
సంక్షేమానికి నిధుల కొరత-ప్రకటనలకు కోట్ల ఖర్చు
కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు
కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ఒకవైపు భారీగా అప్పుల్లో కూరుకుపోయి సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడంలో ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు వార్తాపత్రిక ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్చి 2026 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.7.64 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. తర్వాత బడ్జెట్ కోసం మరో రూ.1.16 లక్షల కోట్లు రుణం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన VB-G RAM G పథకాన్ని విమర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రధాన వార్తాపత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చింది. ఫిబ్రవరి 3న కన్నడ, ఇంగ్లీష్ సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లో మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిస్పందనగా ఫిబ్రవరి 6న బీజేపీ కూడా వ్యంగ్య ప్రకటన విడుదల చేసి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.
ప్రకటనల ఖర్చుపై చర్చ..
ప్రకటనల రేట్లు పత్రికల బ్రాండ్, సర్క్యులేషన్ ఆధారంగా వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా ప్రభుత్వ ప్రకటనల రేట్లు ప్రైవేట్ ప్రకటనల కంటే ఎక్కువగా ఉంటాయని ప్రకటన రంగ వర్గాలు చెబుతున్నాయి. సమాచార, ప్రజా సంబంధాల శాఖ ధరల జాబితా ప్రకారం.. ఒక రాష్ట్ర స్థాయి కన్నడ దినపత్రికలో పూర్తి పేజీ ప్రకటనకు సుమారు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఆంగ్ల దినపత్రికలలో ఇదే ప్రకటన ఖర్చు కనీసం రూ.13–14 లక్షల వరకు ఉంటుంది. రాష్ట్ర, ప్రాంతీయ, జిల్లా స్థాయి కలిపి వెయ్యికి పైగా పత్రికలు సమాచార శాఖ గుర్తింపులో ఉన్నాయని అంచనా. ఈ లెక్కల ప్రకారం ఒకే రోజు ప్రకటనల ఖర్చు సుమారు రూ.2 కోట్లకు పైగానే ఉండొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
విమర్శకుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రకటనలు ప్రభుత్వ పథకాలను ప్రోత్సహించడానికి గానీ, ప్రజా అవగాహన కోసం గానీ కాకుండా రాజకీయ సందేశాల కోసం ఉపయోగించారని ఆరోపిస్తున్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చడం సులభం కాదన్న వాదనల మధ్య, పన్ను చెల్లింపుదారుల డబ్బు ప్రకటనలపై ఖర్చవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సంక్షేమ పథకాలపై ప్రభావం..
మరోవైపు, రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు నిధుల కొరతతో నిలిచిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతు ఆత్మహత్యల కుటుంబాలకు హామీ ఇచ్చిన పరిహారం పూర్తిగా అందలేదని సమాచారం. గత రెండేళ్లలో ఆత్మహత్య చేసుకున్న 223 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందలేదని ప్రతిపక్ష వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో నమోదైన 86 కేసులు ఇంకా సమీక్ష దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
విద్యా రంగంలోనూ సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. విద్యా సంవత్సరం ముగిసినా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు, సాక్స్ పంపిణీ జరగలేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. గృహనిర్మాణ పథకాలకు నిధుల విడుదల ఆలస్యం కాగా, స్కాలర్‌షిప్‌ల పంపిణీ కూడా నిలిచిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాల విద్యార్థులకు అందించిన సైకిళ్ల నాణ్యతపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఆరోగ్య రంగంలోనూ నిధుల కొరత ప్రభావం కనిపిస్తోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినంత మందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ వైద్య అధికారుల సంఘం ఇటీవల లేఖ రాసింది. ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బంది కొరత ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు అంగీకరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రకటనలపై భారీ ఖర్చు అవసరమా, లేక సంక్షేమ రంగాలపై దృష్టి పెట్టాలా అన్న ప్రశ్న రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

