కాళేశ్వరం ఉపయోగం లేని ప్రాజెక్ట్: కిషన్ రెడ్డి
x

కాళేశ్వరం ఉపయోగం లేని ప్రాజెక్ట్: కిషన్ రెడ్డి

రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు వెల్లువెత్తాయి.


కాళేశ్వరం రచ్చ.. రాజ్యసభకు చేరింది. ఎగువ సభలో కాళేశ్వరం నిర్మాణం, నిధులు అంశంపై తీవ్ర చర్చ జరిగింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ సందర్భంగానే కాళేశ్వరం ఒక ఉపయోగం లేని ప్రాజెక్ట్ అని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నుంచి ఎటువంటి సహాయం అందకపోయినా తమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రాల విభజనపై బీజేపీ స్పష్టమైన వైఖరి చెప్పాలని కోరారు. అలాగే తెలుగు రాష్ట్రాలు వేరైనా సోదరులుగా ఉండాలని కేసీఆర్ అప్పట్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతికి మద్దతుగా కేసీఆర్ వ్యవహరించారని, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలంగాణలో సాగునీటి విస్తీర్ణం పెరగడంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు.

సురేష్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనం లేదని కేంద్ర సంస్థలు నివేదికలు ఇచ్చాయని ఆయన చెప్పారు. మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీల్లో లోపాలను నిపుణులు గుర్తించినట్లు వివరించారు. కాగ్ నివేదికలో కూడా ఆర్థిక అవకతవకలు, నిర్వహణ లోపాలు బయటపడ్డాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ఒక కుటుంబానికి ఏటీఎంలా మారిందే తప్ప, ప్రజలకు ఏమీ చేయాలేదని కిషన్ రెడ్డి అన్నారు.

కేసీఆర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ ఎందుకు జరగలేదని కూడా కిషన్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందని, అందుకే కేసీఆర్ వచ్చిన ఆరోపణలపై ఎటువంటి విచారణ జరగలేదని అన్నారు. మొత్తంగా రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ కాస్త కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రాజకీయ వాగ్వాదంగా మారింది.

Read More
Next Story