
వేట మొదలుపెట్టిన కల్వకుంట్ల కవిత
హరీష్ ను ఎలాగైనా సరే ఓడించి కసి తీర్చుకోవాలని కవిత బలంగా ఫిక్సయినట్లున్నారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన వేటను ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు గురువారం ప్రకటించిన కవిత తాను పోటీచేయబోయే అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా ప్రకటించారు. సిద్ధిపేట లేదా బోధన్ నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట నుండి పోటీచేయటం ఖాయమని స్పష్టంచేశారు. సిద్ధిపేటలో పోటీచేయటమే తన మొదటి ఛాయిస్ అని కూడా తేల్చిచెప్పేశారు. అందుకనే కవిత తన వేటను ప్రారంభించారు అని చెప్పింది. కవిత ఏమిటి ? వేట మొదలుపెట్టడం ఏమిటి అనుకుంటున్నారా ?
ఇపుడు సిద్ధిపేటలో బీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నది తన్నీరు హరీష్ రావు. బీఆర్ఎస్ లో నుండి కవితను బయటకు గెంటేసిన విషయం తెలిసిందే. తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ తో గ్యాప్ రావటానికి, పార్టీలో నుండి గెంటేయటానికి హరీష్, సంతోషే ప్రధాన కారణమని కవిత చాలాసార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. పార్టీ నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి కవిత పదేపదే కేటీఆర్, హరీష్, సంతోష్ ను టార్గెట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిలో కూడా హరీష్ పైన కవిత ఆరోపణలతో డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ పాత్ర చాలా కీలకమన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో హరీష్ వాటాలు తీసుకున్నట్లు చాలాసార్లు ఆరోపించారు.
అవినీతి గురించే కాదు హరీష్ వల్ల బీఆర్ఎస్ కు ఏ విధంగా నష్టాలు జరిగాయన్న విషయాన్ని తన జనంబాట కార్యక్రమంలో చాలా జిల్లాల్లో వివరించి చెప్పారు. పార్టీ ఓటమిలో హరీష్ పాత్ర కూడా తక్కువేమీ కాదని చాలాసార్లు మండిపడ్డారు. చివరకు టెలిఫోన్ ట్యాపింగులో కూడా హరీష్ పాత్రుందన్నట్లుగానే ఆరోపించారు. కవిత ఆరోపణలు, విమర్శలను గమనిస్తే కేసీఆర్, కేటీఆర్ మీదకన్నా హరీష్ మీదే ఆమెకు పిచ్చకోపం ఉన్నట్లు అర్ధమైపోతుంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధిపేటే మొదటి ఛాయిస్ అని ప్రకటించింది. హరీష్ ను ఎలాగైనా సరే ఓడించి కసి తీర్చుకోవాలని కవిత ఫిక్సయినట్లున్నారు. అందుకనే సిద్ధిపేటలో హరీష్ ను ఓడించాలని బలంగా కోరుకుంటున్నారు.
సిద్ధిపేట పరిస్ధితి ఏమిటి ?
సిద్ధిపేటలో హరీష్ ను ఓడించటం చెప్పినంత సులభంకాదు. ఎందుకంటే 2004 ఎన్నికల నుండి 2023 వరకు హరీష్ ఆరుసార్లు ఓటమి ఎరుగకుండా గెలుస్తునే ఉన్నారు. హ్యాట్రిక్ ఎంఎల్ఏ అనిపించుకోవటమే చాలామందికి కష్టం. అలాంటిది హరీష్ డబుల్ హ్యాట్రిక్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. సిరిసిల్లలో కేటీఆర్ కన్నా సిద్ధిపేటలో హరీష్ చాలా పవర్ ఫుల్ అనే చెప్పాలి. హరీష్ కు ప్రజా నేతగా బాగా పేరుంది. 2004లో కేసీఆర్ సిద్ధిపేటను ఖాళీచేసిన దగ్గర నుండి ఆ సీటులో హరీష్ పోటీచేసి గెలుస్తునే ఉన్నారు. 2023 ఎన్నికల్లో హరీష్ కు 1,05,514 ఓట్లు పోలైతే, కాంగ్రెస్ అభ్యర్ధి పూజల హరికృష్ణకు 23,206 ఓట్లు పడ్డాయంతే. అంటే హరీష్ 82,308 ఓట్ల మెజారిటితో గెలిచారు. దీన్నిబట్టే హరీష్ ట్రాక్ రికార్డును అర్ధంచేసుకోవచ్చు.
అయితే ఈవిషయాలు తెలియకుండానే కవిత సిద్ధిపేటను ఎంచుకున్నారని అనుకునేందుకు లేదు. బీఆర్ఎస్ పార్టీగురించి, హరీష్ వ్యక్తిగత బలంగురించి కవితకు పూర్తి సమాచారం ఉండే ఉంటుంది. అయినా సరే బోధన్ తో పాటు సిద్ధిపేటను కూడా ఎంచుకున్నారంటే ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. సిద్ధిపేటలో ఈపాటికే బీఆర్ఎస్, హరీష్ పరిస్ధితిపై గ్రాస్ రూట్ లెవల్లో సర్వేలు చేయించుకునే ఉంటారు. తానుపోటీచేస్తే గెలుపు అవకాశాలు ఎంత ఉంటాయనే విషయంపై సమాచారం తెప్పించుకోకుండానే ప్రకటన చేసుంటారు అనుకునేందుకు లేదు. ఏదేమైనా హరీష్ ను ఓడించటం కవితకు అంత వీజీ కాదన్నది మాత్రం వాస్తవం. మంచిదే, ఇద్దరు పెద్దపర్సనాలిటీలు ఒకేనియోజకవర్గంలో ప్రత్యర్ధులుగా పోటీచేస్తే వచ్చే మజాయే వేరబ్బా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హరీష్-కవిత-కాంగ్రెస్-బీజేపీ తరపున అభ్యర్ధులు పోటీచేస్తే లాభం ఎవరికి ? నష్టపోయేదెవరు ?
బోధన్ ఎందుకు ?
ఇక బోధన్ గురించి చూస్తే 2014-19 మధ్య కవిత నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా పోటీచేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీల్లో బోధన్ కూడా ఒకటి. పైగా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం ఏ పార్టీకీ కంచుకోట అని చెప్పేందుకు లేదు. గడచిన నాలుగు ఎన్నికలనే తీసుకుంటే రెండుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు బీఆర్ఎస్ గెలిచాయి. 2009లో కాంగ్రెస్ తరపున పీ సుదర్శనరెడ్డి గెలిస్తే, 2014లో మొహమ్మద్ షకీల్ అమీర్ బీఆర్ఎస్ తరపున గెలిచారు. 2018లో రెండోసారి కూడా అమీర్ గెలిస్తే, 2023 ఎన్నికల్లో మళ్ళీ పీ సుదర్శన్ రెడ్డి విజయంసాధించారు. ఈఫలితాలను బట్టిచూస్తేనే అర్ధమవుతోంది నియోజకవర్గం ఏకపార్టీకి కంచుకోట కాదని. బహుశా ఈవిషయాలను గమనించిన తర్వాతే కవిత బోధన్ ను కూడా ఎంచుకున్నారేమో.
అయితే బోధన్ తో పాటు సిద్ధిపేటలో పోటీచేసే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు చెప్పి సిద్ధిపేటే తన మొదటి ఛాయిస్ అన్నారు. బహుశా ఎందుకైనా మంచిదని రెండు నియోజకవర్గాల్లోను కవిత పోటీచేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. మే నెలలో ముహూర్తం చూసుకుని పార్టీ పేరును ప్రకటించబోతున్నట్లు కవిత చెప్పారు. అప్పటికి రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

