రెడ్డి స్వీకరించారు. గులాబీ గూటికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు జీవన్ రెడ్డి రెడ్డి కూడా అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ పాలనపై జీవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి పాలన కన్నా కేసీఆర్ పాలన చాలా బాగుందని, కేసీఆర్ హయాంలో తెలంగాణ పురోగతిని చూసిందని చెప్పారు. కానీ ఇప్పుడు రేవంత్ పాలనతో అంతా తిరోగమనమే కనిపిస్తోందని, అన్ని రంగాల్లో తెలంగాణ వెనకకు వెళ్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలన చూసిన ప్రజలు ఇంకా బెటర్ ఆప్షన్ కావాలని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. ఆ కాంగ్రెస్ సర్కార్ అన్ని విషయాల్లో విఫలమయిందని చురకలంటించారు. ప్రజలకు మేలు చేయడమేమో కానీ అంతా ఇబ్బందులు పెట్టడమే కాంగ్రెస్ పాలనలో జరిగిందని విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రచార ఆర్భాటాలు, జబ్బలు చర్చుకోవడం తప్ప ప్రజల కోసం చేసింది శూన్యమని అన్నారు జీవన్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటు కల కేసీఆర్‌తోనే సాధ్యమైందని, దానిని ఎవరూ మరువలేరని అన్నారు. రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ అద్భుతంగా పాలించారన్న భావన ప్రజల్లో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
గురువారం ఉదయం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేటీఆర్, వినోద్‌కుమార్, రమణ కలిశారు. ఈ సమావేశంలో జీవన్‌రెడ్డి చేరిక అంశంపై సుమారు అరగంట పాటు చర్చించారు. అనంతరం కేటీఆర్ జగిత్యాలకు బయల్దేరారు. కేటీఆర్‌తో చర్చల తర్వాత జీవన్ రెడ్డి కీలక ప్రకటన వెలువరించారు. తన రాజకీయ ప్రయాణంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు. 1983లో కాంగ్రెస్‌లో చేరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, రెండుసార్లు మంత్రి, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. అయితే ఇటీవలి పరిణామాలతో అసంతృప్తి చెంది 43 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగానే బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో విజయం బీఆర్‌ఎస్‌దేనని, కేసీఆర్ పాలన మెరుగైనదని అభిప్రాయపడ్డట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, హామీల అమలు లోపించిందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అలాగే తెలంగాణ అభివృద్ధి గతంలో వేగంగా జరిగిందని, ఇప్పుడు వెనుకబడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు మెరుగైన పాలన కోసం అవకాశమిచ్చారని, కానీ ఆ ఆశలు నెరవేరలేదని పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆయన అధికారిక చేరికపై పార్టీ వర్గాలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

