
బడ్జెట్ ప్రవేశపెట్టిన కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత గురువారమే బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏమిటి ?
తెలంగాణలో ఉన్నది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కదా. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆర్ధికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత గురువారమే బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏమిటి ? ఏమిటంటే కవిత వింతపోకడలకు పోయారు. ఉగాదిపండుగ సందర్భంగా జాగృతి కార్యాలయంలో ‘ప్రజాబడ్జెట్’ పేరుతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మామూలుగా బడ్జెట్ అంటే ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే వ్యయ, ఆదాయాల పట్టిక. మొదలవబోతున్న ఆర్ధికసంవత్సరానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఇతర పథకాలకు ప్రభుత్వం చేయబోయే వ్యయాలు, కేటాయింపులు, అంచనా ఆదాయాలు తదితరాలను సవివరంగా చెప్పటమే బడ్జెట్. బడ్జెట్ ప్రవేశపెట్టడం వెనుక అనేకశాఖల ఉన్నతాధికారుల కృషి చాలా ఉంటుంది. అలాంటిది కవిత చాలా సింపుల్ గా తన కార్యాలయంలో ప్రజాబడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
రాష్ట్ర బడ్జెట్ ను రు. 2,15,200 కోట్లతో కవిత ప్రకటించారు. తమ బడ్జెట్లో విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు ప్రకటించారు. తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ నే రేవంత్ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టాలని చెప్పటం మరీ వింతగా ఉంది. అసలు ప్రతిపక్షాలకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశమే ఉండదు. బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటేనే అధికారపార్టీ వ్యవహారం. అలాంటిది కవితకు ప్రతిపక్ష పార్టీ హోదా కూడాలేదు. ఎందుకంటే కవిత పెట్టబోయే రాజకీయపార్టీని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంకా రిజిస్టర్ కూడా చేయలేదు. తెలంగాణలో ఇపుడు ప్రతిపక్షాలంటే బీఆర్ఎస్, బీజేపీలు మాత్రమే. మిగిలిన పార్టీలకు అసెంబ్లీపరంగా ఎలాంటి గుర్తింపులేదు.
ఇలాంటి పరిస్ధితిలో తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఇకపై ప్రతి ఉగాది సందర్భంగా ప్రజాబడ్జెట్ ను ప్రవేశపెడతానని ప్రకటించటమే చాలా విచిత్రంగా ఉంది. తాను ప్రవేశపెట్టిన రు. 2.15 లక్షల కోట్లకు అదనంగా మరో లక్ష కోట్లరూపాయల వరకు బడ్జెట్ కేటాయింపులు చేసుకునే వెసులుబాటు ఇచ్చినట్లు ప్రభుత్వానికి కవిత బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ లక్ష కోట్ల రూపాయలతో ప్రారంభించబోయే పథకాలకు గాంధీ కుటుంబసభ్యులే కాదు తమకు నచ్చినవారి పేర్లతో ఎన్ని పథకాలైనా ప్రకటించుకోవచ్చని చెప్పారు. తాను ప్రతిపాదించిన బడ్జెట్ మొత్తం ప్రజాసంక్షేమం, రాష్ట్ర పురోగతికి ఉపయోగపడుతుందని చెప్పటమే హైలైట్. ప్రజల నుండి వచ్చిన సూచనల ప్రకారమే తాను ప్రజాబడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు చెప్పటమే బ్రహ్మాండం. కవిత చెప్పిందంతా విన్నతర్వాత ఏమి మాట్లాడాలో అక్కడ ఉన్నవారికి అర్ధంకాలేదు.

