Kavitha Kalvakuntla
x

మే నెలలో కొత్త పార్టీ, పోటీ ఎక్కడి నుంచో చెప్పిన కవిత !

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన టార్గెట్ నియోజకవర్గాలపై కూడా కవిత క్లారిటీ.


తన కొత్త పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. మే నెలలో తన పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు చెప్పారు. తన పార్టీకి సంబంధించిన విధివిధానాలు సిద్ధమయ్యాయని, పార్టీ పేరులో తెలంగాణ అనే పదం ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంలో పార్టీ రిజిస్ట్రేషన్ పనులు కూడా షురూ చేసినట్లు చెప్పారు. ఎంతో కాలంగా కవిత పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కీలక చర్చగా ఉంది. ఈ అంశానికి కొంతకాలం క్రితమే కవిత.. తను పార్టీ పెడతానని చెప్పి తెరదించారు. ఈ సమయంలోనే ఆమె ఏ ఎన్నికల్లో పోటీ చేస్తారు? అన్నది చర్చకు దారితీసింది. అయితే ఇప్పుడు ఈ అంశంపై కూడా క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ప్రాధాన్యత ఇస్తాను అన్న విషయాన్ని కూడా తెలిపారు.

టార్గెట్ సిద్ధపేట

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్ధిపేట నుంచి పోటీ చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. అది వీలు పడకపోతే తన రెండో ఎంపిక బోధన్ అని చెప్పారు. అంటే ఆమె టార్గెట్ హరీష్ రావేనా? అన్న చర్చ మొదలైంది. కాగా రెండో ప్రిఫరెన్స్‌గా బోధన్ చెప్పడంతో మొత్తం బీఆర్ఎస్ టార్గెట్‌గా ఉన్నారా? అన్న చర్చ కూడా మొదలైంది.

పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కవిత.. హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కూడా హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అనేక సందర్భాల్లో హరీస్ రావును పరోక్షంగా విమర్శిస్తూ, ఆయనపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఎన్నికల పోటీలో హరీష్ రావు నియోజకవర్గం సిద్ధపేటనే ఆమె తన తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్నారని చర్చ జరుగుతోంది.

బోధన్ ఎంపిక వెనక కారణం అదే..

అంతేకాకుండా తన రెండో ఎంపికగా బోధన్ నియోజకవర్గాన్ని కవిత ఎంచుకున్నారు. ఆమె తొలుత నిజామాబాద్ ఎంపీగా పార్లమెంట్‌కు వెళ్లారు. రెండోసారి పోటీ చేసినా నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించలేదు. ఆ సమయంలో బోధన్ కూడా ఆమె ఎంపీ నియోజకవర్గంలో భాగంగానే ఉండేది. తాను ఎంపీగా ఉన్న సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీలోని కొన్ని శక్తులు కావాలనే తనను జిల్లా దాటి బయటకు రానివ్వలేదని కవిత పలుమార్లు వ్యాఖ్యానించారు. అందుకనే ఈసారి బోధన్‌లో పోటీ చేయడానికి కూడా ఆమె ఇంట్రస్ట్ చూపిస్తున్నారిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనను ఎక్కడయితే కట్టడి చేద్దాం? అనుకున్నారో అక్కడే తాను స్వతంత్రంగా అధికారం చేపట్టాలన్న ఆలోచనలో కవిత ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.

‘తెలంగాణలో బీజేపీ కనుమరుగు’

భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ కనిపించదని కవిత వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని, ప్రజల సమస్యలపై పోరాడతామని అన్నారు. ఎంపీటీసీ, జడ్‌పీటీలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ వేసిన బాటలోనే వెళ్తోందని, కొత్త తరహా రాజకీయం చేయడం లేదని అన్నారు. తన పార్టీ వ్యక్తులపై కాకుండా వ్యవస్థలపై నడవాలని అన్నారు. ప్రాంతీయ పార్టీలంటేనే సాధారణంగా నాయకుడు కేంద్రంగా నడుస్తాయని, కానీ తన పార్టీ మాత్రం వ్యవస్థ ఆధారంగా ఉండనుందని చెప్పారు.

నా ప్రయత్నం నాది: కవిత

‘‘వైఎస్ షర్మిల.. తెలంగాణలో పార్టీ పెట్టారు. కానీ ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్‌లో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె ఇక్కడ పార్టీ పెట్టడం ప్రజలకు నచ్చలేదు. అదే విధంగా గతంలో నటుడు చిరంజీవి కూడా పార్టీ పెట్టి ఆ తర్వాత దానిని కాంగ్రెస్‌‌లో విలీనం చేశారు. అదే విధంగా నేను నా లైన్‌లో వెళ్తున్నా. నా ప్రయత్నం నాది’’ అని కవిత అన్నారు. తన పార్టీ వాదన తెలంగాణ వాదమేనని స్పష్టం చేశారు. ఎన్‌టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో కింది నుంచి వచ్చిన వాళ్లు మంత్రులు, కేంద్రమంత్రులు అయ్యారని గుర్తు చేశారు. అదే విధంగా తాను పెట్టనున్న పార్టీలో కొత్త తరానికి అవకాశాలు ఉంటాయని వెల్లడించారు.

Read More
Next Story